మీ కులాల్ని చరిత్రలోకి కూడా మోసుకుపోతారా?

 |  First Published May 4, 2017, 11:25 AM IST

అమ్మో అమ్మో ఎంత అన్యాయమో చూసావా?

ఏమైందో?

Latest Videos

undefined

ఆ టిప్పు సుల్తాన్ కారునలుపంట...మన పుస్తకాల్లో చూపినట్లు తెల్లగా ఉండడంట.....

ఏందీ,మన స్కూల్ పుస్తకాల్లో బొమ్మలూ కనిపించి చచ్చేవా? టిష్యూ పేపర్ కంటే నాసిరకం పేపర్ వాడేటోళ్లు...అక్షరాలే అలుక్కుపోయి ఉంటే నీకు తిప్పు రంగు,నూర్జహాన్ అందం కనిపించాయా?

నీవెప్పుడూ వంకర కూతలే...

సర్లే మన ఊరి మహాపాపి గాడి మనవడి కొంపలో వాడి తల వెనకాల తేజోవలయం ఉన్నట్టు ఫోటో లేదా ఏమి?

ముందు టిప్పు ఎంత మహా పాపో తెలిసే వాగుతున్నావా?ఆ మలబార్ తీరం లో ఎందరిని ఊచకోత కోసాడొ తెలిసే వాగుతున్నావా?నీలాంటోళ్లందరూ కలిసి గొప్పలు ఆపాదించారు కానీ వాడంత మతపిచ్చోడే ఉండడు...

అవునా, నేనూ శ్రీరంగపట్టణం చూసానే...టిప్పు  ఇల్లు రంగనాధస్వామి గుడికి కూతవేటు దూరంలో నే ఉందే...మరి సుప్రభాతాలు,హారతులు,నైవేద్యం సేవల్లో శబ్దాలు ఎలా భరించాడంటావు?

 

అంత మతపిచ్చోడు ఆ ఆలయాన్ని నేలమట్టం చెయ్యలేదెందుకు?పక్క రాజ్యాల మీద దండెత్తినప్పుడు దొరికినంత దోచుకుని కొంత వీళ్లుంచుకున్నారు,మరికొంత సైనికులు పంచుకోవడం కామన్ కాదా!

అసలు ఆయన మంత్రులు పూర్ణయ్య లాంటోళ్లు కారా?

సరేగానీ ఆ శ్రీరంగపట్టణం దగ్గరే మేల్కోటే ఉంది తెలుసా?

నాకెందుకు తెలీదు!మన పురుచ్చి తలైవి జయలలిత పుట్టినిల్లు....అక్కడ కొండమీద నరసింహస్వామి ఆలయం...కింద ఒక కోనేరు...అబ్బా..ఎన్ని సినిమాల్లో ఉందో...కొద్ది దూరంలో చెలువ నారాయణ స్వామి ఆలయం..అబ్బా ఎంత బాగుంటుందో!!!ఈ అందాల స్వామిని ప్రేమించి ఆరాధించిందట బీబీ నాంచారి!!!

ఆ మేల్కోటే ను తన కార్యక్షేత్రంగా మార్చుకుని శ్రీరామానుజులు వైష్ణవం ప్రచారం చేసాడు తెలుసా?

నాకెందుకు తెలీదు?ఒక చోళుడి హింస భరించలేక వారు ఇక్కడికి వచ్చారు.

అవునా?మరి ఆ రాజు,ఆచార్యులు ఇద్దరూ హిందువులేగా!శైవం,వైష్ణవం పేరు మీద అంతగా ఎందుకు హింసించుకున్నారో!!!ఇంతకూ ఆచార్యులవారు మతప్రచారానికి వచ్చారా?ఆ పక్కనే జైన కేంద్రం శ్రావణబెళగొళ లో ఉన్నవారిని మార్చడానికొచ్చాడా?

ఛీ..నీఛుడా...అడ్డగోలు వాదన తప్ప టిప్పు తడికగాడని ఒప్పుకోనంటావు?

తడికో,చింత బరికో...ఆనాటి సమాజల్లో ఎవడికి చేతనైంది వాడు దోచుకుతిన్నారు...

ఇదుగో అందరినీ ఒకేగాట కట్టి ఈ వంకరకూతలే వద్దనేది..ఆ...

నేనేమన్నా...ఆ పీష్వాలంతా సద్బ్రాహ్మణులు వచ్చి శృంగేరి ని కొల్లగొట్ట లేదా?అంతేనా ఊర్లకు ఊర్లు దుంపనాశనం చేసి ఆడాళ్లను చెరబట్టలేదా?

నీవన్నీ తప్పుడు కూతలు...

