నా పనైపోయిందని కామెంట్ చేశారు.. తప్పు నాదే: సాయిధరమ్ తేజ్!

By tirumala ANFirst Published Dec 10, 2019, 7:14 PM IST
Highlights

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే'. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సుప్రీం తర్వాత రాశి ఖన్నా, సాయిధరమ్ తేజ్ కలసి నటించిన చిత్రం ఇది.

సుప్రీం హీరో సాయిధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం 'ప్రతిరోజూ పండగే'. వినోదాత్మక చిత్రాల దర్శకుడు మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కింది. సుప్రీం తర్వాత రాశి ఖన్నా, సాయిధరమ్ తేజ్ కలసి నటించిన చిత్రం ఇది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 20న విడుదల కాబోతోంది. 

ప్రస్తుతం చిత్ర యూనిట్ తెలుగు రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాల్లో బిజీగా గడుపుతున్నారు. చివరి రోజుల్లో తాతని ఫ్యామిలీ పట్టించుకోకపోతే.. ఆయన కోసం మనవడు ఏం చేశాడనేదే ఈ చిత్ర కథ. తాజాగా ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ మాట్లాడుతూ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 

ఈ చిత్ర కథని రెండవసారి విన్న తర్వాత ఓకే చేశానని తెలిపాడు. చిత్రలహరి తర్వాత కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తేజు తెలిపాడు. వరుస పరాజయాలు ఎదురైనప్పుడు చాలా తప్పులు చేశా. ఇకపై ఆ తప్పులు రిపీట్ చేయకూడదని అనుకుంటున్నా. ఫ్లాపుల్లో ఉన్నప్పుడు నా పనైపోయిందని కామెంట్స్ చేసినవాళ్లు కూడా ఉన్నారు. 

కానీ ఆ కామెంట్స్ కు నేను బాధపడలేదు. ఎందుకంటే నన్ను భుజం తట్టి ప్రోత్సహించిన వారు కూడా ఉన్నారు. నేను నటించిన చిత్రాలు అనేక కారణాలవల్ల పరాజయం చెంది ఉండొచ్చు. కానీ అంతిమంగా బాధ్యత వహించాల్సింది నేనే. ఎందుకంటే కథని అంగీకరించింది నేనే కాబట్టి అని సాయిధరమ్ తేజ్ అభిప్రాయపడ్డాడు. 

ప్రస్తుతం ప్రేక్షకుల అభిరుచి క్రమంగా మారుతోంది. మంచి కాన్సెప్ట్ ఉంటే పరభాషా చిత్రాలని కూడా ఆదరిస్తున్నారు. కెజిఎఫ్, లూసిఫర్, ఖైదీ చిత్రాలే అందుకు ఉదాహరణ అని తేజు తెలిపాడు. ప్రతిరోజూ పండగ చిత్రం కూడా మంచి కాన్సెప్ట్ తో తెరకెక్కుతోంది. ప్రేక్షకుల ఆదరణ ఉంటుందని విశ్వసిస్తున్నట్లు తేజు తెలిపాడు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మించారు. సత్య రాజ్, రావు రమేష్ కీలక పాత్రల్లో నటించారు. 

click me!