పాత బంగారం: ‘గుండమ్మ కథ’సినిమా టైమ్ లో గమ్మత్తు!

By AN TeluguFirst Published Nov 28, 2019, 11:54 AM IST
Highlights

ఆ రోజు  డి.వి.నరసరాజు గారు  గుండమ్మ కథ కి డైలాగులు వ్రాయడం మొదలుపెట్టారు. సినిమాలో కీలకమైన సన్నివేశంలో అక్కినేని... గుండమ్మ ఇంటికి వచ్చి, మారువేషం లో అంజి గా వున్న అన్న ఎన్టీఆర్ ను తన ప్రేయసి ఇంట్లోనే వుందా అని అడగాలి .

సినిమాల్లో కొన్ని సంభాషణలు, సన్నివేశాలు మరుపురానివిగా జనాల మదిలో నిలిచిపోతాయి. తరాలు మారినా ఆ జ్ఞాపకాలు మరవటం కష్టం. అలాంటి ఓ అద్బుతమైన విషయం అప్పట్లో వచ్చి ఘన విజయం సాధించిన గుండమ్మ కథ సినిమా విషయంలో జరిగింది.  కన్నడంలో విఠలాచార్య తీయగా ఘన విజయం సాధించిన ‘మనె తుంబిద హెణ్ణు’ చిత్రాన్ని తెలుగులో తీయాలని బి.నాగిరెడ్డి నిర్ణయించుకున్నారు.

డి.వి.నరసరాజు గారిని రైటర్ గా పెట్టుకున్నారు. ఆ ప్రాజెక్టుని చక్రపాణిగారికి అప్పగించారు. కన్నడ కథ చూస్తూనే పెదవి విరిచిన చక్రపాణి పనిగట్టుకుని మూల కథను ఓ మూల పెట్టి,  నరసరాజు చేత మొత్తం స్క్రిప్ట్‌ తిరగ రాయించారు. ఆ సమయంలో చాలా విశేషాలు జరిగాయి. వాటిలో మచ్చుకు ఒకటి చూద్దాం. ఆ రోజు  డి.వి.నరసరాజు గారు  గుండమ్మ కథ కి డైలాగులు వ్రాయడం మొదలుపెట్టారు. సినిమాలో కీలకమైన సన్నివేశంలో అక్కినేని... గుండమ్మ ఇంటికి వచ్చి, మారువేషం లో అంజి గా వున్న అన్న ఎన్టీఆర్ ను తన ప్రేయసి ఇంట్లోనే వుందా అని అడగాలి.

 


 

అప్పుడు  " నా ప్రేయసి ఇంట్లోనే వుందా " అని డైలాగు వ్రాసారు. కానీ రాసింది తిరిగి చదువుకున్న  నరసరాజు గారికి ప్రేయసి అనే పదం బరువు గ అనిపించి " నా పిట్ట వుందా " అని మార్చారు. మళ్ళి చూస్తే.. " పిట్ట " అనే పదం మరి చీప్ గా వుందనిపించింది. దాన్ని కొట్టేసారు. ఏ మాట వేయాలి  అని ఆలోచిస్తూ నాలుగైదు పదాలు రాసారు. కానీ ఏదీ సంతృప్తిని ఇవ్వటం లేదు. అప్పుడు ఆయనకు ఓ ఆలోచన వెల్గింది.

ఇంట్లో ఆమె వుందా అనే అర్ధం స్పురించేలా ఎన్నార్ ఈల తో అడిగినట్టు, , వెంటనే వుంది అని ధ్వనించేలా ఎన్టీఆర్ సమాధానం చెప్పినట్టు వ్రాసుకున్నారు. ఈ లోగా  ప్రొడక్షన్ కార్ వచ్చింది. స్క్రిప్ట్ తీసుకుని స్టూడియో వచ్చి నిర్మాత చక్రపాణి గారి కి వినిపించారు. ఆ క్రమంలో వచ్చిన ఈ సీన్ లో ..చక్రపాణి గారి కి విజిల్ సంభాషణ బాగా నచ్చింది. సీన్ లోని మిగతా భాగం కూడా విజిల్స్ తోనే కొనసాగించమని చెప్పాడు. నరసరాజు గారు సరే అని అలాగే వ్రాసారు.'

ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక థియోటర్స్ లో జనం ఈ విజిల్ సంభాషణన చూసి , చప్పట్లు, ఈలలతో ఉషారెత్తిపోయారు. అలా రాసేటప్పుడు సరిఅయిన మాట దొరకక , విజిల్ వేయిస్తే  , ఆ సీన్ పెద్ద సూపర్ హిట్ అయ్యింది.

 ఇక ఈ సినిమాని నిర్మాత నాగిరెడ్డి గారు తన సోదరుడు బి.ఎన్‌.రెడ్డికి దర్శకత్వం అప్పగించబోయి, కళాత్మక చిత్ర దర్శకుడితో రీమేక్‌ చేయించడం ఇష్టం లేక పి.పుల్లయ్యను సంప్రదించారు. అయితే ఆయనకి కథ నచ్చక చేయనన్నారు.  కానీ  నాగిరెడ్డి వెనక్కి తగ్గలేదు. ఎలాగైనా ‘మనె తుంబిద హెణ్ణు’ చిత్రాన్ని తెలుగులో తీయాలన్న పట్టుదలతో  కమలాకర కామేశ్వర రావును దర్శకుడిగా, సూర్యకాంతాన్ని ప్రధాన పాత్రలో తీసుకుని, ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, ఎస్వీఆర్‌, రమణారెడ్డి, సావిత్రి, జమున లాంటి భారీ స్టార్ కాస్టింగ్ ని ఎంచుకున్నారు. అలా ఒరిజనల్ లో లేని ఎన్నో మార్పులకు గురి అయ్యి... తెలుగు లో తిరుగులేని విజయం సాధించిన చిత్రమే విజయా వారి ‘గుండమ్మ కథ’.
 

click me!