1
undefined
క్రీస్తుశకం 1891. స్వామి వివేకానంద దేశాటన చేస్తూ రాజస్థాన్ లోని ఆళ్వార్ నగరం చేరుకున్నారు. అక్కడి జనాలను ఆయన అమితంగా ఆకట్టుకున్నారు. ఆ సందర్భంలో ఆయనకు రాజైన మంగళ్ సింగ్ బహదూర్ నుండి సభకు రమ్మని ఆహ్వానం అందింది.
మంగళ్ సింగ్ పాశ్చాత్య విద్య చేత బాగా ప్రభావితుడైనవాడు. ఎందరెందరో ఆంగ్లేయులు ఆయనకు మిత్రులు. వారి స్నేహంతో ఆయనకు భారతీయులన్నా భారతీయసంస్కృతి అన్నా చిన్నచూపు ఏర్పడింది.
అటువంటి మనిషి, తన సభకు వచ్చిన వివేకానందునితో కూడా ఆయన అంతే చులకనగా చూశాడు. "అయ్యా స్వామీ, మీరు బాగా చదువుకున్నారని విన్నాను. మరి హాయిగా ఏదో మంచి ఉద్యోగం చేసుకోక బిచ్చగాడిలా అడుక్కుతింటున్నారెందుకు?" అని అడిగాడు. వివేకానందుడు ఏమాత్రం తొణక కుండా బెణకకుండా "అయ్యా రాజా! మీరు వారసత్వం కొద్దీ మహారాజయ్యారు. మరి ప్రజాసంక్షేమం గాలికొదిలి మీ పాశ్చాత్య మిత్రులతో విందువినోదాలు చేస్తూ ప్రజాధనం ఎందుకు వ్యర్థం చేస్తున్నారు?" అని అడిగాడు.
దాంతో మంగళ్ సింగ్ ఆయనపై వ్యక్తిగత విమర్శ మాని "భారతీయులు ఎంత పిచ్చి వాళ్ళు కాకపోతే ఒకపక్క భగవంతుడు సర్వవ్యాపి అంటూనే - మరో పక్క రాళ్లను కర్రలను లోహాలను కొలుస్తారెందుకు? అవి కేవలం రాళ్లు, కర్రలు, లోహాలే కానీ దేవుడు కాదు కదా?" అని అడిగాడు. వివేకానందుడు చుట్టూ చూసి, అక్కడ గోడమీద మంగళ్ సింగ్ గారి తండ్రి అయిన శోధన్ సింగ్ గారి తైలవర్ణ పటం గమనించాడు. రాజుగారి సమక్షంలోనే దివాన్ గారిని ఆ పటం మీద ఉమ్మువేయమన్నాడు. దివాన్ వణికిపోయాడు.
రాజుగారికి చెప్పలేనంత కోపం వచ్చింది. "మా తండ్రి గారి మీద ఉమ్మువేయమనడానికి నీకు ఎంత ధైర్యం? అని గర్జించారు. "ఈ బొమ్మ మీ తండ్రి ఎలా అవుతుంది రాజా? ఇక్కడ ఉన్నది కేవలం ఒక కేన్వాసు, కొన్ని రంగులు మాత్రమే కదా?" అని వివేకానందుడు అడిగాడు.
భారతీయుల విగ్రహారాధనాన్ని వేళాకోళం చేస్తూ వెక్కిరించే తన పాశ్చాత్య మిత్రులకు ఏం సమాధానం చెప్పాలో తోచక ఆత్మన్యూనత చెందుతూ ఉండిన మంగళ్ సింగ్ కు ఇపుడు వివేకానందుడు చెప్పిన గుణపాఠంలో అద్భుతమైన సమాధానం దొరికింది.
2
భారతీయులు ఒకవైపు దేవుని నిర్గుణుడు నిరాకారుడు నిరంజనుడు అంటూనే మరోవైపు విగ్రహాలను దేవతత్త్వానికి ప్రతీకలుగా భావించి పూజిస్తారు. వినాయకచవితో లేక దసరానో - పండుగ వస్తే చాలు వీధివీధిలోను విగ్రహాలు కన్నులవిందుగా కొలువుదీరటం ఆనవాయితీ అయిపోయింది! కాని, విగ్రహం అనేది కేవలం ఒక సంకేతం మాత్రమే. అటువంటి సంకేతాలు ప్రపంచంలో అందరిలోనూ ఉన్నాయి.
ఓంకారం,
స్వస్తిక,
శిలువ,
786 సంఖ్య,
ఖండ,
చంద్రవంక + చుక్క,
మెనోరా
వగైరా వగైరా.
