
లక్నో సూపర్ జెయింట్స్ సారథి కెఎల్ రాహుల్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడు. ముంబై అంటేనే ఇష్టంగా బాదే రాహుల్.. మళ్లీ అదే జట్టుపై కెప్టెన్ గా రెండో శతకం కొట్టాడు. 60 బంతుల్లోనే 9 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో వంద పరుగులు చేసిన రాహుల్.. సెంచరీ తర్వాత చేసుకున్న సంబురాలు ఇప్పుడు వైరల్ గా మారాయి. శతకం బాదాక రాహుల్.. చెవులు, కళ్లను మూసుకుని చేసుకునే సెలబ్రేషన్ స్టైల్ మరోసారి చర్చనీయాంశమైంది.
వందో మ్యాచ్ ఆడుతున్న రాహుల్.. ఈ మ్యాచ్ లో అత్యద్భుత ఆటతీరుతో శతకం చేశాడు. అయితే శతకం అనంతరం రాహుల్.. తన రెండు చెవులతో పాటు కళ్లను కూడా మూసుకున్నాడు. ఇది తనమీద విమర్శలు చేసేవారికి సమాధానమని రాహుల్ గతంలో కూడా వెల్లడించాడు.
చెవులను మూసుకుని విమర్శకులు ఏం చెప్పింది తాను వినదల్చుకోవడం లేదని చెప్పడం.. కళ్లు కూడా మూసుకుని తనపై వచ్చే విమర్శలను పట్టించుకోనని తెలియజేయడం ఈ సెలబ్రేషన్ స్టైల్ ప్రత్యేకత. పనికిరాని విమర్శలతో తనను కిందికి దిగజార్చేవారికి ఇదే సమాధానం అని రాహుల్ గతంలో చెప్పాడు. తాజాగా కూడా అదే చేసి చూపించాడు.
ఈ ఐపీఎల్ లో ముంబై తో మ్యాచ్ కు ముందు రాహుల్ ప్రదర్శన గొప్పగా ఏంలేదు. ఒక్క సన్ రైజర్స్ తో మ్యాచ్ లో తప్ప అతడు పెద్దగా రాణించలేదు. ముంబై తో మ్యాచ్ కు ముందు ఐదు ఇన్నింగ్స్ లలో రాహుల్ స్కోర్లు వరుసగా.. 0, 40, 68, 24, 0.. దీంతో రాహుల్ పై తీవ్ర విమర్శలు వచ్చాయి. వికెట్ కీపింగ్ బాధ్యతలు లేకున్నా రాహుల్ మాత్రం పెద్దగా ఆకట్టుకోవడం లేదనేది ప్రధాన ఆరోపణ. కానీ ఈ మ్యాచ్ లో మాత్రం రాహుల్.. తన ఆటతోనే విమర్శకులకు సమాధానమిచ్చాడు. వందో మ్యాచ్ ఆడుతున్న లక్నో సారథి.. ముంబై బౌలర్లను పేరు పేరునా బాదాడు. అతడి దూకుడుకు ఒక్క బుమ్రా తప్ప మిగిలిన బౌలర్లంతా బాధితులే.
కాగా.. వందో మ్యాచ్ లో సెంచరీ చేసిన రాహుల్ ముంబై సారథిగా రెండో సెంచరీ సాధించాడు. ఇలా ఒకే జట్టుపై రెండో సెంచరీ చేసినవారిలో క్రిస్ గేల్ (పంజాబ్ కింగ్స్ పై), విరాట్ కోహ్లి (గుజరాత్ టైటాన్స్ పై), డేవిడ్ వార్నర్ (కోల్కతా నైట్ రైడర్స్ పై) తర్వాత కెఎల్ రాహుల్ (ముంబై ఇండియన్స్ పై ) చేరాడు. ఇక ముంబైతో రాహుల్ ఆడిన 15 ఇన్నింగ్స్ లలో 764 పరుగులు చేశాడు. ఇందులో రెండు సెంచరీలు, 5 హాఫ్ సెంచరీలున్నాయంటే అతడికి ముంబై బౌలర్లంటే ఎంతిష్టమో అర్థం చేసుకోవచ్చు.
అంతేగాక.. ఐపీఎల్ లో ఆడిన వంద మ్యాచులలో 3,500 కు పైగా పరుగులు చేసిన రెండో ఆటగాడు కెఎల్. ఈ జాబితాలో క్రిస్ గేల్ (3,578) ముందున్నాడు. తాజా సెంచరీతో రాహుల్.. 3,508 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. మూడో స్థానంలో డేవిడ్ వార్నర్.. (3,304) ఉన్నాడు.