యే అందర్ కి బాత్ హై

 |  First Published Nov 28, 2016, 8:41 AM IST

నిన్నటి "మన్-కీ-బాత్" లో ప్రధాని "నరేంద్ర మోడీ" గారు మాట్లాడుతూ, దేశ ప్రజలంతా "ఆర్థిక వ్యవహారాలన్నీ ఆన్లైన్ లోనే చేయాలనీ" - "నగదు రహిత ఆర్థిక లావాదేవీలు" చేయడానికి ప్రయత్నించాలనీ, ఆవైపుగా అందరినీ ప్రోత్సహించాలనీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు.

 

Latest Videos

undefined

అలాగే, యూ‌పి లోని మరో ఎన్నికల సభలో మాట్లాడుతూ, "బ్యాంక్ & ఏ‌టి‌ఎం సదుపాయాలు లేని గ్రామస్తులు కూడా "ఈ-వాలెట్" వాడాలని పిలుపునిచ్చారు. 

 

అలా అన్నీ పారదర్శకంగా జరిగితే నల్ల కుబేరులకు కళ్ళెం వేయవచ్చనీ, తద్వారా నీతి భారత్ నిర్మాణం చేయాలనీ మోడి గారి కల. వినడానికి ఎంత అద్భుతంగా ఉందో కదా.! . ... కానీ వాస్తవ పరిస్థ్హితి ఎలా ఉంది ?

 

 ప్రతిఒక్కరూ బ్యాంక్ అక్కౌంట్ ఓపెన్ చేసుకోవాలని మోడి గారు ప్రధానిగా పగ్గాలు చేపట్టినప్పటినుండీ చెబుతూనే ఉన్నారు. జీరో బ్యాలెన్స్ అక్కౌంట్ కోసం "జన్ ధన్ యోజన" అంటూ ఒక పథకాన్ని కూడా ప్రవేశపెట్టారు. కానీ అది ఎంతవరకూ సత్ఫలితాలనిచ్చింది ? ప్రజలు ఏమేర బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేశారు ? ఏమేర వాటిని ఉపయోగించుకొంటున్నారు ? ఏవిధంగా ఉపయోగించుకొంటున్నారు ?

 

ప్రభుత్వ పథకాలను ఏమేర ఈ అక్కౌంట్లకు లింక్ చేశారు ? ఈ వివరాలన్నీ ప్రధానికి తెలియకుండా ఉండవు. 


 సుమారు 100కోట్ల దేశ జనాభా గ్రామీణ - పట్టణ ప్రాంతాలలోనే నివసిస్తున్నారు. ఈ ప్రాంతాల్లో ప్రతి లక్షమందికీ కేవలం 8 బ్యాంకు శాఖలు మాత్రమే అందుబాటులో ఉన్నాయని లెక్కలు చెబుతున్నాయి. 125 కోట్ల జనాల్లో కనీసం 100 కోట్ల మందికీ బ్యాంకుల్లో అక్కౌంట్లు ఓపెన్ చేయాలనుకొంటే, ప్రస్తుతమున్న బ్యాంకులూ వాటి శాఖలూ సరిపోతాయా ? ఇన్ని కోట్లమందికి సేవలు అందించగలిగే సామర్థ్యం ప్రస్తుతం మన బ్యాంకింగ్ వ్యవస్థకు ఉందా ? 

 

 వ్యవసాయం చతికిలపడి, ప్రత్యామ్నాయ ఉపాధి లేక, పల్లెల్లో జీవితం దుర్భరమై, పొట్టచేత పట్టుకొని నగరబాట పట్టి, భవననిర్మాణ కార్మికులుగా అవతారమెత్తిన రైతులూ - రైతుకూలీలూ నగరాల్లోని రోడ్డుప్రక్కన గుడారాల్లో నివసిస్తూ చావలేక బ్రతుకుతున్నారు.. వీళ్ళకి బ్యాంకు ఖాతాలు ఎవరు ఓపెన్ చేస్తారు ?

