గర్జించిన గుజరాత్.. బౌలర్లను చితకబాదిన గార్డ్‌నర్, హేమలత.. యూపీ ఎదుట భారీ లక్ష్యం

By Srinivas MFirst Published Mar 20, 2023, 5:02 PM IST
Highlights

WPL 2023: ప్లేఆఫ్స్ రేసులో ఉన్న గుజరాత్ జెయింట్స్ కీలక మ్యాచ్ లో  సగం పని విజయవంతంగా పూర్తి చేసింది.  టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్.. యూపీ ఎదుట భారీ లక్ష్యం నిలిపింది. 

తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో గుజరాత్ బ్యాటర్లు గర్జించారు.   ప్లేఆఫ్స్  రేసులో  కీలకంగా మారిన  పోరులో యూపీ బౌలర్లపై ఆధిపత్యం చెలాయించారు.  టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన  గుజరాత్.. నిర్ణీత 20  ఓవర్లలో  ఆరు వికెట్లు కోల్పోయి  178 పరుగులు చేసింది.  మరి గుజరాత్  బౌలర్లు ఈ లక్ష్యాన్ని ఏ మేరకు కాపాడుకుంటారనేది ఇప్పుడు ఆసక్తికరం. 

టాస్ గెలిచి బ్యాటింగ్ కు వచ్చిన గుజరాత్ కు ఓపెనర్లు  తొలి నాలుగు ఓవర్లలోనే   41 పరుగులు  జోడించారు.  13 బంతులాడిన  లారా వోల్వార్డ్ట్..  2 సిక్సర్లు, ఓ ఫోర్ సాయంతో   17 పరుగులు చేసింది.  అంజలి వేసిన ఐదో ఓవర్ తొల బంతికి ఆమె క్లీన్ బౌల్డ్ అయింది.

13 బంతుల్లో 3 బౌండరీల  సాయంతో 23 పరుగులు  చేసిన  సోఫీ డంక్లీ ని  రాజేశ్వరి గైక్వాడ్.. ఆరో ఓవర్ తొలి బంతికి ఔట్ చేసింది.   అదే ఓవర్లో రాజేశ్వరి..  హర్లీన్ డియోల్ (4) ను కూడా పెవిలియన్ కు పంపింది.  ఆరు ఓవర్లో  ముగిసేటప్పటికీ  గుజరాత్.. 3 వికెట్ల నష్టానికి 50 పరుగులు చేసింది. 

ఆ క్రమంలో బ్యాటింగ్ కు వచ్చిన   ఆష్లే గార్డ్‌నర్ (39 బంతుల్లో 60, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) తో  కలిసి  హేమలత  (33 బంతుల్లో 57, 6 ఫోర్లు, 3 సిక్సర్లు) లు ధాటిగా ఆడారు. ఇద్దరూ కలిసి   నాలుగో వికెట్ కు   60 బంతుల్లోనే 93 పరుగులు జోడించారు. గైక్వాడ్ వేసిన పదో ఓవర్లో 4,6 బాదింది. ఎకిల్‌స్టోన్  వేసిన  12వ ఓవర్లో గార్డ్‌నర్ కూడా రెండు ఫోర్లు, ఓ సిక్సర్ కొట్టింది. తద్వారా ఈ ఇద్దరి పార్ట్‌నర్ షిప్ 50 పరుగులు పూర్తయింది. గుజరాత్ స్కోరు కూడా వంద పరుగులు దాటింది. ఆ తర్వాత  కూడా ఇద్దరూ వికెట్ ను కాపాడుకుంటూనే  వీలు చిక్కినప్పుడల్లా  బౌండరీలు బాదారు.  15 ఓవర్లు ముగిసేసరికి  గుజరాత్..  3 వికెట్ల నష్టానికి  129 పరుగులు చేసింది.  

చివరి ఐదు ఓవర్లలో.. 

దీప్తి శర్మ వేసిన  16వ ఓవర్లో  హేమలత  సిక్సర్ కొట్టి   హాఫ్  సెంచరీ పూర్తి చేసుకుంది.  ఆ తర్వాత బంతికే బౌండరీ కొట్టింది. ఈ ఓవర్లో 14 పరుగులొచ్చాయి.   పర్శవి చోప్రా వేసిన 17వ ఓవర్లో తొలి బంతికి భారీ షాట్ ఆడిన  హేమలత.. మెక్‌‌గ్రాత్ కు క్యాచ్ ఇచ్చింది.  అదే ఓవర్లో సిక్సర్ కొట్టిన గార్డ్‌నర్.. దీప్తి వేసిన  17వ ఓవర్లో   మూడో బంతికి బౌండరీ బాది హాఫ్ సెంచరీ  పూర్తి చేసుకుంది.  ఆ ఓవర్లో మరో సిక్సర్ కూడా కొట్టింది. కానీ పర్శవి వేసిన  తర్వాతి ఓవర్లో ముందుకొచ్చి ఆడాబోయి  స్టంపౌట్ అయింది. ఈ ఓవర్లో ఐదు పరుగులే వచ్చాయి.  

ఎకిల్‌స్టోన్ వేసిన చివరి ఓవర్లో గుజరాత్ 7 పరుగులే చేసి ఓ వికెట్ కోల్పోయింది. దీంతో  ఆ జట్టు 178 పరుగుల భారీ స్కోరు సాధించింది.  యూపీ బౌలర్లలో రాజేశ్వరి గైక్వాడ్, పర్శవిలకు   తలా రెండు వికెట్లు దక్కాయి. అంజలి, ఎకిల్‌స్టోన్ లు చెరో  వికెట్ తీశారు. 

click me!