
స్వదేశంలో అయినా ఐర్లాండ్ వెళ్లినా, ఇంగ్లాండ్ వెళ్లినా టీమిండియాని వరుణుడు పరీక్ష పెడుతూనే ఉన్నాడు. కరోనా కారణంగా 9 నెలల తర్వాత జరుగుతున్న నిర్ణయాత్మక ఐదో టెస్టును వర్షం వదలడం లేదు. తొలి రోజు వర్షం కారణంగా దాదాపు 20 ఓవర్ల ఆట తుడిచిపెట్టుకుపోగా రెండో రోజు కూడా వరుణుడు ప్రత్యక్షమయ్యాడు...
టీమిండియా ఆలౌట్ అయిన తర్వాత ఇంగ్లాండ్ బ్యాటింగ్ మొదలెట్టిన తర్వాత సరిగ్గా 7 ఓవర్లు కూడా ఆట సాగకముందే ఇప్పటికే రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించింది. వర్షం కారణంగా ఆట నిలిచే సమయానికి తొలి ఇన్నింగ్స్‌లో 6.3 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 31 పరుగులు చేసింది ఇంగ్లాండ్...
9 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు చేసిన అలెక్స్ లీస్‌ని జస్ప్రిత్ బుమ్రా, 3వ ఓవర్ ఆఖరి బంతికి క్లీన్ బౌల్డ్ చేశాడు. లీస్ అవుట్ కాగానే వర్షం కురవడంతో మ్యాచ్‌కి కాసేపు నిలిచిపోయింది. కొద్దిసేపటి తర్వాత వర్షం చినుకులు ఆగడంతో తిరిగి ఆట ప్రారంభమైంది. 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 9 పరుగులు చేసిన మరో ఓపెనర్ జాక్ క్రావ్లే కూడా బుమ్రా బౌలింగ్‌లో శుబ్‌మన్ గిల్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
27 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది ఇంగ్లాండ్. ఓల్లీ పోప్ 5 బంతుల్లో ఓ ఫోర్‌తో 6 పరుగులు, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ జో రూట్ 10 బంతుల్లో 2 పరుగులు చేసి క్రీజులో ఉన్నారు.
వర్షం కారణంగా విలువైన సమయం వృథా కావడంతో ఆటను రాత్రి 7 గంటల వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు అధికారులు. భారత కాలమానం ప్రకారం రాత్రి 11:30 గంటలకు రెండో రోజు ఆట ముగియనుంది.
అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 338/7 వద్ద రెండో రోజు బ్యాటింగ్ మొదలెట్టిన టీమిండియా, 84.5 ఓవర్లలో 416 పరుగులకి ఆలౌట్ అయ్యింది. శుబ్‌మన్ గిల్ 17, ఛతేశ్వర్ పూజారా 13, హనుమ విహారి 20, విరాట్ కోహ్లీ 11, శ్రేయాస్ అయ్యర్ 15 పరుగులు చేసి అవుట్ కావడంతో 98 పరుగులకే 5 వికెట్లు కోల్పోయిన భారత జట్టును రిషబ్ పంత్, రవీంద్ర జడేజా కలిసి ఆదుకున్నారు...
ఆరో వికెట్‌కి 222 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన రిషబ్ పంత్ 111 బంతుల్లో 20 ఫోర్లు, 4 సిక్సర్లతో 146 పరుగులు చేసి జో రూట్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. శార్దూల్ ఠాకూర్ 12 బంతుల్లో ఒక్క పరుగు చేసి అవుట్ కాగా మహ్మద్ షమీతో కలిసి 8వ వికెట్‌కి 48 పరుగులు జోడించాడు రవీంద్ర జడేజా...
31 బంతుల్లో 3 ఫోర్లతో 16 పరుగులు చేసిన మహ్మద్ షమీని స్టువర్ట్ బ్రాడ్ అవుట్ చేయగా 194 బంతుల్లో 13 ఫోర్లతో 104 పరుగులు చేసి టెస్టుల్లో మూడో సెంచరీ నమోదు చేశాడు రవీంద్ర జడేజా.. జడ్డూని జేమ్స్ అండర్సన్ క్లీన్ బౌల్డ్ చేయగా క్రీజులోకి వస్తూనే బౌండరీల మోత మోగించాడు జస్ప్రిత్ బుమ్రా...
స్టువర్ట్ బ్రాడ్ బౌలింగ్‌లో ఇన్నింగ్స్ 84వ ఓవర్‌లో రెండు సిక్సర్లు, 3 ఫోర్లతో 29 పరుగులు రాబట్టాడు జస్ప్రిత్ బుమ్రా. ఈ ఓవర్‌లో ఎక్స్‌ట్రాలతో కలిపి 35 పరుగులు సమర్పించిన స్టువర్ట్ బ్రాడ్, టెస్టు క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సమర్పించిన బౌలర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు చేసిన జస్ప్రిత్ బుమ్రా నాటౌట్‌గా నిలవగా మహ్మద్ సిరాజ్ 6 బంతుల్లో 2 పరుగులు చేసి అండర్సన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...
టెస్టు క్రికెట్ చరిత్రలో 32వ సారి 5 వికెట్ల ఫీట్‌ని నమోదు చేశాడు జేమ్స్ అండర్సన్. మ్యాటీ ప్యాట్స్‌కి రెండు వికెట్లు దక్కగా స్టువర్ట్ బ్రాడ్, బెన్ స్టోక్స్, జో రూట్ తలా ఓ వికెట్ తీశారు.