హాయిగా వేధించే ప్రేమ లేఖ

 |  First Published Jan 15, 2017, 3:30 AM IST

ప్రఖ్యాత రచయిత మార్క్ ట్వైన్  మాటల్లో “ఒక మనిషి మనసు లోనుంచి వచ్చే అత్యంత స్వేచ్చాయుత మరియు నిర్మొహమాటపు  అభివ్యక్తే (expression)  ప్రేమలేఖ”.

 

Latest Videos

undefined

ప్రేమలేఖలు అంటూనే సాహితి ప్రియులందరికీ చలం పుస్తకం ప్రేమలేఖలు, సినీ ప్రియులకు “ప్రేమలేఖలు” తెలుగు సినిమాలూ, సంగీత ప్రియులకి ప్రేమలేఖల గురించిన పాటలూ గుర్తుకు రావచ్చు.    

 

చలం పుస్తకం ప్రేమలేఖల కొక వునికినీ ఔన్నత్త్యాన్నీ ప్రసాదించింది.. ఒక రకంగా చెప్పాలంటే అసలైన నిర్వచనాన్నీ ఇచ్చిందీ పుస్తకం.  ఈ పుస్తకం లో చలం, ప్రియురాలికి నిర్మొహమాటంగా ప్రేమను వ్యక్తం చేసే విధానాన్ని సూచించాడు.   ప్రియురాలు దగ్గరగా లేనప్పుడు ఆమెతో ముఖాముఖి మాట్లాడినట్లుండడం, ఆప్తమిత్రులతో ఆంతరంగిక అభిప్రాయాల్ని పంచుకోవడం ప్రేమలేఖలకే సాధ్యమంటాడు చలం. ఆయన దృష్టిలో, “ఈ సృష్టిలోని సౌందర్యమంతా” ఒక ప్రేమలేఖే.  ప్రేమలేఖ ఒక ఎడతెగని ఆలోచనగా వుండాలి, లేఖ ను చదివేవారికి రాసిన వారు ఎదురుగా వుండి మాట్లడుతున్నట్లు అనిపించాలి అంటాడు ఆయన.

 

1953 లో రాజ్ కపూర్ నర్గిస్ జంటగా విడుదలైన “ప్రేమలేఖలు” (హిందీ లో “ఆహ్” సినిమా డబ్బింగు) సంగీతపరంగా ప్రేక్షకులని అలరించింది. జయసుధ అనంతనాగ్ మురళి మోహన్ ల తో 1977 లో విడుదలయిన “ప్రేమలేఖలు” సినిమాలో జయసుధ పాడే పాట ప్రేమలేఖల్ని  ఇలా వర్ణించింది

 

“ఇది తీయని వెన్నెల రేయి.. మధి వెన్నెల కన్న హాయి..

నా ఊహల జాబిలి రేఖలు..కురిపించెను ప్రేమ లేఖలు..”  

 

సంగం హిందీ సినిమాలో రాజేంద్రకుమార్, వైజయంతిమాలా ల మధ్య సాగే “యె మేరా ప్రేం పత్ర్ (ప్రేమలేఖ) పఢ్కర్ కె తుం నారాజ్ నా హోనా” పాట

 

శ్రీదేవి తెలుగు చిత్రం లో కే ఆర్ విజయా, హరనాథ్ ల మధ్య సాగే  “రాశాను ప్రేమలేఖలెన్నో…” అనే పాట ప్రఖ్యాతి పొందటమే కాకుండా ప్రేమలేఖల ఉనికినీ గొప్పతనాన్ని చాటాయి. 

 

అత్యున్నత మైన భావాలని సమీకరించడం వాటిని అక్షరాల్లోకి కూర్చడం, ఒక అందమైన ప్రేమలేఖ వ్రాయడం లోని భాగాలు. వీటికి పట్టే సమయం ఎక్కువే.  అయితే ఈ సమయం మొత్తం ప్రేమలేఖ రాసేవారిని ఊహల్లొ వుంచి వుయ్యాలలూగిస్తుంది. అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగచేస్తుంది. ఊహల్లో వున్న అందం వాస్తవికతలో వుండదు. వేచి వుండడం లోని ఆనందం కలయికలో వుండదు. తాము రాస్తున్నది అపరిచిత వ్యక్తి కి కాదు అనే అభిప్రాయం వల్ల ప్రేమలేఖ రాసే వారిలొ అపరిమితమైన వాక్ స్వాతంత్ర్యమూ, భావ ప్రదర్శనా కలుగుతాయి.

 

అభివృధ్ధి చెందిన సాంకేతికతలో, ఫోన్లూ, చాట్ల ద్వారా ఈ రోజుల్లో  కూడా ప్రేమ పూరితమైన సందేశాల్ని పంప గలుగు తున్నారు. కానీ చేత్తో రాసిన ప్రేమలేఖ లాంటి కళా ఖండం లో  ప్రతిబింబించే భావోద్వేగాన్ని కానీ, కళాత్మకతను కానీ  సృష్టించలేక పోతున్నారు.  ఇదీ చేత్తో రాసిన ప్రేమలేఖల గొప్పదనం.  

