సైమండ్స్ తర్వాత రోహిత్ శర్మనే: కోహ్లీ సరసన కూడా...

By telugu teamFirst Published Jun 16, 2019, 7:58 PM IST
Highlights

ప్రపంచ చరిత్రలో పాక్‌పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. పాక్‌పై ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల సాధించిన రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ పేరిట ఉంది.

మాంచెస్టర్‌: ఐసిసి ప్రపంచ కప్ పోటీల్లో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ అరుదైన ఘనతను సాధించాడు. పాకిస్తాన్‌పై ప్రపంచ కప్ లో అత్యధిక వ్యక్తిగత పరుగులు సాధించిన రెండో ఆటగాడిగా అతను గుర్తింపు పొందాడు. ఆదివారం పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ  113 బంతుల్లో 14 ఫోర్లు, 3 సిక్సర్లతో  140 పరుగుల వ్యక్తిగత స్కోరు సాధించాడు. 

దాంతో ప్రపంచ చరిత్రలో పాక్‌పై రెండో అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఆటగాడిగా రోహిత్ శర్మ ఘనత సాధించాడు. పాక్‌పై ప్రపంచ కప్ పోటీల్లో అత్యధిక వ్యక్తిగత పరుగుల సాధించిన రికార్డు ఆస్ట్రేలియా ఆటగాడు ఆండ్రూ సైమండ్స్‌ పేరిట ఉంది. 2003 ప్రపంచ కప్ పోటీల్లో జోహెనెస్‌బర్గ్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో సైమండ్స్‌ అజేయంగా 143 పరుగులు సాధించాడు. 

సైమండ్స్ దే ఇప్పటికీ పాక్‌పై వరల్డ్‌కప్‌ అత్యధిక వ్యక్తిగత స్కోరు. అయితే ఆ తర్వాత స్థానాన్ని రోహిత్‌ ఆక్రమించాడు. రోహిత్‌ తర్వాత రాస్‌ టేలర్‌(న్యూజిలాండ్‌) ఉన్నాడు. 2011 వరల్డ్‌కప్‌లో పాక్‌పై రాస్‌ టేలర్ 131 పరుగులు చేశాడు.

పాక్‌తో మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ 85 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో సెంచరీ సాధించాడు. ఇది రోహిత్‌కు వన్డే కెరీర్‌లో 24వ సెంచరీ కాగా, ఈ ప్రపంచ కప్‌లో రెండో సెంచరీ. ఇది మొత్తంగా వరల్డ్‌కప్‌లో రోహిత్‌కు మూడో సెంచరీ.  

రాహుల్, రోహిత్ జోడి తొలి వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన తర్వాత రాహుల్‌(57) పెవిలియన్‌ చేరాడు. రియాజ్‌ బౌలింగ్‌లో బాబర్‌ అజామ్‌కు సునాయసమైన క్యాచ్‌ ఇచ్చి ఔటయ్యాడు. ఆ తరుణంలో కోహ్లితో కలిసి మరో 98 పరుగులు భాగస్వామ్యాన్ని జత చేసిన రోహిత్‌ రెండో వికెట్‌గా పెవిలియన్‌ చేరుకున్నాడు.

పాకిస్తాన్‌పై వరల్డ్‌కప్‌లో సెంచరీ సాధించిన రెండో భారత ఆటగాడిగా రోహిత్‌ శర్మ గుర్తింపు సాధించాడు. గతంలో పాక్‌పై విరాట్‌ కోహ్లి వరల్డ్‌కప్‌ సెంచరీ సాధించాడు. 2015లో కోహ్లి ఈ ఘనత సాధించగా, ఇప్పుడు కోహ్లి సరసన రోహిత్‌ చేరాడు.

click me!