
ఒక్క గెలుపు.. ఒకే ఒక్క గెలుపు.. ఐసీసీ వన్డే వరల్డ్ కప్‌లో ఒక క్వాలిఫై బెర్త్‌ను కన్ఫమ్ చేయనుంది. అదే సమయంలో రెండు సార్లు వన్డే వరల్డ్ కప్ ఛాంపియన్, రెండుసార్లు టీ20 వరల్డ్ కప్ ఛాంపియన్ అయిన వెస్టిండీస్ ఆశలను కూడా సమాధి చేయనుంది. జింబాబ్వే వేదికగా జరుగుతున్న ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ క్వాలిఫయర్స్‌లో భాగంగా నిన్న మొదలైన సూపర్ సిక్సెస్ స్టేజ్ లో భాగంగా జింబాబ్వే - ఓమన్ మధ్య ఉత్కంఠగా ముగిసిన మ్యాచ్‌ను ఆతిథ్య జింబాబ్వే గెలుచుకుంది. ఇప్పుడు ఆ జట్టు తర్వాత ఆడబోయే రెండు మ్యాచ్ లలో ఒక్కటి గెలిచినా వెస్టిండీస్ కథ కంచికే.. జింబాబ్వే వన్డే వరల్డ్ కప్ బెర్త్ ఖాయం చేసుకోనుంది.
బులవాయో వేదికగా నిన్న ఓమన్ తో జరిగిన మ్యాచ్‌లో టాస్ ఓడిన జింబాబ్వే.. మొదలు బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 332 పరుగులు చేసింది. ఈ టోర్నీ ఆరంభం నుంచి సూపర్ డూపర్ ఫామ్ లో ఉన్న జింబాబ్వే కెప్టెన్ సీన్ విలియమ్స్ (103 బంతుల్లో 142, 14 ఫోర్లు, 3 సిక్సర్లు) మరో సెంచరీ చేశాడు.
ఆల్ రౌండర్ సికందర్ రజా (42) మరో కీలక ఇన్నింగ్స్ ఆడగా చివర్లో జోంగ్వే (28 బంతుల్లో 43 నాటౌట్, 4 ఫోర్లు) ధాటిగా ఆడటంతో జింబాబ్వే భారీ స్కోరు సాధించింది. అనంతరం ఓమన్ కూడా పోరాడింది. ఆ జట్టు ఓపెనర్ కశ్యప్ ప్రజాపతి (97 బంతుల్లో 103, 12 ఫోర్లు, 1 సిక్స్) సెంచరీతో కదం తొక్కాడు. అతడికి తోడుగా అకిబ్ ఇలియాస్ (45), కెప్టెన్ జీషన్ మసూద్ (37), అయాన్ ఖాన్ (47) కూడా రాణించారు. ఆఖర్లో మహ్మద్ నదీమ్ (18 బంతుల్లో 30, 4 ఫోర్లు, 1 సిక్సర్) ధాటిగా ఆడినా ఓమన్.. 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 318 పరుగుల వద్దే ఆగిపోయింది. దీంతో జింబాబ్వే 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఈ విజయంతో జింబాబ్వే వన్డే వరల్డ్ కప్ క్వాలిఫయర్స్ బెర్త్ కు మరింత దగ్గరైంది. తర్వాత ఆడబోయే మరో రెండు మ్యాచ్ లలో ఒక్కటి నెగ్గినా ఆ జట్టు అక్టోబర్ లో భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ ఆడుతుంది. అలాకాకుండా రెండు మ్యాచ్ లు ఓడి.. శ్రీలంక కూడా రెండు మ్యాచ్‌లలో ఓడితే.. వెస్టిండీస్ ఆడబోయే మూడు మ్యాచ్ లలో భారీ విజయాలు సాధిస్తేనే విండీస్ కు అవకాశం ఉంటుంది. ఎలా చూసినా వెస్టిండీస్ కు వన్డే వరల్డ్ కప్ లో బెర్త్ దొరకడం అయితే కష్టమే..