లోకేశ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యమే...

First Published Nov 21, 2017, 7:49 PM IST
Highlights

 1.రాజకీయాల్లో ఉన్న వారు, మరీ ప్రత్యేకంగా అధికార పదవుల్లో ఉన్న వారు ఏదైనా అంశంపై వ్యాఖ్య చేసేటప్పుడు కస్తా వెనకా ముందు విజ్ఞతతో ఆలోచించుకొని చేస్తే అప్రతిష్టను మూటగట్టుకోరు. 

2. ప్రజల నుండి లేదా ప్రత్యర్థుల నుండి విమర్శలు ఎదురైనప్పుడు సహనంతో, హుందాగా వ్యవహరించి, సద్విమర్శ అయితే నమ్రతతో స్వీకరించడం, సద్విమర్శ కానప్పుడు దీటుగా సమాధానం ఇవ్వడం ద్వారా ప్రజల మన్ననలు పొందవచ్చు. 

3. అపరిపక్వతతో విమర్శకులపై అసంబద్ధ వ్యాఖ్యలతో ఎదురు దాడి చేస్తే తమ వ్యక్తిత్వమే ప్రశ్నించ బడుతుందన్న విషయాన్ని సదా గుర్తుంచుకోవాలి. 

4. రాష్ట్ర విభజనానంతరం తెలుగు రాష్ట్రాలలోని పౌరుల "స్థానికత", మరీ ప్రత్యేకించి హైదరాబాదులో స్థిర నివాసం ఉంటున్న ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజల "స్థానికత" సమస్య సంక్లిష్టంగా మారిన నేపథ్యంలో ఆషామాషీ వ్యాఖ్యలు చేస్తే, వాటిని అత్యంత బాధ్యతారహితమైన వ్యాఖ్యలుగా భావించబడతాయి. అలా వ్యాఖ్యలు చేసిన వారు విమర్శల పాలు కావడమే కాదు, రాజకీయంగా తగిన మూల్యం చెల్లించు కోవలసి వస్తుంది. 

5. రాష్ట్ర విభజన చట్టంలో పొందు పరచిన మేరకు హైదరాబాదు ఉమ్మడి రాజధానిగా కొనసాగుతున్నా, పరిపాలనా సౌలభ్యం, ప్రజలకు దగ్గరగా ప్రభుత్వం, రాష్ట్రాభివృద్ధిపై దృష్టి లగ్నం చేయడానికి రాష్ట్ర సచివాలయాన్ని, వివిధ విభాగాల కార్యాలయాలను, శాసనసభను నూతన రాజధాని అమరావతికి తరలించడాన్ని ప్రజలు హర్షించారు. 

6. ప్రభుత్వం తన కార్యాలయాలను, చట్ట సభల సభ్యులు, మంత్రివర్గ సభ్యులు తమ నివాసాలను తరలించినంత సులువుగా ప్రజలు తమ స్థిర నివాసాలను తరలించుకోలేరు.

7. సమస్యలో ఉన్న సంక్లిష్టత దృష్ట్యానే రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు స్థానికత సమస్య నుండి కాస్తా ఊరట పొందడానికి గడువును పొడిగిస్తూ ఇటీవలే రాష్ట్రపతి ఆదేశాలు కూడా జారీ చేశారన్న విషయం అందరికీ విధితమే.

8. జవాబుదారీతనాన్ని విస్మరించి కేవలం విమర్శకుల నోర్లు మూయించాలన్న తొందర పాటుతనంతో అర్థరహితమైన,అసంబద్ధమైన విమర్శలతో ఎదురు దాడి చేయడం ఎవరికీ మంచిది కాదు. తమ రాజధానన్న బరోసాతో వెళ్ళి జీవనాధారాలు ఏర్పాటు చేసుకొని, హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకొన్న ఆంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజల మనోభావాలను గాయ పరిచే వ్యాఖ్యలు ఎవరు చేసినా బాధ్యత రాహిత్యమే.

9. నేటి తరం నివాసం, ఉపాథి, కుటుంబ పోషణ, ఆదాయ వనరులతోను, భావితరాల భవిష్యత్తుతో ముడిపడి ఉన్న అంశంపై తేలికపాటి వ్యాఖ్యలు చేయడం అత్యంత గర్హనీయం. 

10. విభజనతో తీవ్రంగా నష్ట పోయిన ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధి పట్ల అవేదన, ఆందోళన చెందుతున్న పౌరుల పట్ల అమర్యాదగా ప్రవర్తించే మనస్తత్వాన్ని విడనాడాలి. 

11. ఆంధ్ర, రాయలసీమ మూలాలున్న పౌరులు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో స్థిర నివాసం ఉన్న వారే కాదు, దేశంలోను, ప్రపంచ దేశాల్లో ఎక్కడ నివాసం ఉన్న వారైనా ఆంధ్రప్రదేశ్ సమగ్రాభివృద్ధిని కాంక్షించే ప్రతి పౌరుడికీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలను నిశితంగా పరిశీలిస్తూ, స్పందించే హక్కున్నది. 

12. విమర్శకుల స్థానికతను ప్రశ్నించడం ద్వారా అనుచరుల చేత తాత్కాలికంగా 'శభాష్' అని పించుకోవచ్చు. కానీ, రాజకీయ పరిపక్వత ప్రశ్నార్థకమవుతుంది. 

13. నిజమైన అభిమానులు, సహచరులు, అనుచరులు తమ నేతల మాటలను, చేతలను నిశితంగా పరిశీలిస్తూ, విజ్ఞతతో స్పందించినప్పుడే తాము అభిమానించే నాయకుడికి గానీ, పార్టీ లేదా సంస్థకు దీర్ఘకాలిక ప్రయోజనాన్ని వనగూడ్చడానికి దోహదపడిన వారౌతారు.

14. కొందరు అపరిపక్వతతో సామాజిక మాధ్యమాలలో ఇటీవల పెడుతున్న పోస్టులను గమనిస్తున్న పూర్వరంగంలోనే తెలుగు దేశం పార్టీ, జాతీయ ప్రధాన కార్యదర్శి బాధ్యతల్లోను, రాష్ట్ర మంత్రిగా ఉన్న నారా లోకేష్ గారు నంది అవార్డుల ఎంపికపై కొందరు చేసిన విమర్శలకు ప్రతి విమర్శగా 'స్థానికత'ను ముడిపెట్టి వ్యాఖ్యలు చేయడం ఏ మాత్రం సమర్థనీయం కాదు. 

15. ఈ అంశంపై స్పందించడం సముచితమని భావించి, ఈ పోస్టు పెడుతున్నాను. సద్విమర్శగా తీసుకొంటే సంతోషిస్తాను. 

 

(*టి.లక్ష్మీనారాయణ,  తెలుగు నాట పేరున్న రాజకీయ విశ్లేషకుడు)

click me!