ఎవరి పేర్లు తలిస్తే రోమాలు నిక్కబొడుస్తాయో
ఎవరి రూపు కళ్ళకు కడితే జన్మ తరిస్తుందో
undefined
ఎవరి సంకల్పం వజ్రకవచమై కాపుకాస్తుందో
ముమ్మూర్తులు - ముమ్మూర్తులా మన దేశానికి ప్రతీకలో
వారు...
ఆ భగత్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లు
దేశం కోసం ఉరికొయ్యను ముద్దు పెట్టుకున్న రోజు.
దేశభక్తి బహుచిత్రమైనది. గాంధీ దేశభక్తి భగత్ ది కాదు. బ్రిటిష్ ప్రభుత్వానికి కొమ్ముకాస్తున్నాడని, లొంగిపోతున్నాడని, శాంతి వచనాలు అందులో భాగమేనని, ప్రజల ధన మాన ప్రాణాలను కొల్లగొడుతున్న పరాయి పాలకులతో పోరాటం ఇలా కాదని భావించిన భగత్ సింగ్ మార్గం గాంధీకి తీవ్రవాదం!
తెలంగాణ ఉద్యమకారులను ఉరికించి కొట్టాలి అన్న తీగల కృష్ణారెడ్డికి తెలంగాణ ఉద్యమకారులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ లాంటి వాళ్ళు. అలాంటి తీవ్ర భావాలు ఉన్నవారి మనుగడ ప్రమాదకరం అనుకుంటారు. ఎందుకంటే ఆ ప్రశ్నించే గొంతు ఊరుకోదు. పరాయి పాలనను ప్రశ్నించిన వాడు, స్వంత పాలనపైనా తిరుగబడతాడు.
విప్లవం విజయవంతమై, స్వంత ప్రభుత్వం వచ్చినాక ... నీ విధానాలు అన్నీ నాకు సమ్మతి కావు, నే వెళుతున్నా అన్న చేగువేరా కంట్లో నలుసులా గుర్తొస్తాడు కాబోలు. ఒక కోదండరాం లా. ఒక భగత్ లా. ఒక రాజ్ గురు లా. ఒక సుఖ్ దేవ్ లా.
వీరు ఎవరికీ నిద్రపట్టనివ్వరు.
అందుకే ఉద్యమ ప్రతీకలని ఉరి తీయడం. తరతరాల స్ఫూర్తి మూర్తులను తగులబెట్టడం. 'హింసాయుత పంథాలో ఉన్న భగత్ ను రక్షించడం నా విలువలకు వ్యతిరేకం' అంటారు గాంధీ - కింగ్ జార్జి కి ఒక్క ఉత్తరం రాస్తే భగత్ కు ఉరి తప్పుతుంది అన్న చర్చ తీసుకు వచ్చినపుడు. ఇదే గాంధీజీ గదర్ పార్టీతో కుమ్మక్కు అయ్యాడని బ్రిటన్ ప్రభుత్వం ఉరి శిక్ష వేసిన భాయీ పరమానంద గురించి లేఖ రాసి ఉరి నుంచి తప్పిస్తాడు, యావజ్జీవానికి మార్పిస్తాడు. తను కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు అయిన వెంటనే మరో లేఖ రాసి యావజ్జీవ శిక్షనుంచీ తప్పిస్తాడు. అండమాన్ జైలు నుంచి రప్పించి 'జాత్ పాత్ తోడక్ మండల్' కు అధ్యక్షుడిని చేస్తాడు, అంబేడ్కర్ పై 'సైద్ధాంతిక' పోరాటానికి.
కాబట్టి, దేశమూ, దేశభక్తీ అనేవి బహుచిత్రమైనవి.
అధికారంలో ఉండే వారికీ, అధికారంలోకి రావాలనుకునే వారికీ... ఎవరి నిర్వచనాలు వారికి ఉంటాయి. ఒక కాలు బ్రిటన్ లో చెప్పుల్లో వేసి ఆలోచిస్తే - నిండు సభలో బాంబు దాడి చేస్తే ఊరుకుంటామా అన్న వాదన నిజం అనిపించింది గాంధీకి.
ఈ తీవ్రవాదుల్ని ఎలా అర్థం చేసుకోగలం అని మల్లగుల్లాలు పడుతూనే ఉన్నది బీజేపీ నేటికీ. యువతలో విపరీత ప్రభావం గల ఈ ముగ్గురు భారతీయుల్ని మోయలేక, తీయలేక కిందా మీదా అయితున్నది ఏబీవీపీ.
అఖండ భారత్ పేరుతో మరో గొంతు లేవకుండా చేయాలనుకుంటున్న యోగులూ, రాజర్షులూ, సన్యాసులూ, బ్రహ్మచారులూ... 'విప్లవాన్ని చిదిమేయాలన్న' దేశభక్తిలో ఉన్నారు.
దేశం మీద భక్తి కంటే, దేశ భక్తి మీద భక్తి చూపడమే నేడు ఫ్యాషన్ అయిపొయింది.
ఒక్కపూట జ్వరం వస్తేనే తల్లడిల్లిపోయే మనం... ప్రాణాలని గడ్డిపోచలా తీసిపారేసి ప్రజల కోసం ఆత్మార్పణ చేసుకున్న బిడ్డల స్ఫూర్తితో... అపుడపుడు... ఎపుడైనా... భిన్న జాతులు, భిన్న మతాలూ, భిన్న సంస్కృతులు గల తోటి వారిని ప్రేమిద్దాం.
అది స్వాతంత్ర్య సమారయోధులైనా... తెలంగాణ సహా ఇతరేతర పోరాట యోధులైనా.
వారిని వెక్కిరించే, హేళనచేసే, బతికుండగా చంపేసే, చనిపోయాక ప్రేరణను ఉరితీసే... రాజకీయ నాయకులను అద్దం ముందు నిలబడి ఉన్నపుడయినా ప్రశ్నించాలి అనుకుందాం.
జోహార్ అమర వీరులకు.
జై హింద్ !