ఒక్క ఓవర్ బౌలింగ్ చేస్తా! ఇవ్వు... డకౌట్ తర్వాత కెప్టెన్ రోహిత్‌ని అడిగిన విరాట్ కోహ్లీ...

By Chinthakindhi Ramu  |  First Published Oct 30, 2023, 6:31 PM IST

India vs England: 9 బంతులాడి డకౌట్ అయిన విరాట్ కోహ్లీ... వరల్డ్ కప్‌లో కోహ్లీకి మొట్టమొదట డక్.. తనకు బౌలింగ్ ఇవ్వాల్సిందిగా కెప్టెన్‌ రోహిత్‌ని కోరిన విరాట్ కోహ్లీ.. 


ఐసీసీ మెన్స్ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీలో 6 మ్యాచుల్లో 354 పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ. ఇందులో ఓ సెంచరీ, మూడు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. ఇంగ్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ డకౌట్ అయ్యాడు. 9 బంతులు ఆడిన విరాట్ కోహ్లీ, పరుగులు రాకపోవడంతో సహనం కోల్పోయి షాట్ ఆడబోయి అవుట్ అయ్యాడు..

వన్డే వరల్డ్ కప్ చరిత్రలో విరాట్ కోహ్లీకి ఇదే మొట్టమొదటి డకౌట్. సున్నా చుట్టిన విరాట్ కోహ్లీ, డగౌట్‌లో తన ఫ్రస్టేషన్‌ని చూపించాడు. బ్యాటింగ్‌లో  ఫెయిల్ అయ్యాక కనీసం ఫీల్డింగ్‌లో అయినా క్యాచ్‌లు అందుకుందాం అంటే భారత బౌలర్ల కారణంగా ఆ అవసరం కూడా రాలేదు..

Latest Videos

undefined

ఇంగ్లాండ్ బ్యాటర్లలో ఒక్క మొయిన్ ఆలీ మాత్రమే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. మిగిలిన బ్యాటర్లలో ఐదుగురు బ్యాటర్ల బౌల్డ్ కాగా ఇద్దరు ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరారు. క్రిస్ వోక్స్ స్టంపౌట్ అయ్యాడు. లియామ్ లివింగ్‌స్టోన్ ఇచ్చిన ఓ కష్టమైన క్యాచ్‌ని విరాట్ అందుకునేందుకు ప్రయత్నించినా, అది అతని చేతి అంచుని తాకుతూ బౌండరీకి చేరింది...

అటు బ్యాటింగ్, ఇటు ఫీల్డింగ్‌లో ఏం చేయడానికి వీలు కాకపోవడంతో తనకు బౌలింగ్ ఇవ్వాల్సిందిగా కెప్టెన్‌ రోహిత్ శర్మను కోరాడు విరాట్ కోహ్లీ.. జస్ప్రిత్ బుమ్రా ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీసిన తర్వాత ‘నేను ఒక ఓవర్ బౌలింగ్ చేస్తా...’ అని రోహిత్‌ని,కోహ్లీ అడుగుతున్న దృశ్యాలు కెమెరాలో స్పష్టంగా కనిపించాయి.. 

అయితే బౌలర్లు అద్భుతంగా రాణించడంతో విరాట్ కోహ్లీకి బౌలింగ్ ఇచ్చే ఆలోచన చేయలేదు కెప్టెన్ రోహిత్ శర్మ. కెప్టెన్ రోహిత్ శర్మ 101 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో 87 పరుగులు చేయడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు... నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 229 పరుగులు చేసింది.  సూర్యకుమార్ యాదవ్ 49, కెఎల్ రాహుల్ 39 పరుగులతో రాణించారు.

ఈ లక్ష్యఛేదనలో ఇంగ్లాండ్ 129 పరుగులకే ఆలౌట్ అయ్యింది. భారత జట్టుకి 100 పరుగుల తేడాతో విజయం దక్కింది. మహ్మద్ షమీ 4 వికెట్లు తీయగాజస్ప్రిత్ బుమ్రా 3 వికెట్లు,  కుల్దీప్ యాదవ్ 2 వికెట్లు తీశారు. జడేజాకి ఓ వికెట్ దక్కింది. 

click me!