T20 World Cup 2022: టీ20 ప్రపంచకప్ లో భాగంగా భారత జట్టు సోమవారం ఆస్ట్రేలియాతో తొలి వార్మప్ మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్ లో టీమిండియా మిడిలార్డర్ హీరో సూర్యకుమార్ యాదవ్ ఫిఫ్టీ రన్స్ తో జోరు కొనసాగించాడు.
ఆస్ట్రేలియా వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ వేటకు ముందు జరిగిన వార్మప్ మ్యాచ్ లో భారత్ ఉత్కంఠ విజయం అందుకుంది. కంగారూలతో జరిగిన తొలి వార్మప్ మ్యాచ్ లో భారత్.. ఆరు పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా మిడిలార్డర్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్.. 33 బంతుల్లో 50 పరుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు, ఒక సిక్స్ కూడా ఉన్నాయి. అయితే ప్రాక్టీస్ మ్యాచ్ కావడంతో సూర్య.. ఆడటానికి పెద్దగా ఆసక్తి చూపలేదు. స్టంప్స్ వద్ద ఉన్న మైక్ లో రికార్డైన అతడి మాటలను చూస్తే ఇదే అనుమానం రాక మానదు.
ఈ మ్యాచ్ లో సూర్య.. ఆస్ట్రేలియా బౌలర్లను ధీటుగా ఎదుర్కున్నాడు. స్టేడియం నలువైపులా షాట్లు ఆడాడు. తన కెరీర్ లో అత్యుత్తమ ఫామ్ లో ఉన్న సూర్య.. నేటి మ్యాచ్ లో హాఫ్ సెంచరీ ముగిసిన తర్వాత నాన్ స్ట్రైకింగ్ ఎండ్ లో ఉన్న అక్షర్ పటేల్ తో ‘కొట్టడానికి మూడ్ కూడా లేదు..’ అని చెబుతున్న వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
- Maarne ka mood hi nahi ho raha yaar
Got out very next ball pic.twitter.com/TWBM2zSAtA
సూర్య అన్న ఈ మాటలు స్టంప్స్ వద్ద ఉన్న మైక్ లో రికార్డ్ అయ్యాయి. సూర్య ఇలా అన్న తర్వాత బంతికే అతడు రిచర్డ్‌సన్ బౌలింగ్ లో అతడికే క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. సూర్య వీడియో వైరల్ అవడంతో పలువురు నెటిజన్లు దీనిమీద ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. ‘సూర్య భాయ్ ఈ మెగా టోర్నీలో ప్రత్యర్థి జట్ల మీద తన ప్రతాపం చూపడానికి గట్టిగానే ప్రిపేర్ అయి వచ్చినట్టున్నాడు. అందుకే ప్రాక్టీస్ మ్యాచ్ ఆడటానికి పెద్దగా ఆసక్తి చూపడం లేదు..’, ‘ఏం సూర్యా..? ప్రాక్టీస్ మ్యాచ్ అని మూడ్ రావడం లేదా..?’ అని కామెంట్స్ పెడుతున్నారు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 186 పరుగులు చేసింది. భారత జట్టులో కెఎల్ రాహుల్ (57), సూర్యకుమార్ యాదవ్ (50), దినేశ్ కార్తీక్ (20) లు రాణించారు. అనంతరం లక్ష్య ఛేదనలో ఆసీస్.. 20 ఓవర్లలో 180 పరుగులుకు ఆలౌట్ అయింది. ఆ జట్టు సారథి ఆరోన్ ఫించ్ (54 బంతుల్లో 76, 7 ఫోర్లు, 3 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. మిచెల్ మార్ష్ (18 బంతుల్లో 35, 4 ఫోర్లు, 2 సిక్సర్లు), మ్యాక్స్‌వెల్ (23) ఫర్వాలేదనిపించారు. కానీ ఆ తర్వాత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. చివరి ఓవర్ లో 11 పరుగులు కావాల్సి ఉండగా.. షమీ 4 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు తీశాడు. ఒక రనౌట్ కూడా అయింది. దీంతో ఆసీస్.. 180 రన్స్ కే ఆలౌట్ అయింది.