డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దిదారుల ఎంపిక ఎలా జరగనుందంటే: మంత్రి అజయ్

By Arun Kumar PFirst Published Dec 22, 2019, 5:22 PM IST
Highlights

డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదల సొంతింటి కల తీరిపోయిందని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు.వైరా నియోజకవర్గం కారేపల్లి మండలం విశ్వనాథపల్లి గ్రామంలో రూ.1.25 కోట్ల రూపాయలతో నిర్మించిన (20) డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆయన ప్రారంభించారు. 

పేదల సొంతింటి కలను రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు  సాకారం చేస్తున్నారని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. ఆదివారం వైరా నియోజకవర్గం కారేపల్లి మండలం విశ్వనాథపల్లి గ్రామంలో రూ.1.25 కోట్ల రూపాయలతో నిర్మించిన (20) డబుల్ బెడ్ రూం ఇళ్లను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆర్ కర్ణన్ ఐఎఎస్, ఎంపీ నామ నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, ఎమ్మెల్యే రాములు నాయక్ లు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడుతూ... డబుల్‌ బెడ్రూం ఇళ్ల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో పేదల సొంతింటి కల తీరిపోయిందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మేనమామ కూడా పెళ్లి చేయడానికి ముందుకు రావడం లేదని... కానీ కేసీఆర్ మాత్రం తాను ఉన్నానని ముందుకు వచ్చారన్నారు. పేదింటి ఆడపిల్ల పెళ్లయితే రూ.లక్ష ఇస్తున్నారని... ఇది చరిత్రలో ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం చేయలేదన్నారు. 

సంక్షేమ హాస్టల్స్ లో, పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం సన్న బియ్యంతో పెడుతున్న ఘనత కూడా కెసిఆర్ కే దక్కుతుందన్నారు. జిల్లాకు 7వేల డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు మంజూరు అయ్యాయని వాటన్నిటినీ పూర్తి చేసి పేదలకు అందిస్తామన్నారు. ఒక్కో ఇంటికి రూ.6.25 లక్షలు ప్రభుత్వం ఖర్చు చేస్తుందన్నారు.

రానున్న రోజుల్లో ప్రతి పేద వాడికి ఇళ్ళు ఇవ్వాలనే సంకల్పంతో సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కొరకు రు. 5 లక్షలు ఇవ్వనున్నామన్నారు. ఈ పథకం ద్వారా వచ్చే 4 ఏళ్లలోపు పేదలందరికి ఇళ్ళు వస్తాయన్నారు. నిజమైన పేదలకు అత్యంత పారదర్శకంగా ఇండ్లు కేటాయిస్తామని... ఎక్కడా రాజకీయ ప్రమేయం లేకుండా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు.

దరఖాస్తుల కోసం ఎవరు డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా దరఖాస్తు చేసుకున్న అర్హులైన వారిని ప్రభుత్వమే గుర్తించి వారికి ఇల్లు ఇవ్వడం జరుగుతుందన్నారు. దేశానికే రోల్‌మోడల్‌గా సీఎం కేసీఆర్ డబుల్ బెడ్‌రూం ఇండ్లును నిర్మిస్తున్నారని, గేటెడ్ కమ్యూనిటీని తలపించే రీతిలో అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.

రోజువారీ అవసరాలకు అనుగుణంగా దుకాణాలు, మార్కెట్, త్రాగునీరు, విద్యుత్ సహా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు. అత్యంత పారదర్శకంగా పార్టీలు, కులాలు, మతాలకు అతీతంగా లబ్ధిదారులను ఎంపిక జరుగుతుందన్నారు.

సాగునీటి అవసరాల కోసం రూ.40 కోట్లతో బుగ్గవాగు ప్రాజెక్టును మంజూరు చేయించాన్నారు. సీతారామ ప్రాజెక్ట్ కి ముందే బుగ్గవాగు ప్రాజెక్టును పూర్తి చేస్తామని తద్వారా కారేపల్లి, కామేపల్లి, రఘునాథపాలెం మండలంలోని చెరువులను లిఫ్ట్ ద్వారా నింపుతు సాగు నీటి కొరత లేకుండా చేస్తామని మంత్రి పువ్వాడ తెలిపారు. 

click me!