ఢిల్లీ వర్సెస్ పంజాబ్: ఈ మ్యాచ్ ఓడితే ఇక పంజాబ్ కూడా అస్సామే..!

By team teluguFirst Published Oct 20, 2020, 2:51 PM IST
Highlights

ఓడితే, ఇంటికే అనే పరిస్థితిలో సర్వశక్తులూ ఒడ్డుతున్న పంజాబ్‌ గత మ్యాచ్‌లో ముంబయిపై డబుల్‌ సూపర్‌ ఓవర్‌లో గెలుపొందింది. సింగిల్‌ సూపర్‌ ఓవర్‌లో ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది.

ఐపీఎల్‌ 2020 పాయింట్ల పట్టికలో దిగువన ఉన్న జట్లు తమ ప్రదర్శనకు అక్కడ ఉండటానికి అర్హత సాధించాయి. ఒక్క కింగ్స్‌ ఎలెవన్ పంజాబ్‌ తప్ప!. నిజమే, యుఏఈ పిచ్‌లపై పంజాబ్‌ ఆది నుంచీ అద్భుతంగానే రాణించింది.  

బ్యాటింగ్‌ లైనప్‌లో ఆ జట్టుకు తిరుగేలేదు. బౌలింగ్‌తో చివరి ఐదు ఓవర్లను మినహాయిస్తే.. ముంబయి, ఢిల్లీ లైనప్‌లకు దీటుగా కనిపిస్తుంది. అయినా, ఆ జట్టు ఆఖర్లో బోల్తా కొట్టి.. పరాజయాలు చవిచూసింది.  

బోల్తా వ్యవహరం ఢిల్లీ క్యాపిటల్స్‌ నుంచే మొదలైంది. మూడు బంతుల్లో ఒక్క పరుగు చేయాల్సిన దశలో సూపర్‌ ఓవర్‌ మీదకు తెచ్చుకున్న పంజాబ్‌.. అక్కడ రబాడ దెబ్బకు కుదేలైంది. వీటన్నింటికి తోడు అంపైర్‌ నితిన్‌ మీనన్‌ చేసిన షార్ట్‌ తప్పిదం పంజాబ్‌ను కోలుకోకుండా చేసింది. 

ఓడితే, ఇంటికే అనే పరిస్థితిలో సర్వశక్తులూ ఒడ్డుతున్న పంజాబ్‌ గత మ్యాచ్‌లో ముంబయిపై డబుల్‌ సూపర్‌ ఓవర్‌లో గెలుపొందింది. సింగిల్‌ సూపర్‌ ఓవర్‌లో ఓడించిన ఢిల్లీ క్యాపిటల్స్‌పై ప్రతీకారం తీర్చుకునేందుకు సిద్ధమవుతోంది.  తొలి మ్యాచ్‌ దుబాయ్‌లో జరుగగా.. నేడు సైతం పంజాబ్‌, ఢిల్లీలు అక్కడే తలపడనున్నాయి.  రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ స్టార్‌స్పోర్ట్స్‌లో ప్రసారం కానుంది.

బ్యాటింగ్‌ ఆర్డర్‌ మారాలి!

ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇద్దరు స్పిన్నర్లు ఉన్నారు. అశ్విన్‌, అక్షర్‌ పటేల్‌లకు పంజాబ్‌ టాప్ ఆర్డర్‌పై మంచి రికార్డుంది. దీంతో కెఎల్‌ రాహుల్‌-మయాంక్‌ అగర్వాల్‌ ఓపెనింగ్‌ జోడీ సహా బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పలు చేయటం మంచిది. 

రాహుల్‌ జతగా క్రిస్‌ గేల్‌ను ఓపెనర్‌గా పంపితే.. మిడిల్‌ ఆర్డర్‌లో కుడి, ఎడమ కాంబినేషన్‌కు సైతం కుదురుతుంది.  పవర్‌ ప్లేలో రబాడ, నోర్జె బౌలింగ్‌ణు గేల్‌ ఆడే అవకాశం దక్కుతుంది. అయితే, ఇవన్నీ పంజాబ్‌ లక్ష్యాన్ని నిర్దేశిస్తుందా? ఛేదిస్తుందా? అనే అంశాలను బట్టి ఆధారపడి ఉంటుంది.  నికోలస్‌ పూరన్‌, మాక్స్‌వెల్‌లపై బాధ్యత మరింత పెరగనుంది.

యువ షా మెరిసేనా?

పవర్‌ ప్లే చిచ్చరపిడుగు పృథ్వీ షా గత మూడు మ్యాచులుగా విఫలమవుతున్నాడు. చివరి రెండు మ్యాచుల్లోనూ సున్నా పరుగులకే వికెట్‌ కోల్పోయాడు. ట్రెంట్‌ బౌల్ట్‌, జోఫ్రా ఆర్చర్‌, దీపక్‌ చాహర్‌లు షాను సులువుగా వెనక్కి పంపించారు. 

చెన్నైపై యాంకర్‌ రోల్‌ నుంచి హిట్టర్‌గా మారి శతకబాదిన శిఖర్‌ ధావన్‌ మంచి ఫామ్‌లో ఉన్నాడు. రిషబ్‌ పంత్‌ లేకపోయినా.. ఢిల్లీ బ్యాటింగ్‌ లైనప్‌ బేషుగ్గానే కనిపిస్తోంది. కెప్టెన్‌ శ్రేయస్ అయ్యర్‌, అలెక్స్‌ కేరీలు కీలకం కానున్నారు. ఈ సీజన్‌లో అంచనాలకు మించి ఆడుతున్న మార్కస్‌ స్టోయినిస్‌ గత మ్యాచ్‌లో పంజాబ్ ఆశలపై నీళ్లు పోశాడు. ఈ మ్యాచ్‌లో స్టోయినిస్‌ ఏం చేస్తాడో చూడాలి.

ప్లేయింగ్‌ ఎలెవన్‌ (అంచనా)

ఢిల్లీ క్యాపిటల్స్‌: పృథ్వీ షా, శిఖర్‌ ధావన్‌, అజింక్య రహానె, శ్రేయాస్‌ అయ్యర్‌ (కెప్టెన్‌), మార్కస్‌ స్టోయినిస్‌, అలెక్స్‌ కేరీ (వికెట్‌ కీపర్‌), అక్షర్‌ పటేల్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, తుషార్‌ దేశ్‌పాండే, కగిసో రబాడ, ఎన్రిచ్‌ నోక్యా.

కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: కెఎల్‌ రాహుల్‌ (కెప్టెన్‌, వికెట్‌ కీపర్‌), మయాంక్‌ అగర్వాల్‌, క్రిస్‌ గేల్‌, నికోలస్‌ పూరన్‌, గ్లెన్‌ మాక్స్‌వెల్‌, దీపక్‌ హుడా, క్రిస్‌ జోర్డాన్‌, మురుగన్‌ అశ్విన్‌, రవి బిష్ణోయ్‌, మహ్మద్‌ షమి, అర్షదీప్‌ సింగ్‌. 

click me!