విరాట్ కోహ్లీ రికార్డుల మోత: బౌలర్లలో షమీ టాపర్

By telugu teamFirst Published Dec 23, 2019, 11:39 AM IST
Highlights

వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డే మ్యాచులో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. పలు రికార్డులను విరాట్ కోహ్లీ తన ఖాతాలో వేసుకున్నాడు. జాక్విస్ కలిస్ రికార్డును సమం చేశాడు.

కటక్: వెస్టిండీస్ తో జరిగిన మూడో వన్డేలో  టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ రికార్డుల మోత మోగించాడు. విండీస్ పై మూడు మ్యాచుల సిరీస్ ను భారత్ 2-1 స్కోరుతో గెలుచుకున్న విషయం తెలిసిందే. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన విరాట్ కోహ్లీకి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. 

దాంతో విరాట్ కోహ్లీ అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డులు గెలుచుకు్న క్రికెటర్ల జాబితాలో దక్షిణాఫ్రికా ఆటగాడు జాక్విస్ కలిస్ (57 సార్లు)  రికార్డును సమం చేశాడు. ఈ జాబితాలో సచిన్ టెండూల్కర్ (76సార్లు), శ్రీలంక మాజీ ఓపెనర్ సనత్ జయసూర్య (58 సార్లు) తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

కోహ్లీ మరో ఘనతను కూడా సాధించాడు. వన్డేల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో కలిస్ (11,579)ను అధిగమించి ఏడో స్థానానికి చేరుకున్నాడు. ఈ జాబితాలో కోహ్లీ న్నా ముందు సచిన్ (18,579), కుమార సంగక్కర (11,234), రికీ పాంటింగ్ (13,704), జయసూర్య (13,430), జయవర్ధనే (12,650), ఇంజమాముల్ హక్ (11,739) ఉన్నారు. 

ఈ ఏడు మూడు ఫార్మాట్లలో కలిపి 2,455 పరుగులు చేసిన కోహ్లీ అరుదైన రికార్డు సాధించాడు. వరుసగా నాలుగేళ్లు అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. 2016లో 2,595, 2017లో 2,818, 2018లో 2,735 పరుగులు చేశాడు.

ఈ ఏడాది వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలరుగా మొహమ్మద్ షమీ రికార్డు నెలకొల్పాడు. షమీ 21 ఇన్నింగ్సుల్లో 42 వికెట్లు తీశాడు. ప్రపంచ కప్ పోటీల్లో అతను హ్యాట్రిక్ సాధించాడు. 

వన్డేల్లో వేగంగా 3వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా వెస్టిండీస్ బ్యాట్స్ మన్ హోప్ (67 ఇన్నింగ్సుల్లో) రికార్డు నెలకొల్పాడు. దక్షిణాఫ్రికా బ్యాట్స్ మన్ హషీమ్ ఆమ్లా (57 ఇన్నింగ్సుల్లో) తొలి స్థానంలో నిలిచాడు. 

ఈ మ్యాచులో పూరన్, పోలార్డు నెలకొల్పిన 135 పరుగుల భాగస్వామ్యమే వెస్టిండీస్ తరఫున ఇండియాపై ఐదో వికెట్ కు అత్యుత్తమ భాగస్వామ్యం కావడం విశేషం.

click me!