ఎన్టీఆర్ బయోపిక్ నిర్మాతకు షాక్.. కోర్టు మెట్లెక్కిన ఆమె!

By tirumala ANFirst Published Nov 1, 2019, 6:26 PM IST
Highlights

ప్రస్తుతం వెండితెరపై బయోపిక్ చిత్రాల హవా కొనసాగుతోంది. ప్రముఖుల జీవిత చరిత్రలపై సినిమాలు చేసేందుకు దర్శకనిర్మాతలు ఆసక్తి చూపుతున్నారు. ఇప్పటికే ఎన్టీఆర్ జీవిత చరిత్ర ఆధారంగా ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు చిత్రాలు తెరకెక్కాయి. 

బాలకృష్ణ ఎంతో ఇష్టపడి ఎన్టీఆర్ బయోపిక్ చిత్రంలో నటించారు. తన తండ్రి పాత్రలో ఒదిగిపోయి నటించారు. కానీ ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం నిరాశపరిచింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఎన్టీఆర్ మహానాయకుడు, కథానాయకుడు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. 

ఎన్టీఆర్ బయోపిక్ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత విష్ణువర్థన్ ఇందూరి నిర్మించారు. ఆయనే మరో బయోపిక్ చిత్రానికి కూడా శ్రీకారం చుట్టారు. తమిళుల అభిమాన నాయకురాలు జయలలిత జీవితాన్ని తెరకెక్కించేందుకు విష్ణు వర్ధన్ ఇందూరి శ్రీకారం చుట్టారు. 

విష్ణు వర్ధన్ నిర్మాణంలో కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో ఈ బయోపిక్ చిత్రం తెరకెక్కుతోంది. ఏఎల్ విజయ్ ఈ చిత్రానికి దర్శకుడు. అదేవిధంగా నిత్యామీనన్ ప్రధాన పాత్రలో కూడా జయలలిత బయోపిక్ చిత్రం రూపొందుతోంది. 

దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రపై తెరకెక్కుతున్న బయోపిక్ చిత్రాలు విడుదల కాకూడదు అంటూ ఆమె మేనకోడలు దీప జయకుమార్ హైకోర్టుని ఆశ్రయించారు. ఈ మేరకు ఆమె మద్రాసు హైకోర్టులో జయలలిత బయోపిక్ చిత్రాలపై అభ్యంతరం చెబుతూ ఫిటిషన్ దాఖలు చేశారు. 

ఆమె కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసారు. అమ్మ రాజకీయ జీవితం అందరికి తెలిసిందే. నాయకురాలిగా ప్రజలకు ఎంతో సేవ చేశారు. ఆమె పొలిటికల్ లైఫ్ అందరికి తెలిసిన కథే కాబట్టి అభ్యంతరం లేదు. కానీ ఆమె వ్యక్తిగత జీవితాన్ని ఎలా చూపించబోతున్నారు అనేదే నా ప్రశ్న అని దీప జయకుమార్ అన్నారు. 

అమ్మ వ్యక్తిగత జీవితాన్ని ఎలా పడితే అలా చూపించడానికి వీలు లేదు. ఆమె కుటుంబ సభ్యులుగా దర్శక నిర్మాతలు మా అనుమతి తీసుకోవాలి. జయలలిత వ్యక్తిగత జీవితాన్ని ఎలా చూపించబోతున్నారో మాకు తెలపాలి అని దీప జయకుమార్ కోరింది. అందుకే కోర్టులో ఫిటిషన్ దాఖలు చేసినట్లు ఆమె మీడియాకు వివరించారు.  

జయలలిత రాజకీయాల్లోకి రాక ముందు సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగారు. ఆ సమయంలో జయలలిత పర్సనల్ లైఫ్ గురించి అనేక ఊహాగానాలు ప్రజల్లో ఉన్నాయి.  

click me!