టీమిండియాపై గెలవాలంటే మీరు చేయాల్సిందిదే: విండీస్ టీంకు లారా సూచన

By Arun Kumar PFirst Published Aug 21, 2019, 6:02 PM IST
Highlights

ఇప్పటికే టీ20,వన్డే సీరిస్ లలో టీమిండియా చేతిలో ఓటమిపాలై నిరాశలో కూరుకుపోయిన విండీస్ ఆటగాళ్లను దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా మోటివేట్ చేశాడు. వారిలో పునరుత్తేజాన్ని నింపేందుకు ఆయన ప్రయత్నించాడు.  

ఇండియా-వెస్టిండిస్ ల మధ్య రెండు టెస్టులతో ఓ సీరిస్ జరగనుంది. అయితే ఇది ద్వైపాక్షిక సీరిస్ మాత్రమే కాదు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ లో భాగంగా జరుగుతున్న సమరం. దీంతో ఇరు జట్లు ఈ సీరిస్ ను గెలవడం ద్వారా టెస్ట్ ఛాపింయన్‌షిన్ లో శుభారంభం చేయడంతో పాటు టెస్ట్ సీరిస్ ను కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతున్నాయి. అయితే ప్రపంచ నెంబర్ వన్ టీం భారత్ ను ఓడించడం విండీస్ చాలాకష్టమైన పని. 

ఇప్పటికే టీ20, వన్డే సీరిస్ ల ద్వారా ఎవరి బలమేంటో తెలిసిపోయింది. విండీస్ ను వారి స్వదేశంలోనే మట్టికరిపించి ఈ రెండు సీరిస్ లను కోహ్లీసేన క్లీన్ స్వీప్ చేసి  కైవసం చేసుకుంది. ఈ  ఓటములతో డీలాపడ్డ తమ జట్టులో పునరుత్తేజాన్ని నింపేందుకు విండీస్ క్రికెట్ బోర్డు ప్రయత్నిస్తోంది. అందుకోసం దిగ్గజ క్రికెటర్ బ్రియాన్ లారా, రామ్ నరేశ్ సర్వాన్ లతో విండీస్ ఆటగాళ్లను మోటివేట్ చేయించింది. 

ఈ సందర్భంగా విండీస్ జట్టు కూర్పు, ఆటగాళ్లను ఉద్దేశించి లారా ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. ఆటగాళ్ళు శారీరకంగా బలంగా, ఫిట్ గా వున్నంత మాత్రాన జట్టు బలంగా వున్నట్లు కాదన్నాడు. శారీరక బలానికి బుద్దిబలం తోడయితేనే అద్భుతాలు చేయగల్గుతారు. ఈ రెండింటికి తోడు మానసికంగా బలమైన వారయితే వారిని అడ్డుకోవడం ఎవరి తరం కాదు. కాబట్టి సహజంగానే శారీరక బలాన్ని కలిగిన విండీస్ ఆటగాళ్ళు  మానసిక, బుద్ది  బలాన్ని  ఉపయోగించి ఆడితే టీమిండియాను టెస్ట్  సీరిస్ లో ఓడించవచ్చని సూచించాడు. 

ఆగస్ట్ 22వ తేదీ  అంటే గురువారం నుండి ఇండియా-వెస్టిండిస్ టెస్ట్ సీరిస్ ఆరంభం కానుంది. ఆంటిగ్వా వేదికన మొదటి టెస్ట్ మ్యాచ్ ప్రారంభంకానుంది. ఈ సందర్భంగా విండీస్ ఆటగాళ్ళకు లారా పలు సలహాలు, సూచనలు చేశాడు. 
 

click me!