అండర్ 19 వరల్డ్ కప్ సెమీస్ గుర్తుందిగా విలియమ్సన్...: కోహ్లీ సెటైర్లు

By Arun Kumar PFirst Published Jul 8, 2019, 6:33 PM IST
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత్-న్యూజిలాండ్ సెమీఫైనల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అండర్ 19 ప్రపంచ కప్ సెమీస్ లో విలియమ్సన్ సారథ్యంంలోని కివీస్ జట్టుతో తన సారథ్యంలోని టీమిండియా జట్టు తలపడిన విషయాన్ని కోహ్లీ గుర్తుచేశాడు. 

ప్రపంచ కప్ 2019లో హాట్ పేవరెట్ గా ఇంగ్లాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత జట్టు లక్ష్యానికి మరో రెండడుగుల దూరంలో నిలిచింది. లీగ్ దశను సక్సెస్ ఫుల్ గా ముగించుకుని పాయింట్స్ టేబుల్ లో టాప్ ప్లేస్ కు ఆక్రమించుకున్న కోహ్లీసేన ఇక సెమీస్ విజయంపై కన్నేసింది. ఈ మెగా టోర్నీలో మొదటిసారి న్యూజిలాండ్ తో సెమీఫైనల్లోనే తలపడుతున్న టీమిండియా పక్కా వ్యూహాలతో బరిలోకి దిగుతున్నట్లు కెప్టెన్ కోహ్లీ తెలియజేశాడు. ఈ సందర్భంగా 2008 లో జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ సెమీఫైనల్ గుర్తుచేసిన కోహ్లీ మళ్లీ అదే ఫలితం రిపీట్ అవుతుందని ధీమా వ్యక్తం చేశాడు. 

రేపు(మంగళవారం) భారత్-న్యూజిలాండ్ మధ్య మొదటి సెమీఫైనల్ మ్యాచ్ జరగనుంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో విరాట్ కోహ్లీ ఆసక్తికరమైన విషయాల గురించి మాట్లాడాడు. ముఖ్యంగా 2008లో తన సారథ్యంలో జరిగిన అండర్ 19 ప్రపంచ కప్ ను గుర్తుచేసుకున్నాడు. అప్పుడు కూడా సేమ్ ఇలాగే విలియమ్సన్  నేతృత్వంలోని న్యూజిలాండ్ తో సెమీఫైనల్లో తలపడాల్సి వచ్చిందని గుర్తుచేశాడు. మళ్లీ ఇప్పుడు కూడా అలాగే జరుగుతోందని... ఫలితం కూడా అలాగే వుండాలని కోరుకుంటున్నట్లు కోహ్లీ పేర్కొన్నాడు. 

పదకొండేళ్ల తర్వాత యాదృచ్చికంగానే అయినా విలియమ్సన్ కెప్టెన్సీలోని కివీస్ జట్టుతో తన సారథ్యంలోని టీమిండియా సెమీస్ ఆడటం ఓ వైపు విచిత్రంగా, మరోవైపు ఉత్కంఠగా వుందన్నాడు. ఈ  విషయాన్ని తప్పకుండా  విలియమ్సన్ గుర్తుచేస్తానని కోహ్లీ అన్నాడు. ఇరు జట్లలో అప్పుడు అండర్ 19 ప్రపంచ కప్ ఆడిగాళ్లు చాలా మంది వున్నారని...వారందరికి రేపు జరగబోయే  మ్యాచ్  చాలా ప్రత్యేకమన్నాడు. ఇలాంటి అరుదైన సందర్భం ఒకటి  వస్తుందని  తాను ఊహించలేదని..బహుశా విలియమమ్సన్ కూడా ఊహించి వుండడని తెలిపాడు. 

ప్రస్తుతం భారత జట్టు చాలా అద్భుతంగా ఆడుతోందని...మరీముఖ్యంగా బౌలింగ్ విభాగం చాలా మెరుగుపడిందన్నాడు. బ్యాటింగ్ విషయానికి వస్తే ఓపెనర్ రోహిత్ శర్మ గురించే చెప్పాల్సి వస్తుందని చమత్కరించాడు. అతడు పరిమిత ఓవర్ల క్రికెట్లో టాప్ ప్లేయర్ అని ప్రశంసించాడు. అతడిలా  వరుస సెంచరీలను సాధించలేకపోవడం వల్ల నాకేమీ బాధ  లేదని...హాఫ్ సెంచరీలతో టీమిండియా గెలుపులో తనవంతు పాత్ర పోషించినందుకు గర్వంగా ఫీలవుతున్నానని కోహ్లీ పేర్కొన్నాడు.  

click me!