భక్తిసాధన దశలో ఈ విగ్రహాలు, సంకేతాలు గొప్ప ఆలంబన. కానీ, పారమార్థికదశలో దేవుడంటే విగ్రహాలు మాత్రమే అని ఏ భారతీయ శాస్త్రమూ నొక్కి చెప్పలేదనేది నిజం. ఆ దశకు భారతీయులు చేరుకోలేకపోవడం ఒక విషాదం. కానీ, ఆ దశకు చేరుకోకుండానే విగ్రహాలను వదులుకొనడం అనేది ఒక ఈతరాని వాడు పడవలేకుండా మహాసముద్రం దాటే సాహసం చేయడంతో సమానం కూడా! కోరుకున్న మోక్షం సిద్ధించేంతవరకు ఇవన్నీ కష్టసుఖాలమహాసముద్రంలో సాధననౌకకు చుక్కాని వంటివి. దిక్సూచి వంటివి.
3
పుస్తకాలు లేని జ్ఞానాన్ని మనం ఊహించగలమా?
పలకలో అ ఆ లు దిద్దిస్తాం. పుస్తకంలో అ అంటే అమ్మ, ఆ అంటే ఆవు అని బొమ్మలు చూపిస్తాం. ఓ కాగితం మీద రెండు చుక్కలు పెట్టి, ఇది మన ఇల్లు, ఇది మీ స్కూలు అని చెప్పి, రెండిటి మధ్య కొన్ని గీతలు గీసి, ఇది ఇంటినుండి స్కూలుకు వెళ్లే దారి, మధ్యలో ఇది ఫలానా షాపు అంటూ జాగ్రఫీ మీద ప్రాథమిక అవగాహనను కలుగ జేస్తాం. భూమికి సూర్యుడికి మధ్యలో చంద్రుడు వస్తే ఎలా సూర్యగ్రహణం ఏర్పడుతుందో బోర్డుమీద బొమ్మలు వేసి పిల్లలకు వివరిస్తాం.
నిజానికి ఇదంతా జ్ఞానం కాదు. ఇదంతా మనకు తెలిసిన జ్ఞానాన్ని సులువుగా, వేగంగా మన తరువాత తరానికి అందించేందుకు మనం ఎంచుకున్న బోధనవిధానాలు మాత్రమే.
ఇంకొంచెం విపులంగా చెప్పాలంటే -
గ్రాఫులేమిటి? చార్టులేమిటి? విస్తారమైన డేటాను సంక్షిప్తంగా అతివేగంగా మనం అర్థం చేసుకొనేందుకు ఉపయోగపడే సంకేతశక్తే కదా? ఇదేవిధంగా, విగ్రహాలు కానీ, మరో సంకేతం కానీ, సులువుగా విషయబోధన కోసం, విషయావగాహన కోసం ఏర్పరచుకున్నవే గాని, అవే అసలు విషయాలు కావు. అవే అసలు విషయాలు అయితే మ్యాప్ లో బంగాళాఖాతంలో మనం వేలు పెడితే అక్కడ అలలు పొంగి సునామీ వచ్చి భారత్ లోని తూర్పుతీరమంతా కొట్టుకుపోవాలి. మరెందుకు అలా జరగటం లేదు?
కాబట్టి, విగ్రహారాధనం తప్పు అనే వారిది ఎంత తప్పో, విగ్రహారాధనం తప్ప వేరే దిక్కే లేదు అని వాదించేవారిది కూడా అంతే తప్పు.
4
అలాగే క్యాష్ లేదా కరెన్సీ. వివిధదేశాలలో ఇవి వివిధరూపాలలో ఉంటాయి. అన్నీ ఆయా దేశాల ఆచారవ్యవహారాలను బట్టి, సంస్కృతులను బట్టి, భాషను బట్టి, రకరకాల రంగులలో, రకరకాల డిజైన్లలో, రకరకాల చిత్రాలతో అలంకరింపబడి ఉంటాయి. అన్నిటికీ వివిధసంకేతాలు, వివిధసాంకేతిక నామాలు ఉంటాయి.
₹ - రూపాయి
$ - డాలర్
ƒ - గిల్డర్
฿ - బహత్
лв - లేవ్
R$ - రియాల్
¥ - యెన్
£ - పౌండ్
₱ - పెసో
₫ - డాంగ్
పైన చూపించినవే కాదు, ఇంకా చాలా చాలా ఉన్నాయి.
