చెట్ల పెంపకంలో కలెక్టర్ అమయ్ కుమార్ తీరే వేరు

By telugu teamFirst Published Dec 3, 2019, 12:42 PM IST
Highlights

అతి తక్కువ అటవీ ప్రాంతం ఉన్న జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా. అందులో సూర్యపేట జిల్లా చెట్ల పెంపకంలో మరింత వెనకబడి ఉంది. జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ కృషితో ఈ పరిస్థితి ఇప్పుడు మారింది.

సూర్యాపేట జిల్లాలో ఏదైనా రోడ్డు మార్గం గుండా వెళుతున్నప్పుడు ఇరువైపులా పచ్చని చెట్లు మనల్ని ఆహ్లాదపరుస్తాయి. ఇప్పుడు చలికాలంలో అలా సూర్యాపేట జిల్లాలో వెళ్తుంటే మాత్రం సుందర కాశ్మీరంలా ఆ చెట్లు మనకు రోడ్డుకు ఇరువైపులా స్వాగతం పలుకుతున్నట్లు కనిపిస్తాయి. ఆ మొక్కల సంరక్షణ వెనక సూర్యాపేట జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ అవిశ్రాంత కృషి దాగి ఉంది. 

తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న అటవీ విస్తీర్ణం 24 శాతం. పచ్చదనం భారీగా పెంచుకోవటం ద్వారా దీనికి 33 శాతానికి పెంచుకోవాలనే లక్ష్యమే హరితహారం పథకం ఉద్దేశ్యం. ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం చాలా ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. అందుకోసం పక్క ప్రణాళికతో ముందుకు వెళ్తుంది. కానీ కొన్ని జిల్లాలు ఈ కార్యక్రమంలో వెనకబడి ఉన్నాయనే చెప్పవచ్చు. కొన్ని జిల్లాలు మాత్రం చెట్ల పెంపకంలో చాలా ముందున్నాయి. అందులో సూర్యాపేట జిల్లా ఒకటి. మొక్కల్ని నాటడమే కాదు... వాటిని సంరక్షించటంలో జిల్లా అధికారులు చాలా కృషి చేస్తున్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ప్రత్యేక దృష్టి సారించి మొక్కల రక్షణ పట్ల రోజుకు కొంత సమయం కేటాయిస్తూ అధికారులకు సూచనలు జారీ చేస్తూ ఇప్పటివరకు అలా ఎన్నో మొక్కల్ని సంరక్షించారు. 

అతి తక్కువ అటవీ ప్రాంతం ఉన్న జిల్లా ఉమ్మడి నల్గొండ జిల్లా. అందులో సూర్యపేట జిల్లా చెట్ల పెంపకంలో మరింత వెనకబడి ఉంది. జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ కృషితో ఈ పరిస్థితి ఇప్పుడు మారింది. వాస్తవానికి సూర్యపేట జిల్లా 12 వేల హెక్టార్ల భూవిస్తీర్ణంలో 33% భూమి అటవీ ప్రాంతంగా ఉండాల్సిన అవసరం ఉంది. అటువంటిది లెక్కల్లో కేవలం 2.4% మాత్రమే అటవీ ప్రాంతం ఉన్నట్లు లెక్కల్లో చూపుతున్నారు. దీనిపై సమగ్ర పరిశోధన చేసిన కలెక్టర్ జిల్లా ప్రజలకు, అధికారులకు చెట్ల పెంపక ఆవశ్యకత వివరించి దీన్ని ఒక మహా యజ్ఞంలా కొనసాగించారు. దాంతో హరితహారం పథకం జిల్లాలో అనుకున్న ఫలితాలను ఇచ్చింది. ఒక ఉద్యమస్ఫూర్తితో హరితహారం ఇప్పుడు కొనసాగుతుంది. హరితహారంలో భాగంగా మొక్కలు నాటడమే కాదు మొక్కల సంరక్షణ చేపట్టి అధికారుల్లోనే కాదు ప్రజల ఆలోచన విధానంలో కూడా మార్పులు తీసుకురావటంలో సఫలమయ్యారు కలెక్టర్ అమయ్ కుమార్. 

