
నాలుగు మ్యాచ్ లు ఆడితే నాలుగింట్లోనూ ఓటమి. టోర్నీలో ముందుకు సాగడం కంటే అన్నీ వెనుకడుగులే పడుతున్నాయి. అసలు గెలుపనేది ఒకటి ఉందనే విషయాన్ని మరిచిపోయారో లేక అది మనకు సంబంధం లేని విషయమని వదిలేస్తున్నారో తెలియదు గానీ డబ్ల్యూపీఎల్ లో ఆర్సీబీ అనుకున్న స్థాయిలో రాణించడం లేదనేది కండ్ల ముందు కనబడుతున్న వాస్తవం. ఈ నేపథ్యంలో ఢిల్లీ క్యాపటిల్స్ తో జరుగుతున్న నేటి మ్యాచ్ లో స్మృతి మంధాన సారథ్యంలోని ఆర్సీబీ.. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు రానుంది.
జట్టు నిండా స్టార్ ఆటగాళ్లు, ఆల్ రౌండర్లు ఉన్నా ఇంతవరకూ గెలుపు రుచి చూడని బెంగళూరుకు ఈ టోర్నీలో ఫైనల్ అవకాశాలు మిగిలుండాలంటే ఇకనుంచి ఆడబోయే అన్ని మ్యాచ్ లలోనూ గెలిచితీరాలి. మరి ఆర్సీబీ నేటి మ్యాచ్ లో అయినా ఆ దిశగా అడుగులేస్తుందా..?
బ్యాటింగ్ తో పాటు బౌలింగ్ లో కూడా విఫలమవుతున్న ఆర్సీబీ.. ఢిల్లీ క్యాపిటల్స్ తో ఈ నెల ఐదో తేదీన జరిగిన మ్యాచ్ లో దారుణంగా ఓడింది. ఆ మ్యాచ్ లో ఢిల్లీ.. నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 223 పరుగులు చేసింది. ఆర్సీబీ.. 163 పరుగులకే పరిమితమైంది. మరి నేటి మ్యాచ్ లో అయినా పుంజుకుని ఢిల్లీపై రివేంజ్ తీర్చుకోవాలని ఆ జట్టు అభిమానులు కోరుకుంటున్నారు.
బ్యాటింగ్ లో స్మృతి మంధాన ఇప్పటివరకు ఈ లీగ్ లో స్థాయికి తగ్గ ప్రదర్శన చేయలేదు. మరో ఓపెనర్ సోఫీ డివైన్ రాణిస్తున్నా ఆమె ఆట మ్యాచ్ లను గెలిపించడం లేదు. ఎలీస్ పెర్రీ, రిచా ఘోష్, నైట్ లు కూడా రాణించాల్సిన అవసరముంది. బౌలర్లలో రేణుకా సింగ్, మేగన్ షుట్ లు దారుణంగా విఫలమవుతున్న నేపథ్యంలో వీళ్లు రాణించడం ఆర్సీబీకి అత్యవసరం.
జోరుమీదున్న ఢిల్లీ..
ఆర్సీబీ కథ ఇలా ఉంటే ఢిల్లీ మాత్రం జోరుమీదుంది. ఈ సీజన్ లో ఆ జట్టు నాలుగు మ్యాచ్ లు ఆడితే మూడింటిలో గెలిచి ఒకదాంట్లో (ముంబైతో) ఓడింది. పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న ఢిల్లీ, గత మ్యాచ్ లో గుజరాత్ ను చిత్తుగా ఓడించింది. ముందు బౌలింగ్ చేసి గుజరాత్ ను 105 పరుగులకే పరిమితం చేసిన ఢిల్లీ.. ఆ తర్వాత ఏడు ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదేసింది. మరిజనె కాప్, షఫాలీ వర్మ లు రాణించడంతో ఢిల్లీ ఈజీ విక్టరీ కొట్టి జోరు మీదుంది. అదే జోరును నేడూ కొనసాగించాలని ఢిల్లీ భావిస్తోంది.
తుది జట్లు :
ఆర్సీబీ : స్మృతి మంధాన (కెప్టెన్), సోఫీ డివైన్, ఎలీస్ పెర్రీ, హెథర్ నైట్, రిచా ఘోష్, శ్రేయాంక పాటిల్, దిశా కసత్, మేగన్ షుట్, ఆశా శోభన, రేణుకా సింగ్ ఠాకూర్, ప్రీతి బోస్
ఢిల్లీ : మెగ్ లానింగ్ (కెప్టెన్, షఫాలీ వర్మ, అలీస్ క్యాప్సీ, జెమీమా రోడ్రిగ్స్, మరిజనె కాప్, తానియా భాటియా, జెస్ జొనాసేన్, అరుంధతి రెడ్డి, రాధా యాదవ్, శిఖా పాండే, తారా నోరిస్