
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ (CPI Narayana) ఎప్పుడూ ఏదో సంచలన కామెంట్స్ చేస్తూ వార్తల్లో ఉంటారు. రోజు వారి అంశాలపై స్పందిస్తూ కేంద్ర రాష్ట్రప్రభుత్వాలపై మండిపడుతుంటారు. ఆయన చేసే కామెంట్స్ ఎక్కువ శాతం హైలెట్ అవుతుంటాయి. అవకాసం దొరికినప్పుడల్లా నాగార్జునపైనా, బిగ్ బాస్ పైనా మండిపడే ఆయన ఇప్పుడు తన బాణం చిరంజీవి వైపు తిప్పారు. తాజాగా ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) లోని ప్రధాన పార్టీలు రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే (NDA) కు మద్దతివ్వడంపై మాట్లాడిన ఆయన.. టీడీపీ (TDP), వైసీపీ (YSRCP)పై ధ్వజమెత్తారు
పనిలో పనిగా మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi), ఆయన తమ్ముడు జనసేన (Janasena Party) అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తిరుపతిలో మాట్లాడిన నారాయణ.. భీమవరంలో అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు చిరంజీవి హాజరవడాన్ని ఆయన తప్పుబట్టారు. చిరంజీవి ఊసరవెల్లి లాంటివాడంటూ హాట్ కామెంట్స్ చేశారు.
నారాయణ మాట్లాడుతూ...“పశ్చిమ గోదావరి జిల్లా, భీమవరంలో మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమానికి అల్లూరి సీతారామరాజుగా నటించి ప్రజలను మెప్పించిన సూపర్ స్టార్ కృష్ణను పక్కనబెట్టి ఈ చిల్లర బేరగాడ్ని చిరంజీవి ని స్టేజి మీదకి తీసుకొచ్చి పక్కన కూర్చోపెట్టుకున్నారు.
ఈ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదో నాకు తెలీదు కానీ వచ్చి ఉంటే గౌరవంగా ఉండేది. పవన్ కళ్యాణ్ ఓ ల్యాండ్ మైన్ వంటివాడు. అది ఎప్పుడు పేలుతుందో ఎవరికీ తెలీదు. ఆయన కూడా అంతే. ఎప్పుడు ఏవిదంగా వ్యవహరిస్తారో ఎవరికీ తెలియదు. మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చేసిందేమీ లేకపోయినా సిఎం జగన్మోహన్ రెడ్డి తన కేసుల కోసం కేంద్రానికి సరండర్ అయిపోయారు. మోడీ కనుసన్నలలో మెలుగుతూ ఎన్డీయే అభ్యర్ధికి బేషరతుగా మద్దతు ప్రకటించారు. ఏపీలో రాజకీయ పార్టీలు, నాయకుల ఈ బలహీనతలతోనే కేంద్రం ఆడుకొంటోంది.
మరోవిదంగా చెప్పాలంటే ఏపీ రాజకీయనాయకులను కేంద్ర ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోంది. జగన్ ప్రభుత్వం రాజధాని విషయంలో నేటికీ గేమ్స్ ఆడుతూనే ఉంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడి 8 ఏళ్ళుకావస్తున్నా రాజధాని లేదనే బాధ సిఎం జగన్మోహన్ రెడ్డితో సహా మంత్రులు, ఎమ్మెల్యేలు ఎవరికీ లేకపోవడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. అందుకే నేటికీ హైదరాబాద్ రాజధాని అన్నట్లు చాలా మంది అక్కడే తిరుగుతున్నారు. వరద బాధితులను ఆదుకోవడంలో జగన్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది,” అని అన్నారు.