అండర్19 వరల్డ్ కప్‌లో టీమిండియా జోరు... యూఏఈపై భారీ విజయం..

By Srinivas MFirst Published Jan 16, 2023, 4:27 PM IST
Highlights

ICC Under-19 Women's World Cup:   యూఏఈపై 122 పరుగుల తేడాతో భారీ విజయం అందుకున్న టీమిండియా... 

మహిళల అండర్ - 19 వరల్డ్ కప్ లో  టీమిండియా  వరుసగా రెండో విజయాన్ని అందుకుంది. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో 122 పరుగుల తేడాతో ఘన విజయాన్ని నమోదు చేసింది.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన  టీమిండియా.. నిర్ణీత  20 ఓవర్లలో  3 వికెట్లు మాత్రమే కోల్పోయి  219 పరుగుల భారీ స్కోరు చేసింది.  అండర్19 టీ20 వరల్డ్ కప్‌లో 200+ స్కోరు చేసిన మొట్టమొదటి జట్టుగా నిలిచింది టీమిండియా... 

కెప్టెన్ షఫాలీ వర్మ.. 34 బంతుల్లోనే  12 ఫోర్లు , 4 సిక్సర్ల సాయంతో  78 పరుగులు చేయగా, శ్వేతా  సెహ్రావత్ 49 బంతుల్లో 10 ఫోర్ల సాయంతో   74 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచింది.  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ కు వచ్చిన భారత్ తొలి నుంచే దాటిగా ఆడింది.  ముఖ్యంగా కెప్టెన్ షఫాలీ ఆకాశమే హద్దుగా రెచ్చిపోయింది. తొలి ఓవర్లో  శ్వేతా.. మూడు బౌండరీలు బాదింది. తర్వాత షఫాలీ కూడా   అదేబాట పట్టింది. వైష్ణవి వేసిన  ఐదో ఓవర్లో కూడా ఇదే ఫీట్ రిపీట్ అయింది.  

27 బంతుల్లోనే షఫాలీ హాఫ్ సెంచరీ పూర్తయింది.  అర్థ సెంచరీ తర్వాత  ఆమె మరింతగా రెచ్చిపోయింది.  లావణ్య కెనీ వేసిన 8వ ఓవర్లో రెండు భారీ సిక్సర్లు బాదింది. దీంతో భారత స్కోరు 8 ఓవర్లు ముగిసేసరికే వంద దాటింది. అయితే  ఆ తర్వాత ఓవర్లోనే షఫాలీని ఇందూజా నందకుమార్  ఔట్ చేసింది.   తొలి వికెట్ కు ఈ ఇద్దరూ  111 పరుగులు జోడించారు. 

షఫాలీ నిష్క్రమించినా భారత స్కోరు వేగం తగ్గలేదు. వన్ డౌన్ లో వచ్చిన  వికెట్ కీపర్ రిచా ఘోష్ (29 బంతుల్లో 49, 5 ఫోర్లు, 2 సిక్సర్లు)  తో కలిసి  శ్వేతా ఇన్నింగ్స్ ను నడిపించింది.  కెప్టెన్ అవుట్ అయ్యాక  శ్వేతా బ్యాట్ కు పనిచెప్పింది. లావణ్య వేసిన  13వ ఓవర్లో రెండు వరుస ఫోర్లు బాదింది. తర్వాత ఓవర్లో సింగిల్ తీసి  34 బంతుల్లో అర్థ సెంచరీ  పూర్తి చేసుకుంది. 15 ఓవర్లకు భారత్ స్కోరు 164-1 గా ఉంది.  

ఇక చివర్లో రిచా తో పాటు తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషా (11) ధాటిగా ఆడే క్రమంలో నిష్క్రమించినా  శ్వేత  భారత్ స్కోరును 200 దాటించింది. భారత బ్యాటర్ల ధాటికి యూఏఈ బౌలర్లు భారీగా పరుగులిచ్చుకున్నారు. 

220 పరుగుల లక్ష్య ఛేదనలో బ్యాటింగ్ కు వచ్చిన యూఏఈ  20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 97 పరుగులు మాత్రమే చేయగలిగింది.  కెప్టెన్ తీర్థ సతీష్  (16) తో పాటు సమైర (9), రినితా రజిత్ (2) లు పెవిలియన్ చేరారు.  లావణ్య కెనీ 24, మెహికా గౌర్ 26 పరుగులు చేశారు. 

click me!