మంచం మీద వున్న మనిషి లేచి తిరుగుతాడన్న ఆశ రెండున్నర ఏళ్ళపాటు క్షీణిస్తూ వచ్చి, చివరికి ఆయన మరణంతో ఆవిరైపోయింది. ఆశపెట్టుకోవడమే తప్పైపోయిందన్న నిర్లిప్తత, ఒక విధమైన శూన్యం తప్ప ఆ ఇంట్లో ఏమీ లేదు.
ఇది ఒక ఇంటి కథ కాదు. ప్రత్యేక హోదా విషయంలో ఆంధ్రప్రదేశ్ వ్యధ!!
undefined
ఆర్ధిక సంస్కరణలు మొదలై ఇరవై ఏళ్ళు పైబడింది. ఫలితంగా సంక్షేమరాజ్యం స్ధానంలో మార్కెట్ ఎకానమీ వచ్చేసింది. సబ్సిడీలు అంతరించిపోతున్నాయి. ఈ నేపధ్యంలో, పోటీ ప్రపంచంలో తనకు తానే గెలవవలసివున్న స్ధితిలో ఒక రాష్ట్రానికి ప్రత్యేక మినహాయింపులు అంటే మొత్తం స్ట్రక్చర్ ను వెనక్కి తిప్పవలసి వుంటుంది.
ఇదంతా తెలిసిన, తాము నమ్మిన, దేశంలో అమలౌతున్న ఆర్ధిక విధానాల ప్రకారం ప్రత్యేక హోదా కుదరదని నరేంద్రమోదీకి, చంద్రబాబు నాయుడుకి ఎన్నికలకు ముందే తెలుసు!
ఎలాగైనా గెలవాలి కాబట్టి అబద్ధాలు చెప్పారు. అనుకోని ఆధిక్యతతో ప్రధాని అయిన తర్వాత బిజెపి హోదా విషయం మాట మార్చింది. చంద్రబాబు పిల్లిమొగ్గలు వేయడం మొదలు పెట్టారు. ఈ ఇద్దరికీ మద్ధతుగా వెంకయ్య నాయుడు డబాయింపులు మొదలు పెట్టారు. ప్రత్యేక హోదా హామీని తగలబెట్టడానికి రెండున్నర ఏళ్ళ విలువైనకాలం వృధాపోయింది. ఈ తతంగం ముగించినందుకు సన్మానాలు చేయించుకునే సాంప్రదాయాన్ని సృష్టించారు.
రాజకీయాలు సరే! ప్రజలు ఏమనుకుంటున్నారు? ఏకపక్షంగా కాంగ్రెస్ రాష్ట్రాన్ని చీల్చేసిన కాంగ్రెస్ ని ద్వేషించినంతగా మోసం చేసిన బిజెపి, తెలుగుదేశం పార్టీలను కూడా ద్వేషిస్తున్నారా? ఈ మోసంలో ఏపార్టీ పాత్ర ఎంత అనుకుంటున్నారు? ఏపార్టీకి ఎంత శిక్ష వేస్తారు? మొదలైన ప్రశ్నలకు ఖచ్చితమైన సమాధానం కోసమే ముఖ్యంగా తెలుగుదేశం పార్టీయే తలపట్టుకుంది. ఎందుకంటే బిజెపిమీద ప్రజలకు కోపం వచ్చినా ఎపిలో ఆపార్టీకి పెద్దగా వచ్చే నష్టమేమీలేదు!
ఎన్నికలకు రెండున్నర ఏళ్ళే మిగిలివున్న నేపధ్యంలో తెలుగుదేశం ద్విముఖవ్యూహంతో ముందడుగు వేస్తున్నది. ఒకటి అమలులో వున్న సంక్షేమ పధకాల విస్తృతి పెంచి తన నెట్ లోకి హెచ్చుమంది ఓటర్లను ఆకర్షించడం! రెండవది నవ్యంధ్రప్రదేశ్ నిర్మాణానికి సాక్ష్యంగా వీలైనన్ని ప్రభుత్వ సంస్ధలను కొత్త భవనాల్లో చూపించడం!
ఆర్ధికాంశాలపరంగా కాని, నియనిబంధనల్లో సడలింపుల ద్వారా అయితే నేమి, సత్వరం క్లియరెన్సుల విషయం కాని కేంద్రప్రభుత్వ సహకారం లేకుండా కొత్త ఆంధ్రప్రదేశ్ ఒక్క అడుగు కూడా ముందుకి వెయ్యలేదు! కేంద్రంతో తెగతెంపుల ప్రసక్తేలేదని చంద్రబాబు తెగేసి చెప్పడానికి ఇదే మూలం!
తెలుగుదేశం మునిగిపోయే పరిస్ధితి వస్తే తనను బోను ఎక్కిస్తారని బిజెపికి కూడా తెలుసు. అందుకే వీలైనంత, రాజకీయంగా తనకు ఇబ్బంది లేనంత వరకూ కేంద్రం ఎపికి సహకరిస్తూనే వుంది. వుంటుంది...సందుదొరికితే చాలు చంద్రబాబు మీద విరుచుకుపడే సోము వీర్రాజు, దగ్గుబాటి పురంధరేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ వంటి నాయకుల నోళ్ళు మూతబడటమే బిజెపి చేపట్టిన మొదటి దిద్దుబాటు చర్య!
రాజకీయ సంబంధాల్లో పరస్పరం గౌరవం, నమ్మకంలేని మైత్రి, కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల్లో భాగస్వామ్యం బిజెపి తెలుగుదేశం సంబంధాల్లో ఒక విచిత్రం! ఆర్ధిక సిద్ధాంతాల్లో లిబరలైజేషన్ పట్ల మోజూ మోహాల్లో నరేంద్రమోదీ, చంద్రబాబుల మధ్య గాఢమైన సారూప్యత వుండటం మరో విశేషం! రాజధాని నిర్మాణంతో సహా నవ్యాంధ్రప్రదేశ్ రూపకల్పనలో చంద్రబాబు ఆశలు, ఆకాంక్షలతో కేంద్రప్రభుత్వం ఇవ్వగలిగిన సహాయం మ్యాచ్ కాకపోవడం పెద్ధ వైరుధ్యం!
ఈ నేపధ్యంలో ఆచితూచి అడుగులు వేస్తున్న తెలుగుదేశం, బిజెపి పార్టీలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యాలపై రెండున్నర ఏళ్ళతరువాత ఒకరిని ఒకరు నిందించుకునే, తిట్టుకునే బ్లేమ్ గేమ్ క సిద్ధమైపోతున్నట్టే వున్నాయి!