Pak vs Aus: పాకిస్థాన్ సంచలన విజయం.. 20 ఏండ్ల తర్వాత ఆసీస్ పై సిరీస్ కైవసం..

Published : Apr 03, 2022, 12:23 PM IST
Pak vs Aus: పాకిస్థాన్ సంచలన విజయం.. 20 ఏండ్ల తర్వాత ఆసీస్ పై సిరీస్ కైవసం..

సారాంశం

Pakistan vs Australia ODI:  సుమారు 24 ఏండ్ల తర్వాత పాకిస్థాన్ పర్యటనకు వచ్చి టెస్టు సిరీస్ ను 1-0తో నెగ్గిన ఆస్ట్రేలియా పై  పర్యాటక దేశం ప్రతీకారం తీర్చుకుంది.   టెస్టు సిరీస్ కోల్పోయినా వన్డే సిరీస్ ను మాత్రం గెలుచుకుంది. 

తొలి వన్డే లో ఆసీస్ ది విజయం.. రెండో వన్డేలో పాక్ కు గెలుపు. ఇక సిరీస్ విజేతను నిర్ణయించే  నిర్ణయాత్మక మూడో వన్డేలో ఆస్ట్రేలియా చేతులెత్తేసింది. పాక్ బౌలర్లకు దాసోహమైంది.  బ్యాటింగ్ లో తడబడటంతో ఆ జట్టు  చివరి వన్డేతో పాటు ఏకంగా సిరీస్ ను కూడా కోల్పోయింది. లాహోర్ వేదికగా ముగిసిన మూడో వన్డేలో బాబర్ ఆజమ్ నేతృత్వంలోని పాకిస్థాన్ ఆల్ రౌండ్ షో చేసింది. తొలుత ఆసీస్ ను బ్యాటింగ్ లో 210 పరుగులకే పరిమితం చేసిన  పాక్.. తర్వాత బ్యాటింగ్ లో సునాయస విజయాన్ని అందుకుంది. 37 ఓవర్ల లోనే లక్ష్యాన్ని అందుకుంది.  బాబర్ ఆజమ్ సిరీస్ లో వరుసగా మరో సెంచరీ చేసి పాక్ కు విజయాన్ని అందించాడు. 

నిర్ణయాత్మక మూడో వన్డేలో టాస్ నెగ్గిన పాకిస్థాన్ బౌలింగ్ ఎంచుకుంది. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెడుతూ.. షాహీన్ అప్రిది, హరీస్ రౌఫ్ లు ఆసీస్  ఓపెనర్లను పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ కు పంపారు. ట్రావిస్ హెడ్ (0) ను  అఫ్రిది తొలి బంతికే  డకౌట్ చేయగా... ఆసీస్ సారథి ఫించ్ (0) ను రౌఫ్ ఎల్బీడబ్ల్యూగా వెనక్కి పంపాడు. 

నాలుగో స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన లబూషేన్ (4) కూడా విఫలమయ్యాడు. దీంతో ఆసీస్.. 6 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. ఆదుకుంటాడనుకున్న మెక్ డెర్మట్ (36), స్టోయినినస్ (19) లు కూడా క్రీజులో ఎక్కువసేపు నిలువలేదు.   ఫలితంగా 15 ఓవర్లలోనే ఆసీస్.. 5 వికెట్లు కోల్పోయి 67 పరుగులు చేసింది. 

 

ఈ క్రమంలో వికెట్ కీపర్ అలెక్స్  కేరీ (61 బంతుల్లో 56.. 6 ఫోర్లు, 1 సిక్సర్), కామెరాన్ గ్రీన్ (34) లు   వికెట్ల పతనాన్ని అడ్డుకున్నారు.  ఆరో వికెట్ కు ఈ జంట 81 పరుగులు జోడించిన అనంతరం.. వసీమ్ జూనియర్ ఈ జోడీని విడదీశాడు. 31 ఓవర్లో గ్రీన్ ను ఔట్ చేశాడు.   తర్వాత వచ్చిన అబోట్ (40 బంతుల్లో 49.. 6 ఫోర్లు, 1 సిక్సర్) కాస్త ధాటిగా ఆడే ప్రయత్నం చేశాడు. అయితే అతడికి  సహకారం అందించేవారు లేకపోవడంతో   ఆసీస్.. 41 ఓవర్లో 210 పరుగులకు ఆలౌట్ అయింది. పాక్ బౌలర్లలో హరీస్ రౌఫ్, మహ్మద్ వసీమ్ జూనియర్ లకు తలో 3 వికెట్లు దక్కగా షాహీన్ అఫ్రిది కి 2 వికెట్లు దక్కాయి. 

స్వల్ప లక్ష్య ఛేదనలో పాకిస్థాన్ ఆడుతూ పాడుతూ విజయాన్ని అందుకుంది. రెండో వన్డేలో సెంచరీలు చేసిన ఇమామ్ ఉల్ హక్, బాబర్ ఆజమ్ లు ఈ వన్డేలో కూడా రాణించారు. ఓపెనర్ ఫకర్ జమాన్ (17)  త్వరగానే నిష్క్రమించినా.. ఇమామ్ ఉల్ హక్ (100 బంతుల్లో 89 నాటౌట్) సాయంతో బాబర్ ఆజమ్ (115 బంతుల్లో 105 నాటౌట్.. 12 ఫోర్లు) క్రీజులో ఆఖరుదాకా నిలబడి పాక్ కు విజయాన్ని అందించాడు. 

2002 తర్వాత ఆస్ట్రేలియా పై పాక్ వన్డే సిరీస్ గెలవడం  ఇదే తొలిసారి కావడం గమనార్హం. అయితే  1998  తర్వాత  పలు కారణాల రీత్యా ఆసీస్.. పాక్ పర్యటనకు వెళ్లలేదు. 24 ఏండ్ల తర్వాత ఈ ఏడాదే పాక్ తో క్రికెట్ ఆడేందుకు ఇక్కడకు వచ్చింది.  టెస్టు సిరీస్ ను 1-0తో గెలచుకుని వన్డే సిరీస్ ను 1-2 తో ఓడిపోయింది.   ఆసీస్ పర్యటనలో చివరిదైన ఏకైక టీ20 ఈ నెల 5న  లాహోర్ లో జరుగుతుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IND vs SA : బుమ్రా, అర్షదీప్ దుమ్మురేపేందుకు రెడీ.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే !
Most ODI Runs : 2025లో వన్డే కింగ్ ఎవరు? కోహ్లీ రోహిత్‌ మధ్యలో బాబర్‌ !