ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన అంబులెన్స్: సినీ నిర్మాత కమలాకర్ రెడ్డి మృతి

By telugu teamFirst Published Aug 20, 2020, 6:54 AM IST
Highlights

నల్లగొండ జిల్లా దామరచర్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రితో పాటు సినీ నిర్మాత కమలాకర్ రెడ్డి మరణించారు. నెల్లూరు నుంచి అంబులెన్సులో వస్తుండగా ఈ ప్రమాదం సంభవించింది.

హైదరాబాద్: సినీ నిర్మాత, పంపిణీదారుడు గుండాల కమలాకర్ రెడ్డి (48) బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించారు. కెఎఫ్సీ నిర్మాణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్లలో కమలాకర్ రెడ్డి ఒకరు. నెల్లూరు జిల్లాలో నివాసం ఉంటున్న ఆయన తండ్రి నందగోపాల్ రెడ్డి (75)కి ఇటీవల కరోనా వైరస్ సోకింది. 

మెరుగైన వైద్యం కోసం తండ్రిని కమలాకర్ రెడ్డి అంబులెన్స్ లో హైదరాబాదులోని ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రమాదం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా దామచర్ల మండలం కొండప్రోలు వద్ద ఈ ప్రమాదం జరిగింది. 

ఆగి ఉన్న లారీని అంబులెన్స్ ఢీకోట్టింది. దీంతో అంబులెన్స్ లో ఉన్న కమలాకర్ రెడ్డి, ఆయన తండ్రి నందగోపాల్ రెడ్డి అక్కడికక్కడే మరణించారు. తండ్రీకొడుకులు ఇరువురు ఒకేసారి మరణించడంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

ఇటీవల విడుదలైన కనులు కనులు దోచాయటే సినిమాకు కమలాకర్ రెడ్డి నిర్మాతగా వ్యవహరించారు. అర్జున్ రెడ్డి, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ వంటి హిట్ చిత్రాలకు ఆయన పంపిణీదారుడిగా వ్యవహరించారు. పలు తెలుగు, హిందీ, తమిళ డబ్బింగ్ చిత్రాలను కూడా ఆయన పంపిణ చేశారు. ప్రమాదంలో గాయపడిన అంబులెన్స్ డ్రైవర్ ను మిర్యాలగుడా ఆస్పత్రికి తరలించారు.  

click me!