బ్రతుకుతెరువుకు ఆయా దేశాలకు వలస వెళ్లిన వారు అక్కడి కరెన్సీలనే స్వీకరిస్తారు. వాటినే నిత్యవ్యవహారంలో ఉపయోగిస్తారు. అదృష్టవశాత్తు, డబ్బుకు మతమేమీ లేదు. డబ్బుకు అంటరానితనం కూడా ఏమీ లేదు. వేరే దేశాలకు ధనార్జనకు వెళ్లిన భారతీయులు తిరిగి స్వదేశానికి వచ్చేటపుడు ఆయా దేశాల క్యాష్ ను స్వదేశీ క్యాష్ లోనికి మార్చుకుని తెచ్చుకుంటారు.
"యే యథా మాం ప్రపద్యంతే తాంస్తథైవ భజామ్యహమ్" (భగవద్గీత 4.11)
నన్ను ఎవరు ఏ విధంగా (ఏరూపంలో) భావిస్తారో నేను వారిని అదేవిధంగా (అదే రూపంలో) అనుగ్రహిస్తాను"
అని గీతాచార్యుడు స్పష్టంగా చెప్పి ఉన్నాడు. విదేశాలలో ప్రజలకు ఈ విషయం తెలియకపోవచ్చు. ఆ లెక్కకు వస్తే - అసలు మన దేశంలోని ప్రజలందరికీ కూడా కృష్ణుడు ఈ విధంగా చెప్పినట్టు తెలియదేమో. క్యాష్ / కరెన్సీ అనేది భారతీయులకు సంబంధించి లక్ష్మీ దేవి. ఈ లక్ష్మీదేవిని ప్రపంచ ప్రజలందరూ తమ తమ పద్ధతులలో ఆర్జిస్తున్నారు - ఆరాధిస్తున్నారు.
5
ఇపుడేమో భారత ప్రభుత్వం హఠాత్తుగా "గో క్యాష్ లెస్" అంటూ ఒక ఉద్యమస్థాయి విధానాన్ని చేపట్టింది. మంచిదే. ప్రజలకు విషయం అర్థం అయి పాటిస్తామంటే మంచిదే.
కానీ, పైన చెప్పినట్టు, ఎదిగిన వయసులో ఉన్న ఒక విజ్ఞాని ఒక క్రొత్త విషయాన్ని వివరిస్తే అర్థం చేసుకోగలడు. కానీ పుస్తకం లేకుండా చదువుకొమ్మని పిల్లలను నిర్బంధిస్తే వాడికి దిక్కు తోచదు. దిక్సూచి లేకుండా నౌకను నడిసముద్రంనుండి బయటపడమంటే కష్టమే. అసలు అంతకంటే పెద్ద కష్టం ఏమిటంటే - మాకు కష్టంగా ఉంది అని చెప్పిన వాళ్ళను దేశద్రోహం స్థాయి నేరం చేసిన వాళ్ళతో సమానులుగా జమకట్టడం!
నర్మదలో 182 మీటర్ల ఎత్తైన సర్దార్ వల్లభభాయి పటేల్ గారి విగ్రహం పెట్టకుంటే సమైక్యత అనే భావనను గాని, అరేబియా సముద్రంలో 210 మీటర్ల ఎత్తైన శివాజీ విగ్రహం పెట్టకుంటే స్వాత్రంత్ర్య కాంక్ష అనే భావనను గాని భారతీయులు ఏమాత్రం అర్థం చేసుకోలేరని భావిస్తున్న మోడీ గారి ప్రభుత్వం,
"మేక్ ఇన్ ఇండియా" అంటూ ఇండియా బయట ఇండియన్ల యూనిటీని ప్రతిబింబించే విగ్రహం తయారు చేయించడమే ఒక అద్భుతం అనుకుంటే, క్యాష్ లేదా కరెన్సీ లేకుండానే భారతీయులు "క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్" భావనను అర్థం చేసుకొనగలరని భావించడం మరింత గొప్ప అద్భుతం!
ఏదేమైనా ప్రభుత్వం నుండి ప్రజలు సహాయం ఆశించడమనే పాత సంప్రదాయానికి మంగళం పాడుతూ, ప్రజలనుండి సహాయం ఆశించే ప్రభుత్వాన్ని నడిపిస్తున్న మోడీ గారికి2017 సంవత్సరం స్వాగతం పలుకుతోంది. క్రొత్త సంవత్సరంలో మోడీకి, ప్రభుత్వానికి, ప్రజలకు, అందరికీ మంచి జరగాలని కోరుకుందాం.