ఇండియా- పాక్ మ్యాచ్ అనగానే వచ్చేసిన వాన... భారీ వర్షంతో ఆగిన ఆట..

By Chinthakindhi Ramu  |  First Published Sep 10, 2023, 5:00 PM IST

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ సూపర్ 4 మ్యాచ్‌కి వరుణుడి అంతరాయం.. వర్షం వల్ల ఆట నిలిచే సమయానికి 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసిన భారత జట్టు...


వరుణుడికి టీమిండియా అంటే ప్రత్యేకమైన అభిమానం. అందుకే ఇంగ్లాండ్ వెళ్లినా, ఆస్ట్రేలియా వెళ్లినా వెంటే వచ్చేస్తాడు. ప్రస్తుతం ఆసియా కప్ 2023 టోర్నీలోనూ వరుణుడు, టీమిండియాని వదలడం లేదు. ఇప్పటికే గ్రూప్ స్టేజీలో ఇండియా - పాకిస్తాన్ మధ్య మ్యాచ్ వర్షం కారణంగా ఫలితం తేలకుండా ఆగిపోయింది. సూపర్ 4 రౌండ్‌లో భాగంగా కొలంబోలో జరుగుతున్న మ్యాచ్‌కి కూడా వర్షం వల్ల అంతరాయం కలిగింది..

వాన వల్ల ఆట నిలిచే సమయానికి 24.1 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 147 పరుగులు చేసింది భారత జట్టు. కెఎల్ రాహుల్ 28 బంతుల్లో 2 ఫోర్లతో 17 పరుగులు, విరాట్ కోహ్లీ 16 బంతుల్లో 8 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.  అంతకుముందు రోహిత్ శర్మ, శుబ్‌మన్ గిల్ కలిసి తొలి వికెట్‌కి 121 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి, శుభారంభం అందించారు. అయితే హాఫ్ సెంచరీలు పూర్తి చేసుకున్న తర్వాత ఈ ఇద్దరూ వెంటవెంటనే అవుట్ అయ్యారు. 

Latest Videos

ఇదే వేదికపై శ్రీలంక, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి అయ్యింది. నేటి మ్యాచ్‌ కూడా అలాగే పూర్తి అవ్వాలని ఇరుదేశాల క్రికెట్ ఫ్యాన్స్ కోరుకున్నారు. అయితే భారత జట్టు సగం ఇన్నింగ్స్ కూడా ముగియకుండానే వరుణుడు ఎంట్రీ ఇచ్చేశాడు. ఒక్కసారిగా భారీ వర్షం కురవడంతో వాన తగ్గినా, అవుట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభం కావడానికి సమయం పడుతుంది. 

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టుకి భారత ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం అందించారు.. షాహీన్ షా ఆఫ్రిదీ వేసిన ఇన్నింగ్స్ మొదటి ఓవర్ ఆఖరి బంతికి సిక్సర్ బాది, ఖాతా తెరిచాడు రోహిత్ శర్మ. వన్డే క్రికెట్ చరిత్రలో షాహీన్ వేసిన తొలి ఓవర్‌లో సిక్సర్ బాదిన మొట్టమొదటి బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు ఏ బ్యాటర్ కూడా వన్డేల్లో షాహీన్ మొదటి ఓవర్‌లో సిక్సర్ కొట్టలేకపోయారు. 

శుబ్‌మన్ గిల్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 38 బంతుల్లో 28 పరుగులే చేసిన రోహిత్ శర్మ, షాదబ్ ఖాన్ వేసిన ఇన్నింగ్స్ 13వ ఓవర్‌లో 6, 6, 4 బాది 19 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత షాదబ్ ఖాన్ ఖాన్ ఓవర్‌లో 6, 4 బాది 43 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు..  పాకిస్తాన్‌పై ఆసియా కప్‌‌లో రోహిత్‌కి ఇది ఆరో హాఫ్ సెంచరీ..

ఆసియా కప్ చరిత్రలో ఒకే జట్టుపై అత్యధిక 50+ స్కోర్లు చేసిన బ్యాటర్‌గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు రోహిత్ శర్మ. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, శ్రీలంకపై 5 సార్లు 50+ స్కోర్లు చేశాడు. 

click me!