ఫాలో ఆన్‌లోనూ చతికిలపడ్డ సఫారీలు: పుణే టెస్టులో భారత్ ఘన విజయం

By narsimha lodeFirst Published Oct 13, 2019, 3:20 PM IST
Highlights

పుణేతో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో గెలుపొందటంతో పాటు సిరీస్‌ను సైతం కైవసం చేేసుకుంది.

పుణేలో దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో గెలుపొందటంతో పాటు సిరీస్‌ను సైతం కైవసం చేేసుకుంది.

మూడో రోజు 275 పరుగులకే ఆలౌటై నాలుగో రోజు దక్షిణాఫ్రికా ఫాలో ఆన్ ఆడింది. ఇన్నింగ్స్ ప్రారంభించిన కాసేపటికే ఓపెనర్ మార్కరమ్ వికెట్‌ను కోల్పోయింది. ఇషాంత్ శర్మ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి మార్కరమ్ ఎల్బీగా వెనుదిరిగాడు.

దీంతో ప్రత్యర్థి జట్టులో కలవరం మొదలైంది. కొద్దిసేపటికే డిబ్రుయిన్‌ను ఉమేశ్ శర్మ బోల్తా కొట్టించడంతో సఫారీలు రెండో వికెట్‌ను కోల్పోయారు. ఆ తర్వాత కెప్టెన్ డుప్లిసెస్‌.. అశ్విన్ మాయాజాలానికి బలయ్యాడు.

కొద్దిసేపు భారత బౌలర్లను ప్రతిఘటించిన ఎల్గర్‌ను కూడా అశ్విన్ పెవిలియన్‌కి పంపాడు. 74 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన జట్టును డికాక్, తెంబ బవుమా ఆదుకునేందుకు ప్రయత్నించినప్పటికీ భారత బౌలర్ల ముందు నిలబడలేకపోయారు.

వెంట వెంటనే వికెట్లను కోల్పోయి 189 పరుగులకే దక్షిణాఫ్రికా ఆలౌటైంది. దీంతో భారత్ ఇన్నింగ్స్ 137 పరుగుల తేడాతో విజయం సాధించింది. సౌతాఫ్రికా బ్యాట్స్‌మెన్లలో ఎల్గర్ 48, బావుమా 38, ఫిలాండర్ 37 పరుగులు చేసి ఆ మాత్రం స్కోరునైనా చేసేందుకు సాయపడ్డారు.

టీమిండియా బౌలర్లలో ఉమేశ్ యాదవ్ 3, రవీంద్ర జడేజా 3, అశ్విన్ 2, ఇషాంత్, షమీలు తలో వికెట్ పడగొట్టారు. ఈ విజయం ద్వారా భారత్ 2-0తో సిరీస్‌ కైవసం చేసుకోవడంతో పాటు సొంతగడ్డపై వరుస సిరీస్ విజయాలు నమోదు చేసి ప్రపంచ రికార్డు నమోదు చేసింది. 

స్కోర్ల వివరాలు
భారత్ తొలి ఇన్నింగ్స్: 601/5
దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్: 275 ఆలౌట్
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్: 189 ఆలౌట్

click me!