
'ఎవరికి నచ్చిన పద్ధతిలో వారు మాట్లాడుకోవడం కూడా పెద్ద ఫ్యాషన్ అయిపోయింది. పెద్ద పెద్ద కుటుంబాల్లో ఆడ పిల్లల గురించి రాయగలరా? మా గురించి ఎందుకు రాస్తారు? నేను అడిగేది కూడా ఇదే. దీని గురించి సీరియస్‌గా పనిచేస్తాం. రాజశేఖర్‌గారి గురించి, నా గురించి విన్నది కూడా ఫేక్' అంటున్నారు జీవిత. తమ గురించి మీడియాలో,సోషల్ మీడియాలో వస్తున్న వార్తల గురించి జీవిత ఇలా స్పందించారు. ఈటీవిలో ప్రసారమవుతున్న అలీతో జాలీగా పోగ్రామ్ లో గెస్ట్ గా హాజరైన ఆమె ఇలా స్పందించారు. బయట మీరూ రాజశేఖర్ చాలా క్లోజ్‌గా ఉంటారు. అయితే ఇంట్లో అలా ఉండరని బయట టాక్. మీరేమంటారు? అనే ప్రశ్నకు సమాధానం ఇలా ఇచ్చారు. అదే సమయంలో చిరంజీవి తో తమకు శతృత్వం ఉన్న విషయం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.
జీవిత మాట్లాడుతూ...రాజశేఖర్‌గారిని నచ్చని విషయం చేయమని పదికోట్ల రూపాయలు ఇచ్చినా ఆయన చేయరు. చాలా ఓపెన్‌హార్ట్. కొందరితో బేధాభిప్రాయాలు వచ్చినా ఆ కాసేపు అలా ఉంటారు. మళ్లీ ఏ ఫంక్షన్‌లో కనిపించినా, చాలా చక్కగా మాట్లాడతారు. చిరంజీవిగారితో మాకు ఇష్యూ ఉన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత రాజశేఖర్‌గారు వెళ్లి ఆయనను కలిసి ‘గరుడవేగ’ చూడమని అడిగారు. ‘అప్పుడు చిరును తిట్టిన రాజశేఖర్ ఇప్పుడు వెళ్లి కలిశారేంటి? సినిమా సక్సెస్ కావాలని ఆయనను కలిశారా?’ అంటూ సోషల్‌మీడియాలో వార్తలు హల్‌చల్ చేశాయి.
‘జీవితంలో ఎవరితోనూ శత్రుత్వం అనేది ఉండదు. కొన్ని సందర్భాల్లో కొందరు నచ్చుతారు. కొందరు నచ్చరు. అది అప్పటివరకే. సోషల్‌మీడియాలో వచ్చిన వాటి గురించి మర్చిపోండి. ఆ గొడవ తర్వాత మనం ఆయనని చాలా ఫంక్షన్స్‌లో కలిశాం. చక్కగా మాట్లాడుకున్నాం. చిరంజీవి సినిమా చూసి అభిప్రాయం చెబితే బాగుంటుందని అనుకున్నాం. ఎన్టీఆర్, ఏయన్నార్‌ల తర్వాత ఆ స్థాయి వ్యక్తి ఆయన. సోషల్‌మీడియా, వెబ్‌సైట్‌లలో రాసి వాటి గురించి పట్టించుకోకండి’ అని రాజశేఖర్ చెప్పారు. ఇదీ ఆయన మనస్తత్వం.
ఇక రాజశేఖర్‌గారి జీవితంలో ఫ్రెండ్, ఫిలాసఫర్, అమ్మానాన్న, అక్కా, చెల్లి అన్నీ నేనే. వాళ్ల కుటుంబం అంతా చెన్నైలోనే ఉంటారు. ఆయనకు సంబంధించిన ఏ విషయమైనా నాతోనే చర్చిస్తారు. ప్రతి మనిషికీ కోపం అనేది ఉంటుంది. కాకపోతే ఆయనకు ఇంకాస్త ఎక్కువంతే. ‘ఇది ఇలా చేయండి’ అని నాలుగైదు సార్లు చెబుతారు. వినకపోతే అక్కడ ఎవరున్నా కోపం వస్తుంది. అప్పుడు వాళ్లను శిక్షించరు. తనని తాను శిక్షించుకుంటారు. రెండు రోజులు తినడం మానేస్తారు. మా ఇద్దరి మధ్య సఖ్యత లేదన్నవారిని మా ఇంటికి పంపండి. నెల రోజులు ఉండీ అన్నీ చూస్తారు అని చెప్పుకొచ్చారామె.