పాత బంగారం : 'దేవదాసు' లో విషాద సీన్స్ షూటింగ్ గురించి సావిత్రి!

By AN TeluguFirst Published Oct 10, 2019, 3:40 PM IST
Highlights

'దేవదాసు' చిత్రంలో పార్వతి,ముందు దృశ్యాల్లో తప్పితే తర్వాత సంతోషమే ఎరగదు. పోను పోను దుఖమే ఎక్కువ. 

 

శోక పాత్రలు గురించి మహానటి  సావిత్రి అప్పట్లో రాసిన వ్యాసంలో ఆవిడ తన అభిప్రాయాలు స్పష్టంగా చెప్పారు.   ఆ కాలం నాటి నటుల పాత్ర ధారణలో  ఏకాగ్రత, ధోరణి ఏ విధంగా ఉంటుందనేది ఈ ఉదాహరణ వివరిస్తుంది.మహానటి సావిత్రి మాటల్లో ....


'దేవదాసు' చిత్రంలో పార్వతి,ముందు దృశ్యాల్లో తప్పితే తర్వాత సంతోషమే ఎరగదు. పోను పోను దుఖమే ఎక్కువ. అటువంటి దృశ్యాల్లో  ఒక చోట నేను, నాగేశ్వరరావు గారు నటిస్తూంటే , నేను తలుపు కేసి తలబాదుకుంటూంటాను. దుఖం పట్టలేక ఆ ఘట్టంలో నన్ను నేను మరిచిపోయాను. డైరక్టర్ గారు కట్ అన్నా రే, నేను అలాగే తల కొట్టుకుంటూనే ఉన్నాను. అలాంటి ఎమోషనల్ దృశ్యాల్లో నటించేటప్పుడు, అలా జరుగుతూంటుంది. అదే షాటు ముందు తెలుగులో తీసి, తర్వాత తమిళంలో తీసారు. అప్పుడు కూడా అలాగే జరిగింది.  తర్వాత నాగేశ్వరరావు గారు, దర్శకులు రాఘవయ్య గారు నన్ను ఒక చోట కూర్చోబెట్టి విశ్రాంతి తీసుకోమన్నారు. చాలా సేపటి దాకా నేను మామూలు మనిషిని కాలేకపోయాను.

అలాగే మిగతా చిత్రాల్లో కూడా శోక ఘట్టాల్లో నటించవలిసి వచ్చినప్పుడు , ఏడవ  వలసి వచ్చినప్పుడు , దృశ్యం అయిపోయిన తర్వాత కూడా ఏడుపు ఆగదు. ఎమోషనల్ దృశ్యాల్లో నటించిన తర్వాత , బాగా బలహీనత కలగటం, నరాలు వణకటం, వంటివి నాకు జరుగుతూంటాయి. అందుకుని నేను అలాగే ఇంటికి వెళ్లిపోయి, మేకప్ అయినా తీయకుండా , భోజనమైనా చేయకుండా మంచం మీద పడి నిద్రపోతాను. నేను ఎప్పుడైనా ఇంటికి వెళ్లి అలా పడుకుంటే , ఎవరూ నన్ను లేపరు. నేను శోక దృశ్యంలో నటించినట్లు వాళ్లకు అర్దమైపోతుంది.

నాకు తెలిసినంతవరకూ అంజలిదేవిగారు కూడా..దుఖం నటించేటప్పుడు నాలాగే బాధ పడతారు. ఒక్కోసారి దృశ్యం కాగానే ఆవిడ, మూర్చపోవటం జరుగుతూ ఉంటుంది. పట్టరాని ఎమోషన్ లో చెయ్యవలిసి వచ్చినప్పుడు ఇవి సంభవిస్తూంటాయి. స్త్రీలకు మాత్రమే ఇలా ఎందుకు జరుగుతుంది. పురుషులకు ఎందుకు జరగదోనని ఆలోచిస్తూ ఉంటాను. బహుశా స్త్రీలు సున్నిత హృదయులు కాబట్టి ,తట్టుకోలేరేమో అనిపిస్తుంది అని చెప్పుకొచ్చింది సావిత్రి. 

click me!
Last Updated Oct 10, 2019, 3:42 PM IST
click me!