కోహ్లీ... బిసిసిఐ నిర్ణయాన్నే ప్రశ్నిస్తున్నావా...?: హర్షా బోగ్లే

By Arun Kumar PFirst Published Jul 30, 2019, 3:49 PM IST
Highlights

టీమిండియా చీఫ్ కోచ్ ఎంపిక విషయంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎక్కువగా తలదూర్చడాన్ని ప్రముఖ వ్యాఖ్యాత హర్షా  బోగ్లే తప్పుబట్టాడు. ముఖ్యంగా తన మద్దతు రవిశాస్త్రికే అంటూ  కోహ్లీ బహిరంగంగా ప్రకటించడాన్ని అతడు తప్పుబట్టాడు. 

 ఇంగ్లాండ్ వేదికన జరిగిన ఐసిసి వన్డే ప్రపంచ కప్ లో విఫలమై భారత జట్టు ఇక 2023 వరల్డ్ కప్ నే లక్ష్యంగా పెట్టుకుంది. ఆ దిశగానే జట్టులో పలు మార్పులు చేపట్టాలని  భావిస్తున్న బిసిసిఐ ముందుగా జట్టు కోచింగ్ సిబ్బందిని మార్చే పనిలోపడింది. ప్రస్తుత చీఫ్ కోచ్ రవిశాస్త్రితో పాటు మిగతా కోచింగ్ సిబ్బందిని తొలగించి కొత్తవారిని నియమించాలని బిసిసిఐ నిర్ణయించింది. అందుకోసం ఇప్పటికే ఆసక్తి, అర్హత కలిగిన వారినుండి దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. అయితే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ మాత్రం చీఫ్ కోచ్ గా రవిశాస్త్రినే కొనసాగించాలని కోరుతున్నాడు. 

వెస్టిండిస్ పర్యటన నేపథ్యంలో నిన్న(సోమవారం) జరిగిన ప్రెస్ మీట్ లో ఈ విషయాన్ని విరాట్ కోహ్లీ బహిరంగంగా వెల్లడించాడు. చీఫ్ కోచ్ గా రవిశాస్త్రి కే తన మద్దతని మీడియా సమక్షంలోనే వెల్లడించాడు. దీంతో బిసిసిఐ నిర్ణయాన్నే ప్రశ్నించేలా కోహ్లీ వ్యవహరించాడంటూ అతడిపై విమర్శలు వస్తున్నాయి. ఓ వైపు  చీఫ్ కోచ్ పదవికోసం సెలెక్షన్ ప్రక్రియ కొనసాగుతుండగానే ఇలా మాట్లాడటం తగదని ప్రముఖ వ్యాఖ్యాతలు ఆకాశ్ చోప్రా, హర్షా బోగ్లే లు కూడా కోహ్లీని తప్పుబట్టారు. 

''టీమిండియా కెప్టెన్(విరాట్ కోహ్లీ) చీఫ్ కోచ్ పదవికి తన మద్దతు ఎవరికో ప్రకటించాడు. దీనికి  ముందే ఓ సీఏసీ సభ్యుడు కూడా టీమిండియా హెడ్ కోచ్ ఎంపిక విషయంలో కోహ్లీ మాదిరిగానే స్పందించాడు. అయినా కూడా ఇంకా ఆ పదవికోసం దరఖాస్తు  చేయాలని  అనుకుంటున్న...ఇప్పటికే చేసిన వారికి గుడ్ లక్.'' అంటూ ఆకాశ్ చోప్రా కాస్త వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. అంటే ఇప్పటికే చీఫ్ కోచ్ గా రవిశాస్త్రి ఎంపిక దాదాపు  ఖరారయినట్లేనని ఆకాశ్ చోప్రా పరోక్షంగా పేర్కొన్నాడు.

ఈ ట్వీట్ పై మరో వ్యాఖ్యాత హర్షా  బోగ్లే కూడా స్పందించాడు.'' ఇది మంచి పద్దతి కాదు. ఇంకా దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతూ వుండగా కోహ్లీ ఇలా మాట్లాడటం సమజసం కాదు. ముఖ్యంగా చీఫ్ కోచ్ ఎంపికలో ప్రధాన పాత్ర పోషించే టీమిండియా కెప్టెన్ ఇలా బహిరంగంగా రవిశాస్త్రికి మద్దతివ్వడం మంచిది కాదు.'' అని హర్షా బోగ్లే అభిప్రాయపడ్డాడు. 

click me!