సోషల్ మీడియా లో గతవారం రోజులుగా "బత్తాయిలు" అన్నమాట తెగ పాపులర్ అయింది.మాదే అసలుసిసలు దేశభక్తి అంటూ మోదీ నిర్ణయాలను వ్యతిరేకించిన వారందరినీ దేశద్రోహులుగా జమకడుతున్న వీరభక్తులకు బత్తులు అని పేరుపెట్టారు ఇతరులు.చివరికి అది కాస్తా బత్తాయిలు అయిపోయింది. ఇక కమలం గుర్తు కాబట్టి కమలాలు,బత్తాయిలంటూ ఆ భక్తులను వెటకారం చేస్తున్నారు.
undefined
నిజానికి మోడీ నిర్ణయం వెనక కారణమేమి?నల్లధనం అరికట్టడమా? దేశాన్ని నగదురహిత లావాదేవీల వైపు నడిపించడమా?
ప్రధాని ప్రసంగాలను విశ్లేషించిన వారు నగదురహిత లావాదేవీల గురించి ఇటీవల ఎక్కువగా మాట్లాడాడని చెబుతున్నారు.కారణం వీరు ఆశించిన దానికన్నా ఎక్కువ డబ్బు బ్యాంకులు చేరడం.నిజానికి నగదురహిత లావాదేవీలు అన్నప్పుడు ఈ నోట్లరద్దు అవసరమేముంది? జనాలను ఇన్ని అవస్థలపాలు చేయడమెందుకు?ఒక నిర్ణీత గడువు పెట్టి ఆ లోపల అందరూ బ్యాంక్ కార్డ్స్ తీసుకోవాలని చెబితే సరిపోయేదిగా?
బ్యాంకుల దగ్గర పరిస్థితి దుర్భరం.పని చేసి వచ్చి మళ్లీ గంటల తరబడి క్యూల్లో నిలవాల్సి వస్తుంది.ఇక వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఈ నిర్ణయం గ్రామీణ భారతాన్ని చావుదెబ్బ కొట్టింది.
ఒకవైపు కోతలకు వచ్చిన కూలీలకు డబ్బు చెల్లించే పరిస్థితి లేదు,మరో వైపు కొనుగోలుదారులు లేక,గిట్టుబాటు ధర లేక ఇంటికొచ్చిన ధాన్య అమ్మే పరిస్థితి లేదు.చేసిన అప్పుకు మాత్రం వడ్డీలు పెరుగుతున్నాయి.ఇక పూలు,పళ్లు,కూరగాయల రైతులు సర్వనాశనం అయ్యారు.
మరీ బాధపడే అంశం ఏమంటే పెద్దలకు సంబంధిన కన్ను,పన్ను లాంటి చికిత్సలు వాయిదా వేసుకోవచ్చు కానీ చిన్నపిల్లలనూ వైద్యుల దగ్గరికి తీసుకురావడం 50% తగ్గిందంటే సొంతవైద్యాలను నమ్ముకున్నారో,మందుల షాపులవారి వైద్యాన్నే నమ్ముకున్నారో అర్ధం కాని పరిస్థితి.
ఇక కొన్ని బ్యాంకుల్లో అకౌంట్ ఉన్నవారికీ చెల్లింపులు జరగడం లేదు.చాలాచోట్ల ఈ నెల ప్రారంభం నుంచి ఒక్క రూపాయ ఇవ్వలేదు.ఒకవేళ ఏదన్నా ఒకరోజు ఇస్తున్నారని ఎవరన్నా చెబితే అక్కడికి భార్య చెక్కో,విత్ డ్రాల్ ఫార్మ్ తీసుకుపోతే వారే స్వయంగా రావాలని తిప్పి పంపుతున్నారు.ఇంటికి వచ్చి వారిని తీసుకుపోయే సరికి నో క్యాష్ బోర్డ్.
మోదీ సాహసోపేత నిర్ణయం అని పొగుడుతున్న భక్తులు అలియాస్ బత్తాయిలను మిగిలినవారు కొన్ని ప్రశ్నలు అడుగుతున్నారు....
*తగినన్ని నోట్లు,మరీ ముఖ్యంగా చిన్న నోట్లు లేకుండా ఎందుకింత హఠాత్ నిర్ణయం తీసుకుని ఇబ్బంది పెడుతున్నారు?
*పెద్ద నోట్లరద్దు నల్లధనం నిర్మూలించడానికా?నగదురహిత లావాదేవీలు ప్రోత్సహించడానికా?
*ఏ రోజైనా రిజర్వ్ బ్యాంక్ ఇంత నగదు ఫలానా రాష్ట్రానికి పంపిస్తున్నాం అని చెప్పడం లేదెందుకు?
*అసలు రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగులు,బ్యాంక్ సిబ్బంది చేతివాటం లేనిదే ఇన్ని కొత్త నోట్ల కట్టలు పెద్దగద్దలకు ఎలా చేరుతున్నాయి?(నిన్న బెంగుళూరులో ఒక రిజర్వ్ బ్యాంక్ ఉద్యోగిని పట్టుకున్నారు)
*మొన్న చెన్నై లో శేఖర్ రెడ్డి,నిన్న డిల్లీ లో ఒక లాయర్,కర్నాటకలో ఒక నటుడి అల్లుడి బాత్ రూంలో కట్టలు కట్టలు బయట పడ్డాయి..మరి ఆ కట్టల సీరియల్ నంబర్ల ఆధారంగా ఎందరు బ్యాంక్ ఉద్యోగులను కటకటాల్లోకి పంపారు?
*ఈ పెద్దల మీద దాడులు నిజమైనవా లేక రాజకీయ ప్రేరేపితమా?
*ఇన్ని దగుల్బాజీ పనులు చేస్తున్న బ్యాంక్ సిబ్బంది దొంగనోట్ల వ్యాపారులతో కుమ్మక్కు ఎందుకు అయ్యుండరు?
(ఒకప్పుడు దొంగనోట్లు బ్యాంక్ చేరితే పోలీస్ రిపోర్ట్ ఇచ్చేవారు,బ్యాంకుల ఖాతాదారులెక్కువయ్యాక దాని మీద ఎర్ర సిరా గుర్తేసి పంపేవారు...అవి చలామణిలోకి వచ్చేవి కావు..ఇప్పుడు ఇన్ని లక్షల కోట్లు బ్యాంకులు చేరుతుంటే మధ్యలో వీళ్లు చేతివాటం చూపి పదినోట్లు ఆ డిపాజిట్ కట్టల్లో ఎందుకు పెట్టి ఉండరు..ఇప్పుడవన్నీ రిజర్వ్ బ్యాంక్ చేరాక తగలబెట్టేవే కదా.)
ఒక తెలుగు రాష్ట్రం ముఖ్యమంత్రి నావల్ల 24,000 కోట్లు వచ్చాయంటాదు,మరో రాష్ట్రం ఆర్ధిక మంత్రి 16,000 కోత్లు వచ్చాయంటాడు...ఈ వేలకోట్లు ఎక్కడికి పోతున్నాయో తెలియదు..జనం అర్ధరాత్రిల్లూ బ్యాంకుల ముందు పడుకుని ఉన్న ఫోటోలు పత్రికల్లో వస్తున్నాయి.
ఈ సంఘటనలకు,ప్రశ్నలకు బత్తాయిల దగ్గర జవాబుందా అని ప్రశ్నిస్తున్నారు.