ప్రముఖ నటుడు తపస్ పాల్ మృతి!

By telugu news teamFirst Published Feb 18, 2020, 9:58 AM IST
Highlights

మంగళవారం నాడు ఉదయం నాలుగు గంటలకు కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. తపస్ పాల్ తన కుమార్తెను చూడడానికి ముంబై వెళ్లి తిరిగి విమానంలో కొల్‌కతాకు వచ్చేటప్పుడు ఎయిర్ పోర్ట్ లో ఛాతిలో నొప్పి వస్తోందని సిబ్బందికి తెలిపారు.

బెంగాలీ ప్రముఖ నటుడు, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీ తపస్ పాల్ (61) గుండెపోటుతో మృతి చెందారు. మంగళవారం నాడు ఉదయం నాలుగు గంటలకు కన్నుమూసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు.

తపస్ పాల్ తన కుమార్తెను చూడడానికి ముంబై వెళ్లి తిరిగి విమానంలో కొల్‌కతాకు వచ్చేటప్పుడు ఎయిర్ పోర్ట్ లో ఛాతిలో నొప్పి వస్తోందని సిబ్బందికి తెలిపారు. దీంతో ఆయనను జుహులోని హాస్పిటల్ కి తరలించారు. ఈ క్రమంలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు డాక్టర్లు చెప్పారు.

గతంలో కూడా తపస్ పాల్ గుండె జబ్బుల కారణంగా పలుమార్లు ఆసుపత్రి పాలయ్యారు. తపస్ పాల్ కి భార్య నందిని, కుమార్తె సోహిని పాల్ ఉన్నారు. కాగా.. తపస్ పాల్ పశ్చిమబెంగాల్ లోని చందన్ నగర్ లో జన్మించారు. హూగ్లీ మొహ్సిన్ కాలేజీలో బయోసైన్స్ చదివారు. సినిమాల మీద మక్కువతో.. 1980లో దర్శకుడు తరుణ్ మజుందార్ దర్శకత్వంలో తెరకెక్కిన దాదర్ కీర్తి సినిమాతో బెంగాలీ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టారు.

పలు విజయవంతమైన సినిమాల్లో నటించారు. 1984లో తపస్ పాల్.. మాధురీ దీక్షిత్ తో కలిసి అబోద్ సినిమాలో నటించారు. హిరెన్ నాగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో గుర్తింపు పొందారు. సినిమాల్లోనే కాకుండా తపస్ పాల్ రాజకీయాల్లో కూడా రాణించారు. తృణమూల్ కాంగ్రెస్ లో ఎంపీగా గెలిచి సేవలందించారు. 

click me!