టీమిండియా చీఫ్ కోచ్ రేసు నుండి జయవర్ధనే ఔట్... కోహ్లీ వల్లేనా..?

By Arun Kumar PFirst Published Aug 1, 2019, 9:09 PM IST
Highlights

టీమిండియా ప్రధాన కోచ్ రేసులో ముఖ్యంగా వినిపించిన పేరు శ్రీలంక  మాజీ కెప్టెన్ మహేల జయవర్ధనే. అయితే ఈ పదవికి బిసిసిఐ విధించిన గడువు ముగిసినా అతడు అసలు దరఖాస్తు చేయకపోవడం అందరిని ఆశ్యర్యంలో ముంచెత్తుతోంది.  

ప్రపంచ కప్ నుండి టీమిండియా సెమీస్ నుండి నిష్క్రమించిన తర్వాత బిసిసిఐ జట్టు ప్రక్షాళన కార్యక్రమాన్ని చేపట్టింది. అందులో భాగంగా మొదట కోచింగ్ సిబ్బందిని మార్చి కొత్తవారికి అవకాశమివ్వాలని బోర్డు నిర్ణయించింది. అందుకోసం ఆసక్తి, అర్హత కలిగిన వారి నుండి దరఖాస్తులు కోరగా నెలరోజుల్లోనే  ఒక్క చీఫ్ కోచ్ పదవికే దాదాపు 2వేల మంది దరఖాస్తు చేసుకున్నారు. అయితే కోహ్లీ రవిశాస్త్రికి మద్దతుగా ప్రకటించకుండా వుండివుంటే ఈ సంఖ్య మరింత ఎక్కువగా వుండేదని అభిమానులతో పాటు కొందరు క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

భారత చీఫ్ కోచ్ రేసులో ప్రధానమైన అభ్యర్థిగా ప్రచారం జరిగిన శ్రీలంక మాజీ కెప్టెన్ మహేల జయవర్దనే అసలు దరఖాస్తే చేసుకోకపోవడం అందరిని ఆశ్యర్యానికి గురిచేస్తోంది. అయితే ఇందుకు కూడా కోహ్లీ వ్యాఖ్యలే కారణమై వుంటాయన్న అనుమానం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా రోహిత్ శర్మ కు  సన్నిహితుడైన జయవర్ధనే ను అడ్డుకోడానికే కోహ్లీ బహిరంగంగా రవిశాస్త్రికి మద్దతిచ్చి  వుంటాడని మరో చర్చ కూడా క్రీడా వర్గాల్లో సాగుతోంది. 

మహేల జయవర్ధనే ప్రస్తుతం ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కోచ్ గా వ్యవహరిస్తున్నాడు. అదే జట్టుకు రోహిత్ కెప్టెన్ గా వున్నాడు. దీంతో సహజంగానే వీరిద్దరి మధ్య సాన్నిహిత్యం వుంటుంది. అలాగే వీరిద్దరు పలుమార్లు ముంబై జట్టుకు ఐపిఎల్ ట్రోఫీని అందించారు. కాబట్టి టీమిండియా చీఫ్ కోచ్ గా జయవర్ధనే వుంటే రోహిత్ తన కెప్టెన్సీకి ఎసరు పెట్టే అవకాశాలున్నాయని కోహ్లీ భావించాడట. అందుకోసమే మరోసారి రవిశాస్త్రికి అవకాశమివ్వాలని కోరుకుంటున్నట్లు మీడియా సమక్షంలోనే వెల్లడించి జయవర్ధనేను పక్కకు తప్పించాడట.    

ఇక భారత జట్టు చీఫ్ కోచ్ పదవికోసం దరఖాస్తు చేసుకున్నవారిలో స్వదేశీయుల్లో రాబిన్ సింగ్, లాల్ చంద్ రాజ్ పుత్ ప్రదాన పోటీలో వుండే అవకాశాలున్నాయి. ఇక విదేశీయుల విషయానికి వస్తే టామ్ మూడీ, గ్యారీ కిరిస్టన్, మెక్ హసెన్ లు వున్నారు. వీరందరికి కంటే మళ్లీ రవిశాస్త్రినే చీఫ్ కోచ్ గా ఎంపిక చేసే అవకాశాలే  ఎక్కువగా కనిపిస్తున్నాయి. 
 

click me!