
సూపర్-12 కు అర్హత సాధించాలంటే తప్పక నెగ్గాల్సిన కీలక మ్యాచ్ లో నమీబియా (Namibia) అదరగొట్టింది. గ్రూప్-ఏ క్వాలిఫయర్ లో భాగంగా నమీబియా-ఐర్లాండ్ (Namibia vs Ireland) మధ్య జరిగిన కీలక పోరులో నమీబియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. టాస్ నెగ్గిన ఐర్లాండ్ (ireland) బ్యాటింగ్ ఎంచుకోగా.. నమీబియా బౌలర్ల ధాటికి ఆ జట్టు 125 పరుగులు మాత్రమే చేయగలిగింది. అనంతరం బ్యాటింగ్ చేసిన నమీబియా.. 18.3 ఓవర్లలోనే 2 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. తాజా విజయంతో గ్రూప్-ఏ నుంచి ఆ జట్టు సూపర్-12 కు అర్హత సాధించింది.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఐర్లాండ్ కు శుభారంభమే దక్కింది. ఆ జట్టు ఓపెనర్లు స్టిర్లింగ్ (24 బంతుల్లో 38), కెవిన్ ఓబ్రైన్ (25) రాణించారు. తొలి వికెట్ కు వీరిద్దరూ 7.2 ఓవర్లలోనే 62 పరుగులు జోడించారు. కానీ స్కాల్ట్జ్ ఈ జోడీని విడదీశాడు. స్టిర్లింగ్ ఔటయ్యాక వచ్చిన కెప్టెన్ బల్బైర్నీ (28 బంతుల్లో 21) కొద్దిసేపు క్రీజులో నిలిచే ప్రయత్నం చేశాడు.
ఈ దశలో బంతిని అందుకున్న జాన్ ఫ్రిలింక్.. కెవిన్ ఒబ్రైన్ ను ఔట్ చేసి ఐర్లాండ్ ఇన్నింగ్స్ పతనానికి అంకురార్పణ చేశాడు. ఆ తర్వాత వచ్చిన బ్యాట్స్మెన్ ఎవరూ రెండంకెల స్కోరు చేయలేదు. కొద్దిసేపు నిలిచిన సారథి కూడా 16 ఓవర్లో ఫ్రిలింక్ బౌలింగ్ లోనే ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు.
ఐర్లాండ్ కెప్టెన్ ఔటయ్యాక ఆ జట్టు బ్యాట్స్మెన్ అంతా క్రీజులోకి చుట్టపుచూపుగా వచ్చి వెళ్లారు. ఫలితంగా 16.1 ఓవర్లకు 101/4 గా ఉన్న ఐర్లాండ్.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 125 పరుగులు మాత్రమే చేసింది. నమీబియా బౌలర్లలో ఫ్రిలింక్ మూడు వికెట్లు తీయగా.. వీస్ (2), స్మిత్, స్కాల్ట్జ్ తలో వికెట్ పడగొట్టారు.
అనంతరం 126 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నమీబియా.. ఆచితూచి ఆడింది. ఓపెనర్ క్రెయిగ్ విలిమయ్స్ (15), వికెట్ కీపర్ జేన్ గ్రీన్ (32 బంతుల్లో 24) నిదానంగా ఆడారు. ఎక్కడా భారీ షాట్లకు పోకుండా సింగిల్స్, డబుల్స్ తో స్కోరు బోర్డును నడిపించారు. దీంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు విలియమ్స్ వికెట్ కోల్పోయి 33 పరుగులు చేసింది.
ఓపెనర్లిద్దరూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ గెర్హర్డ్ (49 బంతుల్లో 53) కూడా నింపాదిగానే ఆడాడు. కానీ సాధించాల్సిన రన్ రేట్ పెరుగుతుండటంతో మరో ఎండ్ లో డేవిడ్ వీస్ (14 బంతుల్లో 28) గేర్ మార్చాడు. క్రెయిగ్ యంగ్ వేసిన 14 వ ఓవర్లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. 16 వ ఓవర్లో నమీబియా వంద పరుగులకు చేరుకున్నది.
అప్పటిదాకా నెమ్మదిగా ఆడిన గెర్హర్డ్ కూడా జోరు పెంచాడు. 17వ ఓవర్ వేసిన సిమి సింగ్ బౌలింగ్ లో సిక్సర్ బాదాడు. ఆ తర్వాత ఓవర్లోనే ఫోర్ కొట్టి హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 18 వ ఓవర్లో యంగ్ వేసిన బంతిని వీస్ బౌండరీకి తరలించడంతో నమీబియా సూపర్-12కు దూసుకెళ్లింది. ఇదిలాఉండగా.. గ్రూప్-ఏ నుంచి సూపర్ 12 బెర్త్ కన్ఫర్మ్ చేసుకున్న నమీబియా.. నవంబర్ 8న విరాట్ కోహ్లి సారథ్యంలోని టీమిండియాతో ఆడనున్నది.
ఐర్లాండ్ బౌలర్లలో కర్టిస్ క్యాంపర్ కు రెండు వికెట్లు దక్కాయి. మిగిలిన బౌలర్లంతా కట్టుదిట్టంగా బంతులు వేసినా వికెట్లు మాత్రం పడగొట్టలేకపోయారు. ఈ ఓటమితో ఐర్లాండ్.. టోర్నీ నుంచి నిష్క్రమించింది. బంతితో పాటు బ్యాట్ తోనూ రాణించిన వీస్ కే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ దక్కింది.