ఉపాసన ఎఫెక్ట్: చిరంజీవి, రాంచరణ్ ని ఆహ్వానించిన మోడీ!

By tirumala ANFirst Published Nov 1, 2019, 3:17 PM IST
Highlights

సైరా విజయం తర్వాత మెగా క్యాంప్ ఎంతో సంతోషంగా ఉంది. సైరా చిత్రంతో ఉయ్యాలవాడ జీవిత చరిత్రలో నటించాలనే చిరంజీవి దశాబ్దాల కల నెరవేరింది. రాంచరణ్ సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ లో నిర్మించాడు. 

తొలి తెలుగు స్వాతంత్రసమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన సైరా నరసింహారెడ్డి ఘనవిజయాన్ని సొంతం చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రానికి రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఉయ్యాలవాడ పాత్రలో మెగాస్టార్ ఒదిగిపోయి నటించారు. 

సురేందర్ రెడ్డి చక్కటి స్క్రీన్ ప్లేతో సైరా చిత్రాన్ని ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా తెరకెక్కించారు. నయనతార కథానాయికగా, తమన్నా కీలక పాత్రలో నటించారు. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ ఈ చిత్రంలో గోసాయి వెంకన్నగా చిరంజీవి గురువు పాత్రలో మెరిసిన సంగతి తెలిసిందే. 

ఇదిలా ఉండగా ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. భారత ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుని కలసి సైరా చిత్రాన్ని ఆయనకు ప్రత్యేకంగా ప్రదర్శించారు. అదే సమయంలో చిరు అమిత్ షా, ప్రధాని మోడీని కలుస్తారనే వార్తలు కూడా వినిపించాయి. కానీ చిరంజీవి మోడీని కలవకుండానే వెనుదిరిగారు. 

ఇటీవల మహాత్మా గాంధీ 150వ జన్మదినవేడుకలని పురస్కరించుకుని మోడీ ఓ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అమిర్ ఖాన్ లని ఆహ్వానించిన సంగతి తెలిసిందే. కంగనా రనౌత్, జాక్వెలిన్ ఫెర్నాండేజ్ లాంటి బాలీవుడ్ భామలు కూడా ఈ కార్యక్రమంలో మెరిశారు. 

ఈ కార్యక్రమంలో సౌత్ సినీ ప్రముఖులకు ఆహ్వానం అందలేదు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అయ్యాయి. రాంచరణ్ సతీమణి ఉపాసన ఈ విషయంలో నేరుగా ట్విట్టర్ వేదికగా ప్రధాని మోడీని ప్రశ్నించారు. భారత చిత్ర పరిశ్రమలో దక్షిణాదివారు కూడా భాగమని, ఇక్కడ ఉన్న సినీ దిగ్గజాలని కూడా ఆహ్వానించి ఉండాల్సిందని ఉపాసన మోడీకి తెలియజేస్తూ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. 

ఉపాసన చేసిన ఈ ట్వీట్ దెస వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. తమిళ సీనియర్ హీరోయిన్ ఖుష్బూ కూడా ఉపాసనతో గొంతు కలిపి మోడీని ప్రశ్నించింది. బహుశా ఏఈ విషయం మోడీ దృష్టికి వెళ్లిందో ఏమో కానీ.. తాజాగా చిరంజీవి, రాంచరణ్ లని ప్రధాని మోడీ ఆహ్వానించారు. 

ఈ విషయాన్ని రాంచరణ్ ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. ప్రధాని నుంచి ఆహ్వానం అందింది. త్వరలోనే ప్రధానికి కలవబోతున్నట్లు రాంచరణ్ ప్రకటించాడు. ఈ భేటీలో తప్పకుండా సైరా చిత్రం గురించి మోడీ ప్రస్తావించే అవకాశం ఉంది.  

click me!