 

కాలం సాగే కొద్దీ, ప్రేమలేఖ అనేది కేవలం ప్రేమానురాగాల్ని వ్యక్త పరిచే ఒక సాహిత్య మాధ్యమం గా కాకుండా మేధావులు తమ బుధ్ధి కుశలతనూ, వివేకాన్నీ ప్రతిబింబించడానికీ, అత్మ శోధన చేసుకోడానికి  పనికొచ్చే సాధనంగా ఉపయోగ పడింది. ప్రేమభావం తో సాగే భాష సాహిత్యపు అంచుల్ని తాకి, వెండి వెన్నెల జల్లులు కురిపించింది.

ఈనాడు ఈ మెయిళ్లూ, చాట్లూ, సందేశాలూ, ప్రేమను వ్యక్తం చేయడానికి ఉపయోగ పడ్డా, వీటి ని చదువుకునేప్పుడు కాగితం మీది రాత ను చూసినప్పుడు కలిగే అనుభూతి కలగదు. పైగా వీటి జీవితకాలం కూడా తక్కువే. ఎందుకంటే ప్రేమలేఖల్ని భద్రపరచినట్లు వీటిని భద్రపరచము.

 

పధ్ధతి గా, జాగ్రత్తగా ఆలోచించకుండా చేతివ్రాత తో లేఖలు వ్రాయడం కుదరదు. మొదట్లోనే చెప్పాల్సిందంతా సంపూర్ణ   స్వరూపానికొచ్చినప్పుడే  రాయాల్సి వుంటుంది.  దీనివల్ల మనం  పొందికతో వుంటాం. చేతి వ్రాత  తో రాసిన ప్రేమలేఖల్లో ఒకరకమైన ఆత్మీయతా, అధికారం కనిపిస్తాయి. రాసిన వారి వ్యక్తిత్వం ప్రతిబింబిస్తుంది అంతే కాకుండా, ఆ లేఖలో అత్తరు వాసనలుంటాయి.

 

చాలా కాలం క్రింద ఓ కథ చదివాను. రచయిత ఎవరో గుర్తు లేదు. ఈ చర్చకు ఆ కథకూ సంబంధముందో లేదో తెలీదు కానీ అది ప్రేమలేఖలకు సంబంధించింది కాబట్టి దాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది.   

 

ఒక అమ్మాయి తన ప్రియుడు రాసే ప్రేమలేఖల గురించి పోస్టు మాన్ కోసం ఎదురు చూస్తూ వుంటుంది. పోస్టు మాన్ కనపడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి ఉత్తరాన్ని అందుకుంటుంది. చదువుకుంటూ ఇంట్లోకి పరిగెడుతుంది. ఇలా ఆ అమ్మాయి కి ప్రతి రోజూ పోస్టుమాన్ కోసం ఎదురుచూడటం ఒక అలవాటుగా మారిపోతుంది.

 

పోస్టుమాన్ ని చూడగానే ఆమె గుండె దడదడా కొట్టుకోవడం మొదలవుతుంది. ఏదో తెలీని ఒక భావం తో గుండె బరువెక్కుతుంది. ఇలా జరిగి జరిగి చివరికి ఆమె ఉత్తరం కంటే కూడా పోస్ట్ మాన్ కే ప్రాముఖ్యత ఇవ్వడం మొదలు పెడుతుంది. చివర్లో ఆమె ఆ పోస్ట్ మాన్ నే పెళ్లాడుతుంది.

 

ఇక్కడ అర్థమయ్యేదేమిటంటే వుత్తరం ఇచ్చే పోస్ట్ మాన్ నే ఆమె తన ప్రియుడిగా ఊహించు కోవడం మొదలెడుతుంది. అతడి గురించి ఎదురు చూడటం, అతడు కనబడగానే సంతోషం కలగడం జరిగి చివరికి అతడినే ప్రేమించడం మొదలెడుతుంది.  ప్రేమలేఖలోని విషయాలన్నీ ఆ పోస్ట్ మానే చెప్పినట్లు ఊహించుకోవడం మొదలెడుతుంది.  

 

ప్రేమ లేఖ లు మెల్లగా గతించిపోతున్నాయి. వెళుతూ వెళుతూ అవి తమతో పాటు ప్రేమను వ్యక్త పరిచే ఒక అందమైన అనుభూతి ని  తీసుకు పోతున్నాయి. పెరుగుతున్న సాంకేతికత చేత్తో రాసిన ప్రేమలేఖల ఔన్నత్యాన్ని అలాగే వుంచి లేఖల లావాదేవీల సౌలభ్యాలను పెంచే మాధ్యమంగా మారుతుందని ఆశిద్దాం.    

click me!