
ఒకరికి అనుకున్న పాత్రను మరొకరు చేయటం సిని ఇండస్ట్రీలో సర్వ సాధారణంగా జరిగే అశం. అలాగే అవి ఆ సినిమా హిట్ లేదా ఫ్లాఫ్ అయ్యిన కొంతకాలానికి బయిటకు వస్తూంటాయి. తాజాగా అలాంటి విషయం ఒకటి బయిటకు వచ్చి అంతటా హాట్ టాపిక్ గా మారింది.
‘ది ఫ్యామిలీ మ్యాన్’.. వెబ్ సిరీస్‌ల్లో నెంబర్ వన్ గా నిలిచింది. ‘జేమ్స్‌బాండ్’సినిమాల స్దాయిలో క్రేజ్ సంపాదించుకుంది. రెండు సీజన్లలో విడుదలై ప్రేక్షకులకు కొత్త ఎక్సపీరియన్స్ ని ఇచ్చింది. బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, టాలీవుడ్ నటి సమంతకు విశేషమైన గుర్తింపు తీసుకొచ్చింది. అలాంటి ఈ క్రేజీ ప్రాజెక్టుని మెగాస్టార్ చిరంజీవి చేయాల్సిందిట. అయితే ఆయన నో చెప్పటంలో మనోజ్ బాజ్‌పాయ్ దగ్గరకు వెళ్లింది. ఆ వెనక జరిగిన కథ ఇంట్రస్టింగ్ గా ఉంది.
గతంలో దర్శకద్వయం రాజ్&డీకేలు ముందుగా ఈ వెబ్ సిరీస్‌ను సినిమా కథగా రాసుకుని అశ్వినీదత్‌కు చెప్పటం జరిగింది. అశ్వినీదత్‌కు కథ బాగా నచ్చడంతో వెంటనే చిరంజీవి కలిసి వినిపించాడట. చిరు సైతం కథ విని అద్భుతంగా ఉందంటూ మెచ్చుకున్నారట. అయితే అప్పుడే ఖైదీ 150తో ఓ రేంజిలో కంబ్యాక్ ఇచ్చి ఉన్నారు. అలాంటి తనను.. ఇద్దరు పిల్లల తండ్రిగా జనాలు యాక్సెప్ట్ చేస్తారో లేదో అని చిరు చిన్న సందిగ్ధంలో పడ్డాడట. తాను పిల్లల తండ్రిగా, డిఫరెంట్ క్యారెక్టరైజేషన్ ఉన్న లేడీకి భర్తగా అంటే అభిమానులు ఏక్సెప్ట్ చేయరేమో అన్న అనుమానం కలిగింది. దాంతో ఇద్దరు పిల్లలు లేకుండా కథ మార్చమని అడిగారు. అలా అనేక డౌట్స్ మధ్య ఆ ప్రాజెక్టు ముందుకు వెళ్ళలేదు. ఈ క్రమంలో అదే కథను తర్వాత వెబ్ సిరీస్‌గా మార్చి మనోజ్‌తో రూపొందించారు. ఈ విషయాన్ని నిర్మాత అశ్వినీదత్ స్వయంగా చెప్పడం విశేషం.
అయితే మరో విషయం...అసలు ఈ సీరిస్ లో నటించేందుకు ముందుగా మనోజ్ బాజ్‌పాయ్ సంశయించారట. ఎందుకలా అనుకున్నారో ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఐఎఫ్‌ఎఫ్‌ఐ) చర్చా వేదికలో తెలిపారు. మనోజ్ మాట్లాడుతూ.... వివిధ డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుంచి వరుసగా ఆఫర్ల వస్తున్న సమయంలోనే ‘ఫ్యామిలీమ్యాన్’ కథ నా దగ్గరకు వచ్చింది. వాటిల్లో దేన్ని ఎంపిక చేసుకోవాలన్నా కాస్త భయపడేవాడ్ని. ఎందుకంటే అవి సిరీస్‌లకు సరిపోయే విధంగా ఉంటాయో లేదోనని! ఎలాంటి ప్రాజెక్టుల్లో నటించకూడదు అనే విషయంలో క్లారిటీ ఉంది. కానీ, ఎలాంటి వాటిల్లో నటించాలి అనే విషయంలో స్పష్టత లేదు. అలా ‘ఫ్యామిలీమ్యాన్’కు నో చెప్పాలనుకున్నా. అదే సమయంలో.. కొన్ని వెబ్ సిరీస్‌లు ప్రేక్షకుల్లో ఉత్కంఠను కలిగించడాన్ని చూశా. థ్రిల్లింగ్ అంశాలు దానికి కారణమని తెలుసుకున్నా. ప్రేక్షకులకు ఏం కోరుకుంటున్నారో దాన్ని ఇవ్వాలనుకునే ఉద్దేశంతో ఈ సిరీస్‌ను ఓకే చేశా అని చెప్పుకొచ్చారు.