వెబ్ సిరీస్ కి మోహన్ బాబు స్టోరీ.. అన్నగారి కధే?

By Prashanth MFirst Published Feb 20, 2020, 12:05 PM IST
Highlights

మోహన్ బాబు...నటుడుగా ఊహించని ఎత్తుకు ఎదిగారు. ఆయన డైలాగు చెప్తూంటే నోరు వెళ్లబెట్టుకుని వినాల్సిందే. ఓ ప్రత్యేకమైన డిక్షన్ తో తనకంటూ పరిశ్రమలో ఓ స్దానం ఏర్పాటు చేసుకున్న ఆయన గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. కొన్ని ప్రాజెక్టులు ప్రకటించారు కానీ అవేమీ తెర రూపం దాల్చలేదు.

డైలాగు కింగ్ మోహన్ బాబు...నటుడుగా ఊహించని ఎత్తుకు ఎదిగారు. ఆయన డైలాగు చెప్తూంటే నోరు వెళ్లబెట్టుకుని వినాల్సిందే. ఓ ప్రత్యేకమైన డిక్షన్ తో తనకంటూ పరిశ్రమలో ఓ స్దానం ఏర్పాటు చేసుకున్న ఆయన గత కొంతకాలంగా సైలెంట్ గా ఉంటున్నారు. కొన్ని ప్రాజెక్టులు ప్రకటించారు కానీ అవేమీ తెర రూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఆయన రచయితగా టర్న్ అయ్యి ఓ కథని అందించినట్లు సమాచారం.

అది మరేదో కాదు తన కుమారుడు మంచు విష్ణు నిర్మిస్తున్న చదరంగం వెబ్ సీరిస్.  మంచు విష్ణు నిర్మాణంలో రాజ్ అనంత దర్శకత్వంలో రూపొందుతున్న చదరంగం వెబ్ సిరీస్ ట్రైలర్ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సక్సెస్ అయ్యింది. అయితే ఇది నందమూరి తారక రామారావు బయోపిక్ అంటూ ప్రచారం జరుగుతోంది. ట్రైలర్ లో ఆ ఛాయిలు కనపడలేదు.

అలాగే ఇప్పటి వరకు ఆ విషయానికి  సంబంధించిన అధికారిక ప్రకటన అయితే రాలేదు. కాని మంచు ఫ్యామిలీ సన్నిహితులు మాత్రం అది అన్నగారి బయోపిక్ అని అంటున్నారు. సంభందిత మీడియా కూడా అదే చెప్తోంది.  అలాగే ఇప్పుడు మరో కొత్త విషయం బయిటకు వచ్చింది. ఈ బయోపిక్ కు కథను మోహన్ బాబు అందిస్తున్నాడట. వేరే రైటర్స్ స్క్రిప్టు రాసినా, తన దైన శైలిలో సంఘటనలు నేరేట్ చేస్తూ.. రచన సహకారం పూర్తిగా మోహన్ బాబు అందిస్తున్నట్లుగా సమాచారం.

ముఖ్యంగా ఎన్టీఆర్ తో మోహన్ బాబుకు ఉన్న అనుబంధం అందరికి తెల్సిందే. దాంతో ఎన్టీఆర్ కుటుంబాన్ని దగ్గర నుంచి చూసిన వ్యక్తిగా వాటిని నేరేట్ చేయబోతున్నట్లు సమాచారం.  ఎన్టీఆర్ బయోపిక్ రెండు పార్ట్ లు, లక్ష్మీస్ ఎన్టీఆర్ చూసిన మోహన్ బాబు...అసంతృప్తితో ఉన్నారని,అందుకే ఈ ప్రయత్నం చేస్తున్నట్లు చెప్తున్నారు. అయితే ఇదంతా కేవలం ప్రచారం మాత్రమే, ఈ వెబ్ సీరిస్ కు క్రేజ్ తీసుకుని రావటానికి మీడియా వర్గాలు కొంతమందితో కలిసి చేస్తున్న ప్రచారమే అని కొట్టిపారేస్తున్నారు.

ప్రస్తుతం వైకాపాలో ఉన్న మోహన్ బాబు, ఆయన ఫ్యామిలీ ఎన్టీఆర్ గురించి ఈ వెబ్ సిరీస్ లో చాలా స్ట్రాంగ్ గానే కౌంటర్ వేస్తారేమో అని కొందరు ఎదురుచూస్తున్నారు.  ఎన్టీఆర్ చివరి రోజులపై ఈ వెబ్ సిరీస్ ఎక్కువ ఫోకస్ ఉండవచ్చు మరికొందరు ఊహాగానాలు చేస్తున్నారు. ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫామ్ పై స్ట్రీమింగ్ అవ్వబోతుంది.   ‘‘కొన్నేళ్లుగా ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ సిరీస్‌ రూపొందనుంది.. ఇది కొంత మందికి షాక్‌ ఇస్తుంది’’ అని మంచు విష్ణు  చెప్తున్నారు.

click me!