రవిచంద్రన్ అశ్విన్ హాఫ్ సెంచరీ! తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా ఆలౌట్...

తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లు బ్యాటింగ్ చేసి 438 పరుగులకి ఆలౌట్ అయిన టీమిండియా... ఆఖర్లో హాఫ్ సెంచరీ అందుకున్న రవిచంద్రన్ అశ్విన్.. 

Ravichandran Ashwin scores half century, Team India all-out after scoring huge score, India vs West Indies CRA

వెస్టిండీస్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 128 ఓవర్లు బ్యాటింగ్ చేసి 438 పరుగులకి ఆలౌట్ అయ్యింది. ఓవర్ నైట్ స్కోరు 288/4 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, తొలి సెషన్‌లో 2 వికెట్లు కోల్పోగా, రెండో సెషన్‌లో 4 వికెట్లు కోల్పోయింది. తొలి వికెట్‌కి 139 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత యశస్వి జైస్వాల్ అవుట్ అయ్యాడు.

74 బంతుల్లో 9 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 57 పరుగులు చేసిన యశస్వి జైస్వాల్, జాసన్ హోల్డర్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. 12 బంతుల్లో 2 ఫోర్లతో 10 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్, వరుసగా రెండో మ్యాచ్‌లోనూ నిరాశపరిచాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 143 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేసి వర్రీకాన్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు..

Latest Videos

అజింకా రహానే 8 పరుగులు చేసి అవుట్ కాగా విరాట్ కోహ్లీ 206 బంతుల్లో 11 ఫోర్లతో 121 పరుగులు చేసి.. టెస్టు కెరీర్‌లో 29వ సెంచరీ అందుకున్నాడు. 500వ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీకి ఓవరాల్‌గా ఇది 76వ అంతర్జాతీయ సెంచరీ. 2023లో రెండు వన్డే సెంచరీలు బాదిన విరాట్ కోహ్లీ, మరో రెండు టెస్టు సెంచరీలు నమోదు చేశాడు.

సెంచరీ తర్వాత విరాట్ కోహ్లీ రనౌట్ రూపంలో పెవిలియన్ చేరాడు. విరాట్ కోహ్లీ టెస్టు కెరీర్‌లో ఇది మూడో రనౌట్. చివరిగా 2020 ఆడిలైడ్ టెస్టులో అజింకా రహానేతో సమన్వయ లోపం కారణంగా రనౌట్ అయ్యాడు విరాట్ కోహ్లీ. కోహ్లీతో కలిసి ఐదో వికెట్‌కి 159 పరుగుల భాగస్వామ్యం జోడించిన రవీంద్ర జడేజా 152 బంతుల్లో 5 ఫోర్లతో 61 పరుగులు చేసి అవుట్ కాగా రెండో టెస్టు ఆడుతున్న ఇషాన్ కిషన్ 37 బంతుల్లో 4 ఫోర్లతో 25 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు..

జయ్‌దేవ్ ఉనద్కట్ 7 పరుగులు చేసి అవుట్ కాగా మహ్మద్ సిరాజ్ 11 బంతులు ఆడి డకౌట్ అయ్యాడు. 78 బంతుల్లో 8 ఫోర్లతో 56 పరుగులు చేసిన రవిచంద్రన్ అశ్విన్, టెస్టుల్లో 14వ హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. వెస్టిండీస్‌లో రవిచంద్రన్ అశ్విన్‌కి ఇది 5 ఇన్నింగ్స్‌ల్లో 3వ 50+ స్కోర్. మిగిలిన రెండు సార్లు సెంచరీలు బాదాడు అశ్విన్.. 

వెస్టిండీస్ బౌలర్లలో కీమర్ రోచ్, జోమల్ వర్రీకాన్ మూడేసి వికెట్లు పడగొట్టగా జాసన్ హోల్డర్ 2 వికెట్లు తీశాడు. షెన్నాన్ గ్యాబ్రియల్‌కి ఓ వికెట్ దక్కింది. 

vuukle one pixel image
click me!