INDW vs AUSW: ఆస్ట్రేలియాను అదరగొట్టిన మిథాలీసేన... డ్రాగా ముగిసిన పింక్ బాల్ టెస్టు...

By Chinthakindhi RamuFirst Published Oct 3, 2021, 5:10 PM IST
Highlights

బౌలింగ్, బ్యాటింగ్‌లో అదరగొట్టిన భారత అమ్మాయిలు... ఆతిథ్య జట్టుపై భారీ ఆధిక్యం... డ్రాగా ముగిసిన చారిత్రక పింక్ బాల్ టెస్టు...

మొట్టమొదటి పింక్ బాల్ టెస్టులో భారత మహిళా జట్టు, అద్భుత ప్రదర్శన కనబర్చింది. ఆతిథ్య ఆస్ట్రేలియాను ముప్పుతిప్పలు పెట్టి, తిరుగులేని ఆధిక్యం చూపించింది... మొదట బ్యాటింగ్ చేసిన భారత మహిళా జట్టు, 8 వికెట్లు కోల్పోయి 377 పరుగుల భారీ స్కోరు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది.

భారత యంగ్ సెన్సేషనల్ ఓపెనర్ స్మృతి మంధాన 216 బంతుల్లో 22 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 127 పరుగులు చేసి, పింక్ బాల్ టెస్టులో సెంచరీ చేసిన మొట్టమొదటి భారత మహిళా క్రికెటర్‌గా రికార్డు క్రియేట్ చేసింది...

షెఫాలీ వర్మ 31, పూనమ్ రౌత్ 36, మిథాలీరాజ్ 30, దీప్తి శర్మ 66 పరుగులు చేశారు... తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా వుమెన్స్ జట్టు 9 వికెట్లు కోల్పోయి 241 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఎలీసా పెర్రీ 68 పరుగులు, గార్నర్ 51 పరుగులు చేసి ఆసీస్‌ను ఫాలో ఆన్ నుంచి కాపాడారు.

రెండో ఇన్నింగ్స్‌లో షెఫాలీ వర్మ 52 పరుగులు, స్మృతి మంధాన 31, పూనమ్ రౌత్ 41 పరుగులు చేయడంతో 37 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 135 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది... 271 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన ఆస్ట్రేలియా జట్టు, 15 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 36 పరుగులు చేసింది.

నాలుగు రోజుల టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసినా... నాలుగు రోజుల పాటు ఆతిథ్య జట్టుపై తిరుగులేని ఆధిక్యం చూపించింది టీమిండియా. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ చేసిన స్మృతి మంధానకి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.. 

click me!