
ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రెడ్(RED). నేను శైలజ, చిత్రలహరి ఫేమ్ కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. ఈ ఏడాది ఇస్మార్ట్ శంకర్ చిత్రంతో రామ్ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇస్మార్ట్ శంకర్ చిత్రం రామ్ కెరీర్ కు మంచి జోష్ ని అందించింది. రామ్ కెరీర్ లోనే ఇస్మార్ట్ శంకర్ హైయెస్ట్ గ్రాసర్ గా నిలిచింది.
ఇస్మార్ట్ శంకర్ తర్వాత రామ్ రెడ్ సినిమాకి కమిటయ్యారు. తమిళంలో ఘనవిజయం సాధించిన 'తడం' అనే చిత్రానికి రెడ్ రీమేక్ గా తెరకెక్కుతోంది. యాక్షన్ అంశాలతో కూడిన ఈ క్రైమ్ థ్రిల్లర్ చిత్రం కోసం రామ్ డిఫెరెంట్ లుక్ లో కనిపిస్తున్నాడు.
ఈ చిత్రంలో రామ్ సరసన నటించే హీరోయిన్ విషయంలో అనేక ఊహాగానాలు వినిపించాయి. తాజాగా ఆ ఊహాగానాలకు తెరదించుతూ చిత్ర యూనిట్ హీరోయిన్ ని ప్రకటించింది. రెడ్ మూవీలో రామ్ సరసన నివేత పేతురాజ్ హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలిపారు.
ఆదివారం రోజు నుంచి నివేత పాత్రకు సంబంధించిన చిత్రీకరణ ప్రారంభం అవుతుంది. శనివారం రోజు నివేత పేతురాజ్ తన 28వ జన్మదిన వేడుకలు జరుపుకుంది. ఈ సందర్భంగా రెడ్ మూవీ సెట్స్ లోనే చిత్ర యూనిట్ నివేత బర్త్ డేని సెలెబ్రేట్ చేశారు. ఈ నివేత బర్త్ డే సెలెబ్రేషన్స్ లో హీరో రామ్, దర్శకుడు కిషోర్, ఇతర చిత్ర యూనిట్ పాల్గొన్నారు.
నివేత బర్త్ డే సెలెబ్రేషన్ దృశ్యాలు నెటిజన్లని ఆకట్టుకుంటున్నాయి. స్రవంతి మూవీస్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కుతోంది. మణిశర్మ సంగీత దర్శకుడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.