
పాకిస్తాన్ క్రికెట్ బోర్డు, క్రికెటర్లు ప్రస్తుతం పీకల్లోతు కష్టాల్లో ఉన్న సంగతి తెలిసిందే. ఏ దేశం కూడా పాక్‌లో పర్యటించేందుకు సాహసించకపోవడం తదితర సంక్షోభాల్లో ఆ దేశ క్రికెట్ బోర్డు కొట్టుమిట్టాడుతోంది.
ఈ నేపథ్యంలో క్రికెటర్లకు ఇవ్వాల్సిన జీతభత్యాలు సైతం సరైన సమయానికి అందడం లేదు. ఇక జీవనోపాధి కోసం ఓ క్రికెటర్ వ్యాన్ డ్రైవర్‌గా పనిచేస్తుండటం అక్కడి పరిస్ధితిని అద్దం పడుతోంది.
పాక్ దేశవాళీల్లో ఆడిన మాజీ క్రికెటర్ ఫజాల్ షుబాన్ తన కుటుంబాన్ని పోషించుకునేందుకు వేరే గత్యంతరం లేక వ్యాన్ నడుపుతున్నాడు. దేశంలో తీసుకొచ్చిన కొత్త క్రికెట్ విధానం వల్ల తాను రోడ్డు మీద పడ్డానని ఫజాల్ ఆవేదన వ్యక్తం చేశాడు.
జాతీయ జట్టు తరపున ఆడటానికి తాను ఎంతగానో శ్రమించానని.. దీనిలో భాగంగా డిపార్ట్‌మెంటల్ క్రికెట్‌లో ఆడానని దీని వల్ల లక్ష వరకు జీతంగా వచ్చేదని ఫజాల్ తెలిపాడు. కానీ ప్రస్తుతం వాటిని మూసివేయడం వల్ల గత్యంతరం లేని పరిస్థితుల్లో వ్యాన్ డ్రైవర్‌గా మారాల్సి వచ్చిందని ఫజాల్ ఓ వీడియోలో తెలిపాడు.
సోషల్ మీడియాలో ఫజాల్ షుబాన్ వీడియో వైరల్ కావడంతో సదరు వీడియోను పాక్ క్రికెటర్ మహ్మద్ హఫీజ్ తన ట్వీట్టర్ ఖాతాలో షేర్ చేశాడు. పాకిస్తాన్ క్రికెట్ తీసుకొచ్చిన కొత్త పాలసీ వల్ల చాలా మంది ఇలా వీధిన పడ్డారని హఫీజ్ ఆవేదన వ్యక్తం చేశాడు.