
వన్డే వరల్డ్ కప్ ముందు న్యూజిలాండ్ క్రికెట్ కు ఊహించని షాక్. పరిమిత ఓవర్లలో ఆ జట్టు సారథి కేన్ విలియమ్సన్.. అక్టోబర్ నుంచి భారత్ వేదికగా జరుగబోయే వన్డే వరల్డ్ కప్ లో ఆడేది అనుమానంగానే ఉంది. ఐపీఎల్-16లో భాగంగా గుజరాత్ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్న కేన్ విలియమ్సన్.. ఈ సీజన్ లో తొలి మ్యాచ్ లో ఆడుతూ గాయపడ్డాడు. చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ ఇచ్చిన క్యాచ్ ను అందుకోబోతూ గాయపడ్డ కేన్ మామ.. ఐపీఎల్ నుంచి తప్పుకున్న విషయం తెలిసిందే.
కుడి మోకాలికి గాయం కారణంగా కేన్ మామ శస్త్రచికిత్స చేయించుకోనున్నాడని సమాచారం. రుతురాజ్ క్యాచ్ పట్టే క్రమంలో గాల్లోకి ఎగిరి కింద పడే క్రమంలో విలియమ్సన్ మోకాలు గ్రౌండ్ కు బలంగా తాకింది. దీంతో మోకాలి ఎముక ఛిద్రం అయినట్టు స్కాన్ లలో వెల్లడికావడంతో సర్జరీ తప్పదని వైద్యులు సూచిస్తున్నారు.
రెండ్రోజుల క్రితమే ఐపీఎల్ నుంచి తప్పుకుని న్యూజిలాండ్ కు పయనమైన కేన్ మామ.. కివీస్ లో మోకాలికి సర్జరీ చేయించుకోనున్నాడని తెలుస్తున్నది. ఒకవేళ సర్జరీ చేయించుకుంటే అతడు కనీసం ఐదు నుంచి ఆరు నెలల పాటు మంచం పట్టాల్సిందే. ఆ తర్వాత కూడా ఫిట్నెస్ సాధించి తిరిగి క్రికెట్ ఆడటం అంటే మాటలు కాదు. దీంతో అతడు అక్టోబర్ నుంచి భారత్ లో జరిగే వన్డే వరల్డ్ కప్ లో ఆడటం అనుమానమేనని న్యూజిలాండ్ క్రికెట్ వర్గాలు తెలిపాయి. ఇది ఆ జట్టుకు భారీ షాకే.
2019 వన్డే వరల్డ్ కప్ లో కేన్ మామ టోర్నీ ఆసాంతం రాణించాడు. ఇంగ్లాండ్ వేదికగా జరిగిన ఆ టోర్నీలో అతడు ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ గా కూడా నిలిచాడు. కివీస్ ను ఫైనల్ కు చేర్చడంలో అతడి బ్యాటింగ్ తో పాటు సారథ్య వ్యూహాలు కూడా ఎంతో కీలకమయ్యాయి. కానీ ప్రస్తుతం కేన్ మామ సర్జరీకి వెళ్తే అది ప్రపంచకప్ లో కివీస్ విజయావకాశాలను దారుణంగా దెబ్బతీస్తుంది.
కాగా తనకు గాయమైన తర్వాత కేన్ మామ మాట్లాడుతూ.. ‘గత కొన్ని రోజులుగా నేను న్యూజిలాండ్ క్రికెట్ బోర్డుతో పాటు గుజరాత్ టైటాన్స్ నుంచి నేను ఊహించని మద్దతు పొందుతున్నాను. ఈ సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. టోర్నీ ప్రారంభంలోనే గాయపడటం కాస్త నిరాశే అయినప్పటికీ ప్రస్తుతం నా దృష్టి మొత్తం సర్జరీ మీదే ఉంది..’అని చెప్పడం గమనార్హం.