శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన గరుడసేవ శుక్రవారం నాడు ప్రారంభం కానుంది.
తిరుమల: తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఏడుకొండలవాడి వాహన సేవలు కన్నుల పండువగా సాగుతున్నాయి. నాలుగు రోజుల్లో ఏడు వాహనాలపై తిరుమాడ వీధుల్లో సంచరిస్తూ భక్తులకు దర్శనమిచ్చిన మలయప్ప స్వామి ఇవాళ ఉదయం మోహినీ అవతారంలో కనువిందు చేయనున్నారు.
క్షీరసాగర మదనంలో పాలసముద్రంలో ఉద్భవించిన అమృతాన్ని రాక్షసులకు కాకుండా.. దివ్యమైన సౌందర్యంతో వారిని సమ్మోహితులను చేసి.. దేవతలకు అమృతాన్ని పంచిన జగన్మోహిని స్వరూపమే ఈ మోహిని అవతారం.
undefined
మైసూర్ మహారాజులు సమర్పించిన దంతపల్లకిలో ఊరేగుతూ భక్తులకు స్వామి దర్శనమివ్వనున్నారు.స్వామికి అత్యంత ప్రియమైన సేవకుడు గరుత్మంతుడిని వాహనంగా చేసుకోని మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు రాత్రికి దర్శనమివ్వనున్నారు.
బంగారు గరుడ వాహనంపై స్వామి వారు విశేష అభరణాలతో అలంకారమై, గజమాలలు, శ్రీవల్లి పుత్తూరు గోదాదేవి ఆలయం నుంచి వచ్చిన మాలలను స్వామి వారు ధరించి తిరుమాఢ వీధులలో ఊరేగనున్నారు.
గర్భాలయంలో మూలవర్లకు సదాసమర్పణలో ఉండే చతుర్భుజ లక్ష్మీహారం, ఐదుపేట్ల సహస్రనామం, మకరకంఠి అనే ప్రాచీనమైన మూడంతస్థులుగా ఉన్న తిరుఅభరణాలు గరుడ వాహన సేవలో స్వామి వారికి అలంకరిస్తారు.
గరుడవాహన సేవకు లక్షల్లో భక్తులు తరలివస్తారన్న అంచనాతో తితిదే విస్తృత ఏర్పాట్లు చేసింది. రాత్రి 7గంటల నుంచే గరుడ వాహన సేవ ప్రారంభంకానుంది.