రిటైర్మెంట్ పై మరోసారి మాటమార్చిన క్రిస్ గేల్...టీమిండియాతో సీరిస్ తర్వాత కాదట

By Arun Kumar PFirst Published Jul 4, 2019, 5:20 PM IST
Highlights

వెస్టిండిస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్  మరోసారి రిటైర్మెంట్ పై మాటమార్చాడు. ఇండియాతో స్వదేశంలో జరిగే సీరిస్ తర్వాత రిటైరవుతానని ఇటీవలే ప్రకటించిన గేల్ తాజాగా మాటమార్చాడు.

వెస్టిండిస్ విధ్వంసకర ఆటగాడు క్రిస్ గేల్  రిటైర్మెంట్ సస్పెన్స్ కొనసాగుతుంది. ఈ ప్రపంచ కప్ ఆరంభానికి ముందే అతడు తన రిటైర్మెంట్ పై ఓ ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ టోర్నీ మధ్యలో టీమిండియాతో మ్యాచ్ కు ముందు  రిటైర్మెంట్ పై మాటమార్చి మరో ప్రకటన చేశాడు. తాజాగా చివరి ప్రపంచ కప్ మ్యాచ్ ఆడుతున్న గేల్ మరోసారి తన రిటైర్మెంట్ పై మనసు మార్చుకున్నాడు.  

ఇప్పటికే సెమీ ఫైనల్ కు చేరలేకపోయిన వెస్టిండిస్ చివరి లీగ్ అప్ఘానిస్తాన్ తో ఆడుతోంది. ఆ  సందర్భంగా మ్యాచ్ ఆరంభానికి ముందు విండీస్ ఓపెనర్ గేల్ మాట్లాడుతూ రిటైర్మెంట్ పై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ''త్వరలో అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నట్లు ప్రకటించిన తర్వాత హోల్డర్ నా వద్దకు వచ్చాడు. నువ్వు నిజంగానే రిటైర్ అవ్వాలనుకుంటున్నావా...అని ప్రశ్నించాడు. నువ్వు కేవలం డ్రెస్సింగ్ రూంలో వుంటే ఆటగాళ్లందరికి చాలా  ధైర్యంగా వుంటుంది. అలాంటిది నువ్వు రిటైరయితే ఎలా అని అన్నాడు. హోల్డర్ మాటలు నాకు ఓ రకంగా బాధించినా...మరోవిధంగా చాలా ధైర్యాన్ని ఇచ్చాయి. 

అందువల్ల నేను ఎంతకాలం కుదిరితే అంతకాలం వెస్టిండిస్ జట్టుకు సేవ చేయాలని కోరుకుంటున్నా. అదే సమయంలో యువ ఆటగాళ్లకు నా అనుభవంతో కూడిన సలహాలు, సూచనలు  ఇస్తూ సహకరిస్తాను. నేనింకా వెస్టిండిస్ క్రికెట్ కు చాలా చేయాల్సి వుంది. ప్రస్తుతం నేనే చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాను.మైదానంలో చురుగ్గా కదల్లేక  పోతున్నా సాధ్యమైనంతవరకు ఫీల్డింగ్ కూడా  బాగానే చేస్తున్నాను'' అని గేల్ పేర్కొన్నాడు. 

ఇలా ప్రపంచకప్ తర్వాత క్రికెట్ కు గుడ్ బై చెబుతానన్ని గేల్ ఇండియాతో మ్యాచ్ కు ముందు మాటమార్చాడు. స్వదేశంలో ఇండియాతో జరిగే సీరిస్ తర్వాత రిటైరవనన్నట్లు ప్రకటించాడు. తాజాగా ఆ  మాట కూడా మార్చి ఎప్పటివరకు సాధ్యమైతే అప్పటివరకు అంతర్జాతీయ  క్రికెట్ లో కొనసాగుతానని ప్రకటించాడు. దీంతో గేల్ రిటైర్మెంట్ ఇప్పట్లో లేనట్లేనని క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలయ్యింది. 

click me!