 

ఒకవేళ కనాకష్టంగా తప్పుడు ధృవీకరణ పత్రాలతో అక్కౌంట్ ఓపెన్ చేసినా, వారు పనిచేస్తున్న యజమాని చెల్లింపులన్నీ ఆన్లైన్ లోనే చేస్తారా ? ఒక్క భవననిర్మాణ కార్మికులే కాదు అసంఘటిత రంగంలో ఎన్నో కోట్లమంది పనిచేస్తున్నారు. వీళ్ళందరికీ చెల్లింపులు ఆన్లైన్ లోనే చేసితీరాలని సదరు యజమానులందరికీ తాఖీదులు ఇవ్వగలరా ? అది సాధ్యమయ్యే పనేనా ? అసలు చేయాల్సిన పని చేయకుండా, ఇలా రేడియోల్లోనూ - ఎన్నికల సభల్లోనూ మాట్లాడుతూ ప్రజలను మారమంటే ఎలా ? - మార్పు మొదలవ్వాల్సింది ఆయన దగ్గరే తప్ప ప్రజల దగ్గర మాత్రం కాదు. 


 ఇకపోతే, ఈ "డీ-మానిటైజేషన్" అన్న అంశంపై నేను కొత్తగా చెప్పేదేమీ లేదు.

 

ఎవరైనా సరే దీనివల్ల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కనీసం ప్రస్తావించే ప్రయత్నం చేస్తే, వాళ్ళని నల్లధనాన్ని సమర్థించేవారిగా - దేశ ద్రోహులుగా - అభివృద్ధి నిరోధకులుగా ముద్రవేసి దాడిచేసి, నోళ్ళు మూయించేస్తున్నారు. మన ప్రధాని గారు మాత్రం "నల్ల కుబేరుల భరతం పడతానని" సందు దొరికినప్పుడల్లా ఎక్కడపడితే అక్కడ భీషణ ప్రతిజ్ఞలు చేసేస్తున్నారు. కానీ ఎక్కడైతే మాట్లాడాలో అక్కడ మొహం చాటేస్తున్నారు.. అదేనండీ, "పార్లమెంట్ లో మాత్రం" ఈ అంశంపై ఒక్కటంటే ఒక్కమాటకూడా మాట్లాడరు. ప్రతిపక్షాలు సభను సాగనివ్వకపోయినా సరే, 56 ఇంచుల యోధుడు మాత్రం ఈ అంశంపై నోరు మెదపరు. . .... చివరగా ఒక్కమాట.


మోడీ గారూ... మీరు భారత దేశాన్ని నల్ల ధన రహిత భారతంగా చేస్తే 90% మంది సంతోషిస్తారు. ఎవ్వరూ మిమ్మల్ని అడ్డుకోరు. అయితే, ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే, అంతర్జాతీయ బ్యాంకులను మోసంచేసి, లెక్కలేనన్ని ఆర్థికపరమైన ఆరోపణలతో కోర్టుల్లో పెనాల్టీ కూడా విధించబడ్డ ఆర్థిక నేరగాడైన "సుజనా చౌదరి" గారిని ఓవైపు మీ మంత్రివర్గంలో కొనసాగిస్తూ, మరోవైపు మాత్రం "ఆర్థిక నేరగాళ్ళ భరతం పడతా" అంటూ భీషణ ప్రతిజ్ఞలు చేయడం చూస్తుంటే, మీమీద అస్సలు నమ్మకం కలగడం లేదు సుమీ.! 

 

అసలు ప్రక్షాళన అంటూ మొదలుపెడితే, మీ మంత్రివర్గం నుండే మొదలు పెట్టండి. ఆర్థికపరమైన ఆరోపణలు - కేసులు ఉన్న వారిని తక్షణం మీ మంత్రివర్గం నుండి తొలగించాకనే ఈ దేశంలోని ఆర్థిక నేరాలను అరికట్టడానికి రెండో అడుగు వేయండి. . ... "ఆన్లైన్ బ్యాంకింగ్ -కాష్ లెస్ ట్రాంజాక్షన్స్" అంటూ ఊరికే, ఉబుసుపోని కబుర్లుమాని, ఆర్థిక నేరాలను అరికట్టడానికి మొదటి అడుగు మీ మంత్రివర్గం నుండే వేయండి మహాప్రభో. లేకపోతే మీకూ గురివిందకూ తేడాలేదు.!
 

click me!