సరే నేనో పదోతరగతి తప్పిన సన్నాసిని.. మరి సరస్వతీ పుత్ర పుట్టపర్తి నారాయణాచార్యుల ప్రతీకారం నవల చదివావా?ఈ విషయం మీదే రాసాడు...ఆ మరాఠీ దండ్లు వచ్చిపడి ఎందరిని ఎత్తుకుపోతే బాలనాగమ్మ కథ మనకు వచ్చిందంటావు...విలన్ గాడు మాయల మరాఠి..అసలే 4 సార్లు సినిమాగా తీసారు..కాంచనమాల,అంజలీదేవి,జమున,శ్రీదేవి....

అప్రాచ్యుడా..నీకు రాణి పద్మిని/పద్మావతి,ఖిల్జీ కథ తెలిసే వాగుతున్నావా?

నా కెందుకు తెలీదూ.......ఆ కథ రాసినాయన మహమ్మద్ మాలిక్ జయాసీ...ఆ రాజులు,రాణులు,ఖిల్జీ పోయాక ఏ 150 ఏళ్లకో రాసాడు..అంతేనా ఆ చిత్తోడ్‌గడ్ లో మనం చూసే పద్మిని ప్యాలస్ కూడా ఆ తర్వాతి కాలంలోదని చరిత్రకారులంటారు...

సరేగానీ నీకు విజయనగర సామ్రాజ్యం లో నెహల్ కథ తెలుసా?ఒకానొక రాయలు ఒకమ్మాయిని మోహించాడు...అంతఃపురానికి తీసుకురావాలనుకున్నాడు...అక్కడికి చేరితే ఇక బయటి ప్రపంచంతో సంబంధం ఉండదు..వాళ్ల కుటుంబం పారిపోయారు..అంతే బహమనీలు,వీళ్లు కొట్టుకుచచ్చారు. అక్షరాల వేలమంది చచ్చారు...నిజానికి ఈ కథనే మల్లీశ్వరి సినిమాకు మూలం అనిపిస్తుంది కానీ వాళ్లేమో రాయలకరుణకృత్యం,ఇంకేదో illustrated weekly కథ అని చెప్పుకున్నారు..

దోచుకోవడానికి కొట్టుకుచావడానికి మతం లేదు,మట్టిగడ్డాలూ లేవు....

ఏ మతం వాడని గోల్కొండ కుతుబ్‌షాహీలమీదకు ఔరంగజేబ్ దండెత్తాడంటావు?అవునూ ఈ అక్కన్న మాదన్నల్లో అక్కన్న ఎంత తడికగాడో చెబుతూ నారాయణాచార్యులే హరిదాసి నవలా రాసారు...పండితులు ఆధారాలు లేనిదే రాయరుగా?అంతేనా ఆ బోనాల పండుగ ఆ కోట నుంచే మొదలవుతాయి కదా..మరి అంత చిన్న గుడిని ఆ నవాబులెందుకు కూల్చలేదంటావు?

ముస్లిం పాలకుల గుల్బర్గా,హైదరాబాదుల్లో ఇతర మతాలు ఎందుకు,ఎలా బతికారంటావు?

మతాల గొడవలు లేవంటావు?

అవును..ఆ చాళుక్యులు,పల్లవులు,రాష్ట్రకూటులు...200 ఏళ్లు ఎందుకు కొట్టుకుచచ్చారంటావు?పల్లవుల కంచి,చాళుక్యుల పట్టాడకల్,రాష్ట్రకూటుల ఎల్లోరాల్లో కైలాసనాధ ఆలయాలు ఉన్నాయే..హరిహర మూర్తులున్నాయే..ఎందుకు కొట్టుకు చచ్చారంటావు? 

నువ్వెన్నన్నా చెప్పు ఆ పాలకులు మాత్రం భాతృ,పితృ హంతకులు...

సర్లే వీళ్లు విజయనగర కాలం లోనూ కనిపిస్తారు..ఇంకా ముందుకుపోతే అశోకుడు మాత్రం బాతృ హత్య చేయలేదా ఏమి?ఏ మతమని కళింగ యుద్ధం చేసాడంటావు?మరి ఆయన తాత చంద్రగుపుతుడు అహింస ను తలకెత్తుకున్న జైన మతం తీసుకున్నాడే!

కానీ మన ఎగిరి దూకేది మాత్రం ఔరంగజేబు మీదే..అన్నలను చంపాడని...

నీకో విషయం తెలుసా...మనం హిందూ మతోద్ధారకుడని చెప్పుకునే శివాజీ మనవడు చెప్పుల్లేకుండా నడిచి వెళ్లి ఒక సమాధికి చాదర్ సమర్పించాడు.అదెవరిదో తెలుసా!

ఔరంగజేబ్ ది!!!!

అయితే నీ అడ్డగోలు కూతలతో ఏం చెప్పాలనుకుంటున్నావు?

