మరో అరుదైన రికార్డుకు చేరువలో కోహ్లీ, రోహిత్... సచిన్, గంగూలీల సరసకు చేరేనా?

By Arun Kumar PFirst Published Jul 6, 2019, 3:40 PM IST
Highlights

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, వైస్ కెప్టెన్ రోహిత్  శర్మ లు మరో అరుదైన రికార్డుకు చేరువయ్యారు. వీరిద్దరు ప్రపంచ కప్ లో వెయ్యి పరుగులు పూర్తి చేసుకునేందుకు మరికొన్ని పరుగులు దూరంలో నిలిచారు. 

టోర్నీ ఏదైనా  సరే...పిచ్ ఎలాగైనా వుండని...స్వదేశమా, విదేశమా అన్న తేడా లేదు...వారికి తెలిసిందల్లా ఒక్కటే పరుగుల సునామీ సృష్టించడం. అదే పని తాజాగా ఇంగ్లాండ్ గడ్డపై జరుగుతున్న ప్రపంచ కప్ లోనూ  కొనసాగిస్తున్నారు. ఇంగ్లాండ్ లోని స్లో పిచ్ లపై కూడా వారిద్దరు చెలరేగుతూ టీమిండియాకు వరుస విజయాలను అందించి ఇప్పటికే సెమీస్కు చేర్చారు. ఇలా మెగా టోర్నీలో చెలరేగుతున్న ఆ ఇద్దరు టాప్ ఆటగాళ్లు మరెవరో కాదు ఒకరు టీమిండియా సారథి విరాట్ కోహ్లీ కాగా మరొకరు వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ. 

ఇలా ప్రపంచ కప్ లో పరుగుల వరద పారిస్తున్న వీరిద్దరు టీమిండియా దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీల  రికార్డులపై కన్నేశారు. టీమిండియా తరపున 44 ప్రపంచ  కప్ మ్యాచులాడిన సచిన్ టెండూల్కర్ 2278 పరుగులు చేశాడు. అలాగే 21 మ్యాచులాడిన గంగూలి 1006 పరుగులు చేశాడు. అయితే వీరిద్దరి రికార్డులకు కోహ్లీ,  రోహిత్ లు అత్యంత సమీపంలో  నిలిచారు. 

ఇప్పటివరకు ప్రపంచ కప్ టోర్నీల్లో(2011,15,19 కలిపి) కోహ్లీ మొత్తం 24 మ్యాచులాడి 995 పరుగులు సాధించాడు. శ్రీలంకతో జరిగే 25వ మ్యాచ్ లో అతడు మరో ఐదు పరుగులు వెయ్యి పరుగులు పూర్తి కానున్నాయి. దీంతో అతడు వరల్డ్ కప్ లో వెయ్యి పరుగులు పూర్తిచేసుకున్న మూడో ఆటగాడిగా నిలవనున్నాడు. 

ఇక ఈ ప్రపంచకప్ లో వరుస సెంచరీలతో అదరగొడుతున్న రోహిత్ కూడా వెయ్యి పరుగులకు చేరువయ్యాడు. అతడు కేవలం రెండు ప్రపంచ కప్ లలో(2015, 19) కలిపి 15 మ్యాచులే ఆడి 874 పరుగులు చేశాడు. మరో 126 పరుగులు చేస్తే అతడి ఖాతాలో కూడా వెయ్యి పరుగులు చేరతాయి. ఇంకా టీమిండయా మరికొన్ని మ్యాచ్ లు ఆడాల్సి వుంది కాబట్టి ఈ ప్రపంచ కప్ లోనే రోహిత్ ఈ లాంఛనాన్ని పూర్తిచేసుకునే  అవకాశం కనిపిస్తోంది. 

అయితే శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో రోహిత్ ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు. గత ఫామ్ నే అతడు ఈ మ్యాచ్ లో కూడా కొనసాగిస్తే కోహ్లీ కంటే ముందుగానే, తక్కువ మ్యాచుల్లోనే  వెయ్యి పరుగులు పూర్తి చేసుకోనున్నాడు. అయితే  కోహ్లీ మాత్రం ఈ మ్యాచ్ లో వెయ్యి పరుగుల మైలురాయిని చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. 
 

click me!