ICC U-19 World Cup: ధావన్ ను దాటిన రాజ్ బవ.. ఉగాండాను చిత్తుగా ఓడించిన టీమిండియా

By Srinivas MFirst Published Jan 23, 2022, 11:07 AM IST
Highlights

ICC Under-19 World Cup 2022- Raj Bawa: టీమిండియా యువ ఆటగాడు రాజ్ బవ ఉగాండా  బౌలర్లకు చుక్కలు చూపించాడు. అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా  ఆదివారం జరిగిన ఆఖరి లీగ్ మ్యాచులో భారత్ అఖండ విజయం  సాధించి క్వార్టర్స్ కు చేరింది.

వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న అండర్-19  వన్డే ప్రపంచకప్ లో భారత జట్టు జైత్రయాత్ర కొనసాగుతున్నది.  లీగ్  మ్యాచులలో భాగంగా ఆదివారం రాత్రి ఉగాండాతో జరిగిన ఆఖరి పోరులో భారత జట్టు ఘన విజయాన్ని నమోదు చేసింది. టీమిండియా యువ ఆటగాడు రాజ్ బవ  సంచలన ఇన్నింగ్స్  ఆడాడు. 108 బంతుల్లోనే 162 పరుగులు చేశాడు.  ఈ క్రమంలో అతడు భారత సీనియర్ జట్టు ఓపెనర్ శిఖర్ ధావన్  రికార్డును బ్రేక్ చేశాడు. ఈ మ్యాచులో రాజ్ బవ తో పాటు ఓపెనర్ అంగ్‌కృష్‌ రఘువంశీ (144) కూడా  రాణించడంతో  భారత్ భారీ  స్కోరు సాధించింది. భారీ లక్ష్య ఛేదనలో ఉగాండా 79 పరుగులకే ఆలౌట్ అయింది.  ఇప్పటికే క్వార్టర్స్ కు చేరుకున్న భారత్.. జనవరి 29న బంగ్లాదేశ్ తో క్వార్టర్స్ లో తలపడనున్నది. 

టాస్ ఓడి బ్యాటింగ్ కు  దిగిన భారత్.. నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 405 పరుగుల భారీ స్కోరు సాధించింది. ఓపెనర్ హర్నూర్ సింగ్ (15), కెప్టెన్ నిశాంత్ సంధు (15) వెంటవెంటనే నిష్క్రమించినా భారత జట్టు భారీ స్కోరు చేయగలిగిందంటే  అది రఘువంశీ, రాజ్ బవల దూకుడే కారణం. ఈ ఇద్దరూ కలిసి మూడో వికెట్ కు 206 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

85 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన భారత్ ను రాజ్, రఘువంశీ లు ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి  ఉగాండా బౌలర్లను ఆటాడుకున్నారు. ముఖ్యంగా రాజ్ బవ.. ఉగాండా బౌలర్లను చెడుగుడు ఆడుకున్నాడు. 108 బంతుల్లోనే 14 ఫోర్లు, 8 సిక్సర్ల సాయంతో 162 పరుగులు చేశాడు. ఈ క్రమంలో  అతడు  శిఖర్ ధావన్ రికార్డును బ్రేక్ చేశాడు. అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా భారత్ తరఫున అత్యధిక స్కోరు చేసిన రికార్డు గతంలో ధావన్ పేరిట ఉండేది. 2004లో స్కాట్లాండ్ తో జరిగిన అండర్-19 ప్రపంచకప్ లో భాగంగా ధావన్.. 155 పరుగులు చేశాడు. ఇప్పుడు రాజ్.. ఆ రికార్డును బద్దలు కొట్టాడు.  ఇక స్కాట్లాండ్ తో మ్యాచులో టీమిండియా 425 పరుగులు చేయగా.. తాజాగా భారత జట్టు ఉగాండాపై 405 స్కోరు చేయడం విశేషం. అంతేగాక ఈ మ్యాచులో 8 సిక్సర్లు బాదిన  రాజ్.. ఒక మ్యాచులో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా కూడా రికార్డులు నమోదు చేశాడు. గతంలో ఈ రికార్డు ఉన్ముక్త్ చంద్ (2012లో ఆస్ట్రేలియాపై) పేరిట ఉండేది.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by ICC (@icc)

ఇక ఈ మ్యాచులో సెంచరీ చేసిన రఘువంశీ కూడా  తొలుత సంయమనంతో బ్యాటింగ్ చేసినా తర్వాత  చెలరేగాడు. అతడి ఇన్నింగ్స్ లో 22 ఫోర్లు, నాలుగు సిక్సర్లున్నాయి. 

అనంతరం భారీ లక్ష్య ఛేదనలో ఉగాండా..  19.4 ఓవర్లలో 79 పరుగులకే చాప చుట్టేసింది.  భారత  బౌలర్ల ధాటికి ఆ జట్టులోకి ఏకంగా ఆరుగురు ఆటగాళ్లు డకౌట్ అయ్యారు. కెప్టెన్ పస్కల్ మురుంగి (34), రొనైడ్ (11) మినహా.. మిగిలినవారంతా క్రీజులో నిలబడటానికే ఇబ్బందులు పడ్డారు. దీంతో భారత జట్టు 326 పరుగుల తేడాతో భారీ విజయాన్ని నమోదు చేసింది. 

ఇక ఈ టోర్నీలో ఇప్పటికే క్వార్టర్స్ కు చేరిన భారత జట్టు.. ఈనెల 29న బంగ్లాదేశ్ తో జరిగే మ్యాచులో క్వార్టర్స్ లో తలపడనున్నది. కాగా.. మరోవైపు  పాకిస్థాన్.. ఆస్ట్రేలియా తో (జనవరి 28) పోటీ పడుతున్నది. 
 

click me!