
సోషల్ మీడియాలో విరాట్ కోహ్లీకి ఆసియాలోనే మరే క్రీడాకారుడికి లేని ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తను ప్రమోట్ చేసే బ్రాండ్స్ గురించి పోస్ట్ చేసే కోహ్లీ.. కొద్దిరోజులుగా పెడుతున్న ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ అర్థమేంటో తెలియక.. అది ఎవర్ని టార్గెట్ చేసి పెడుతున్నాడో అర్థం కాక అతడి అభిమానులు జుట్టును పీక్కుంటున్నారు. తాజాగా కోహ్లీ కూడా ఇదే తరహాలో ఓ ఇన్‌స్టా స్టోరీ పెట్టాడు.
డబ్ల్యూటీసీ ఫైనల్ లో నాలుగో రోజు ఆట ముగిసిన తర్వాత విరాట్ కోహ్లీ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో ‘ఒకవేళ మనకు బాధలు, భయాలు, అనుమానాలు వంటివి మరీ ఎక్కువైతే ప్రేమించడానికి, బతకడానికి అవకాశమే ఉండదు. అందుకే కొన్ని సార్లు వాటిని వదిలేయడం ప్రాక్టీస్ చేయాలి..’ అని రాసి ఉన్న ఓ కోట్ ను షేర్ చేశాడు.
కోహ్లీ ఈ పోస్ట్ ఇప్పుడెందుకు చేశాడో అర్థంకాని ప్రేక్షకులు జట్టుపీక్కుంటున్నారు. వ్యక్తిగత జీవితంలో ఏదైనా అవాంతరాలు ఉన్నాయా..? అంటే అనుష్కతో కూడా కోహ్లీకి ఎలాంటి గొడవలూ లేవు. క్రికెట్ లో దూకుడుగా ఉండే కోహ్లీ.. ఐపీఎల్ లో గంభీర్, నవీన్ ఉల్ హక్ లతో వాగ్వాదానికి దిగినా ఐపీఎల్ కథ ఎప్పుడో ముగిసిపోయింది. కెప్టెన్, హెడ్ కోచ్ తో విభేదాలు ఉన్నాయా..? అన్న కోణంలో చూసినా గడిచిన కొంతకాలంగా అయితే ఇలాంటి ఊసే లేదు.
రెండ్రోజుల క్రితం కోహ్లీ.. ఇదే ఇన్‌స్టా స్టోరీస్ లో ‘ఇతర వ్యక్తుల అభిప్రాయాల జైలు నుంచి స్వేచ్ఛను పొందాలంటే మనకు ఇష్టం లేని వాటిని భరించే శక్తిని అభివృద్ధి చేసుకోవాలి..’ అని రాసి ఉన్న కోట్ ను పెట్టాడు.
అయితే తొలి ఇన్నింగ్స్ లో కోహ్లీ 14 పరుగులే చేసి నిష్క్రమించిన తర్వాత.. డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి ఆవురావురుమంటూ ఏదో తింటూ కనిపించాడు. ఇందుకు సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అయింది. దీనిపై విమర్శలు కూడా వచ్చాయి. ఓపక్క మ్యాచ్ పోతుంటే నీకు ఎలా తినబుద్ది అవుతుందని కామెంట్స్ వచ్చాయి. ఇందుకు కౌంటర్ గానే కోహ్లీ ఇన్‌స్టా స్టోరీని పెట్టి ఉంటాడని కామెంట్స్ వినిపించాయి.
కానీ తాజాగా రెండో ఇన్నింగ్స్ లో మాత్రం కోహ్లీ బాగానే టచ్ లోకి వచ్చాడు. అతడి మీదే టీమిండియా ఆశలున్నాయి. మరి ఈ సందర్భంలో కోహ్లీ ఈ పోస్టులు పెట్టడం వెనుక అర్థం ఏంటో ఆ దేవుడికే తెలియాలి. ‘లోగుట్టు పెరుమాల్‌కెరక’ అన్నట్టు తాను షేర్ చేస్తున్న పోస్టులలో ఉద్దేశం అతడికే తెలిసితీరాలి. కొంతమంది ఫ్యాన్స్ అయితే.. ‘దేనిని వదిలేసినా మంచిదే గానీ ఐసీసీ డబ్ల్యూటీసీ ఫైనల్ కప్ ను మాత్రం వదిలేయకన్నా.. ఇప్పటికే పదేండ్లుగా ఐసీసీ ట్రోఫీ లేక ప్రతీసారి ఏడ్చి ఏడ్చి మా కళ్లల్లో కన్నీళ్లు కూడా ఇంకిపోయాయి..’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొందరైతే ‘ఏదో వదిలేస్తే మంచిదని అంటున్నావ్.. కొంపదీసి మ్యాచ్‌ను వదిలేయవ్ కదా..! ఎలాగూ తర్వాత బాధపడకండని చెప్పడానికి ముందే ప్రిపేర్ చేస్తున్నావా..?’ అంటూ ట్రోల్ చేస్తున్నారు.