రాష్ట్ర ప్రభుత్వం ఏడాదికి 40 కోట్ల మొక్కల చొప్పున 230 కోట్ల మొక్కలు నాటాలనే భారీ లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందులో అడవుల్లో మొక్కలు నాటడం, సహజంగా అటవీ పునరుజ్జీవన ప్రక్రియల ద్వారా 100 కోట్ల మొక్కలను నాటడం, ఇక అడవుల బయట, అన్ని జిల్లా ప్రాంతాలు, అన్ని ప్రాంతాల్లో కలిపి మిగతా 130 కోట్ల మొక్కలు నాటాలని నిర్ణయించారు.  ఇది సూర్యాపేట జిల్లాలో పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకొని జిల్లా కలెక్టర్ విజయవంతమయ్యారు. కొన్ని సార్లు చెట్ల సంరక్షణలో అధికారులతో కఠినంగా వ్యవహరిస్తూ పథకంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ ఎంత అవసరమో వారికి వివరించేవారు. ఇలా కొన్ని కఠిన చర్యల ఫలితంగానే జిల్లాలో పచ్చదనం శాతం పెరిగిందని చెప్పవచ్చు. 

కేవలం ప్రభుత్వ భూముల్లోనే మొక్కలు నాటడంతో సరిపెట్టకుండా కొన్ని ప్రైవేట్ సంస్థల భూముల్లో కూడా జిల్లా కలెక్టర్ అమయ్ కుమార్ ఇది అమలయ్యేలా చూశారు. ఉదాహరణకు ప్రైవేట్ పాఠశాలల్లో వాటి బౌండరీల చుట్టూ చెట్లను నాటేలా సూచనలు జారీ చేసి వాటి సంరక్షణకు వారే బాధ్యత తీసుకునేలా చర్యలు తీసుకున్నారు. అంతే కాదు ప్రభుత్వ వసతి గృహాల్లో పిల్లలకు ఆహారాన్ని అందిస్తారు. ఆయా వసతి గృహాల నిర్వాహకులకు, సిబ్బందికి కొన్ని రకాల కూరగాయల మొక్కల్ని సాగు చేయటం ఎలానో శిక్షణ ఇచ్చి వారిని ఆ దిశగా ప్రోత్సహించారు. ఈ వసతి గృహాల్లో ఉండే పిల్లల ఆహరం కోసం ఈ మొక్కల నుండే కొన్ని రకాల కూరగాయలు రావటం జరిగింది. అలా ఈ కార్యక్రమం జిల్లాలో చాలా విజయవంతమయ్యింది. ఉదాహరణకు సూర్యాపేట మండలాన్ని తీసుకుంటే 2018-19 సంవత్సరానికి గాను 28,275 మొక్కలని నాటగా అందులో 88% శాతం వరకు చెట్లు బతికాయి. 

అధికారులకు ఎప్పుడు ఏ సమావేశం జరిగిన ఎన్ని మొక్కల్ని నాటామన్నది సమావేశంలో చర్చ జరగకుండా ఎన్ని మొక్కల్ని బతికించుకున్నామన్నది చెప్పాలని తద్వారా పథకం తీరుతెన్నులు నిర్ణయించబతాయని చెప్పేవారు. దాంతో అధికారులు మొక్కలు నాటడమే కాదు వాటి సంరక్షణ పట్ల కూడా చర్యలు తీసుకునేలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఇలా సూర్యాపేట జిల్లాలో హరితహారంలో భాగంగా చేస్తున్న ఇతర కార్యక్రమాలు కూడా లక్ష్యం దిశగా మంచి ఫలితాలు సాధిస్తున్నాయి. రహదారి వనాలు (అవెన్యూ ప్లాంటేషన్‌) ఏర్పాటయ్యి జాతీయ రహదారి పక్కన చెట్లన్నీ ఎంతో సుందరంగా కనిపిస్తున్నాయి. అలా చెట్లన్నీ అంత పెద్దగా ఏపుగా పెరగటానికి జిల్లా పాలనాధికారి అమయ్ కుమార్ తీసుకున్న చర్యల ఫలితమే. 

ఇలా ఒక జిల్లా కలెక్టర్ గా అమయ్ కుమార్ మొక్కలు నాటినట్లు కేవలం కాగితాల్లోనే చూపించకుండా వాటి సంరక్షణలో కూడా ఎన్నో చర్యలు తీసుకుంటూ ఇప్పటికి ఎన్నో చెట్లని బతికించగలిగారు. తగిన రక్షణ చర్యలు తీసుకోవటం వల్ల, తక్కువ కాలంలో ఏపుగా పెరిగిన మొక్కలు, సూర్యాపేట జిల్లా రహదారులకు ఇరువైపులా పచ్చదనాన్ని పరుస్తున్నాయి.

click me!