నేననేదేముంది..మధ్య యుగాల పాలకులు వాళ్లు కులం,మతం ఏమీ లేవు...దోచుకో నారాజా..అంతే...మనం మత ఉద్ధారకులు,మత పిచ్చోళ్లు అని చెప్పుకునే పాలకులందరి ఆస్థానాల్లో కీలక పదవుల్లో ఇతరమతాలవారుండేవారు...ఆ బగమనీలే చూడు వాళ్ల బ్రాహ్మణ గురువు గంగు ను గుర్తుతెచ్చుకుంటూ వంశానికా పేరు పెట్టుకున్నారు...

ఇక మనమా..ప్రజాస్వామ్య దేశంలో స్వేచ్చా వాయువులు పీలుస్తూ...ఆ దరిద్రుడు అలా చేసాడు,ఈ నికృష్టుడిలా చేసాడు..వాడు నల్లోడు,స్పోటకం మచ్చలుండేవి,స్త్రీ లోలుడు,గంజాయి,మద్యం మత్తులో ఉండేవాడు..వాళ్లనంత హింసించాడు..ఇన్ని యాతనల పాలు చేసాడు అంటూ పనిలేనట్టు పాత చరిత్రలు తవ్విపోసుకుంటున్నాము...

అయితే చరిత్ర చదవడం,తెలుసుకోవడం తప్పంటావా?

ఆ మాట నేనెప్పుడన్నా....ఇదుగో 30 ఏళ్ల కింద భారత్,పాక్ one day internationals జరిగాయి..భారత్ విజయం ఖాయమనుకున్న సమయం లో జావేద్ మియాందాద్ చివరి బంతికి 6 పరుగులు చేసి పాక్ ను గెలిపించాడు..2 రోజులు బాధపడ్డాం..ఈసారి మ్యాచ్ తప్పక గెలుస్తామనుకుంటే అష్టవంకరలు తిరిగి స్పిన్ వేసే అబ్దుల్ ఖాదిర్ సిక్సర్ బాదాడు..వారం రోజులు శోకించాం....

ఇప్పుడు తలచుకుంటే నవ్వొస్తుంది...అదే సమయంలో ఎంత ఉద్విగ్నమైన ఆట చూసాం అనిపిస్తుంది....ఈ చరిత్రా ఇంతే...ఎప్పుడొ జరిగినవి తలచుకుని,అరాకొరా వ్యాసాలు చదివి బీపీలు తెచ్చుకుని ద్వేషించడంలో అర్ధం లేదంటాను...అది కాదు అంటావా..నేనూ నీలా చరిత్రలోకి పోవలసివస్తుంది.

హ..హ..హ..చూసావా..చివరికి ఎవరైనా చరిత్రలోకి రావాల్సిందే...అర్ధమైందా???హ..హ..హా..

రాకతప్పుతుందా మహాశయా...ఈ మధ్య నీలాంటి మేధావులు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు..ఆ ఐతరేయ బ్రాహ్మణం లో విశ్వామిత్రుడు బలిపశువుగా ఒప్పుకోని కొడుకులను శాపాలిచ్చి తన్ని తగలేసి ఆంధక,నాగ జాతులుగా నానా మాంసం తిని బతకమన్నాడు..ఇప్పుడీ మేధావులు ఆ 100 మంది కొడుకుల్లో మహారాష్ట్రలో ఉన్న కరేపాకు కులం,గుజరాత్ లోని కొత్తిమీర కులం,ఆంధ్రా లోని తోటకూర కులం,కేరళ లోని బచ్చలికూర కులం అంతా ఒకటే మా మూలాలు ఇవీ ఆ ఫలానా రాజులు మావాళ్లని గొప్పలు చెప్పుకుంటున్నారు...

దీనికి,నువ్వు చరిత్రలోకి పోవడానికి ఏం సంబంధం....

ఆ రాజు తెల్లోడో,ఉత్తమగుణసంపన్నుడొ..ఈ కులం మాది..అని చెప్పుకుంటున్నారు కదా..

వాళ్లకు చచ్చిన మీ నానమ్మలను,అమ్మమ్మలను సమాధులనుంచి తీసుకొచ్చి పెళ్లి చేస్తారేమో. అప్పుడు నన్నూ భోజనానికి పిలిస్తే ఎంచక్కా పంచ కట్టుకుని సిరి చాప మీద బంతి భోజనాలు చెయ్యాలనుంది....అప్పట్లో విస్తరిలో 4 లడ్లు పెట్టి సోమసూత్రం ( పక్క ఫోటో) తో నెయ్యి వడ్డిస్తే పిసుక్కుని తినాలని ఉంది...

నన్నూ పిలుస్తారుగా..మర్చిపోరుగా.....అదే... పెళ్లి భోజనానికి...

click me!